BRS MLC Ravinder Rao : సొంత నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు - దారి మార్చేస్తున్నారా ?
BRS internal politics : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు వరంగల్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. వారికి సెక్యూరిటీ అవసరం లేదని కుక్కలు కూడా దేకవన్నారు.
BRS MLC Ravinder Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ ఆత్మ గౌరవం ఉన్న జిల్లా అయిన వరంగల్ నుంచి ఎర్రబెల్లి, సత్యవతికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధ పడ్డారాన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో జర్నలిస్ట్ లతో చిట్..చాట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాదం, ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవి ఇస్తే ఎట్లా అధినేత వాస్తవాలు వినే అవకాశం ఇస్తే ఎవరైనా చెబుతారు వాస్తవాలు చెప్పే వారు బయట, జోకుడు గాల్లు లోపల ఉంటే ఎలా వాస్తవాలు తెలుస్తాయి అని వ్యాఖ్యనించారు.
ఖమ్మంలో ప్రతిసారి బయట గెలిచిన వారిని పార్టీలోకి తెచ్చుకుంటే నేతలు గ్రూపులుగా విడిపోయారు. ఎర్రబెల్లిని మంచి లీడర్ అంటే ప్రజలు ఉరికించి కొడతారు. ఎర్రబెల్లి చక్కిలి గింతలు పెట్టడం తప్పా ఎవ్వరికీ రూపాయి సహాయం చేయరు. కొన్ని జిల్లాల్లో మా ఎమ్మేల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారు. దానిని ఎలా మేనేజ్ చేయాలో పార్టీకి ప్లాన్ లేకపోతే ఎలా గెలుస్తాం అన్నారు. వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదు కుక్కలు కూడా వారి వెంట పడవు అని సెటైర్లు వేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, స్టేషన్ ఘనపూర్ మినహాయించి మిగతా పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అసలు అధికారంలో లేక బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ తెగ మదన పడుతున్న వేళ, పుండు మీద కారం చల్లినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. తక్కెళ్లపల్లి రవీందర్ రావు కూడా టీడీపీ నుంచే బీఆర్‌ఎస్ లోకి వెళ్లారు. కానీ ఆయన ఉద్యమం ఊపందుకోక ముందే వెళ్లారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా చేశారు.అయితే ఆయనకు కేసీఆర్ ఎప్పుడూ టిక్కెట్ కేటయించలేదు. ఉద్యమం ఊపందుకుని గెలుపు ఖాయమని భావించిన తర్వాత కొత్త నేతలు వచ్చి చేరడంతో ఆయనకు అవకాశాలు మిస్ అయ్యాయి.
చివరికి 2021లో ఆయనకు ఎమ్మెల్యేకోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు కేసీఆర్. కానీ ఆయనకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రుల ఉండటంతో ఆయనకు పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా ప్రాధాన్యం లభించడం లేదు. ఇప్పుడు శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి బలం అవసరమైనందున .. రవీందర్ రావు ఇలా సొంత పార్టీపై విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది.