(Source: ECI/ABP News/ABP Majha)
Ayodhya News: అయోధ్య 'రామయ్య' విగ్రహం ఇదే - 'రామ్ లల్లా'ను చెక్కిన శిల్పి ఎవరో తెలుసా.?
Ayodhya Ram Statue: 'అయోధ్య' రామాలయంలో ప్రతిష్టింతే 'రామ్ లల్లా' విగ్రహాన్ని ఎంపిక చేశారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఈ నెల 22న అయోధ్యలో ప్రతిష్టించనున్నారు.
Ayodhya Ram Lalla Statue Selected: 'అయోధ్య' (Ayodhya) రామాలయంలో ఈ నెల 22న కొలువు దీరనున్న 'రామ్ లల్లా' (Ram Lalla) విగ్రహం ఖరారైంది. కర్ణాటకకు (Karnataka) చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) తీర్చిదిద్దిన బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించి ఫోటోను షేర్ చేశారు. 'రాముడు ఎక్కడ ఉంటాడో, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అయోధ్యలోని శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించనున్నారు. రాముడు, హనుమంతునికి మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి ఇది మరో ఉదాహరణ. హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచి శ్రీరాముని సేవా కార్యం జరిగిందనడంలో సందేహం లేదు.' అని ట్వీట్ లో పేర్కొన్నారు.
"ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು"
— Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024
ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q
12 నాణ్యమైన శిలలు
అయోధ్య రామాలయ ట్రస్ట్.. నేపాల్ లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా నుంచి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లు గుర్తించారు. అయితే, రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహ తయారీకి అనువుగా ఉన్నట్లు తేల్చారు. కర్ణాటకలో లభించిన శ్యామశిల, రాజస్థాన్ లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్ లను ఎంపిక చేశారు. విశిష్టమైన ఈ శిలలు, నీటి నిరోధకత కలిగి ఉండడం సహా, సుదీర్ఘ జీవిత కాలాన్ని కూడా కలిగి ఉంటాయి.
విగ్రహ ఎంపిక కోసం ఓటింగ్
'అయోధ్య'లో ప్రతిష్టించబోయే రాముని విగ్రహం కోసం డిసెంబర్ 30న ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రకు చెందిన బోర్డు ట్రస్టీలు 'రామ్ లల్లా' విగ్రహాలను పరిశీలించారు. పోటీలోని 3 విగ్రహాలను పరిశీలించి తమ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా ట్రస్టుకు సమర్పించారు. కర్ణాటక నుంచే మరో శిల్పి గణేశ్ భట్, రాజస్థాన్ నుంచి సత్యనారాయణ పాండేలు కూడా పోటీలో నిలిచారు. ముంబయికి చెందిన ఆర్టిస్ట్ వసుదేవ్ కామత్ ఇచ్చిన స్కెచ్ ల ఆధారంగా 'రామ్ లల్లా'ను డిజైన్ చేశారు. కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పాన్ని ప్రాణ ప్రతిష్టకు ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీనిపై కర్ణాటక బీజేపీ నేత యుడియూరప్ప ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 'ఇది రాష్ట్రంలోని మొత్తం రామ భక్తుల గర్వాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసింది' అని పేర్కొన్నారు.
అసలెవరీ అరుణ్ యోగిరాజ్.?
కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ (37).. ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ కుమారుడు. తండ్రి, తాత బసవన్న సైతం శిల్పులే. ఎంబీయే పూర్తి చేసిన అరుణ్.. యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. 2008లో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి కళపై మక్కువతో శిల్పకారునిగా మారారు. ఆయన, మహారాజా జయచామరాజేంద్ర వడయార్ తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. కేదార్ నాథ్ లోని ఆదిశంకరాచార్య విగ్రహం, అలాగే మైసూరులోని మహారాజ శ్రీకృష్ణరాజ వడయార్-IV, 21 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం, స్వామి రామకృష్ణ పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు. ఇండియాగేట్ సమీపంలోని అమర్ జవాన్ జ్యోతి వెనుక ప్రముఖంగా కనిపించే సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ రూపొందించినదే.
#WATCH | Mysuru, Karnataka: Visuals from the residence of sculptor Arun Yogiraj.
— ANI (@ANI) January 2, 2024
The idol of Lord Rama, carved by Arun Yogiraj will be installed in Ayodhya Ram Temple. pic.twitter.com/se3EwfKszW
శిల్పి అరుణ్ స్పందన ఏంటంటే.?
కాగా, తాను చెక్కిన విగ్రహాన్ని ప్రతిష్టాపనకు అంగీకరించారా.? లేదా.? అనే దానిపై తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని శిల్పి అరుణ్ యోగిరాజ్ జాతీయ మీడియాకు తెలిపారు. 'ఆ విగ్రహం దేవుని అవతారపు ప్రతిమ అయి, అదీ ఒక పిల్లవాడిదిగా ఉండాలి. ఈ విగ్రహాన్ని చూసిన ప్రజలు దైవత్వాన్ని అనుభూతి చెందాలి. చిన్నారి లాంటి ముఖంతో పాటు దైవత్వ కోణాన్ని దృష్టిలో ఉంచుకొని 6 నెలల క్రితం శిల్పం చెక్కడం ప్రారంభించాను. విగ్రహాన్ని ఎంపిక చేయడంతో సంతోషంగా ఉన్నాను. ఎంపిక కంటే ప్రజలు కూడా నా సృజనను మెచ్చుకోవాలి. అప్పుడే నేను ఇంకా సంతోషంగా ఉంటాను.' అని పేర్కొన్నారు. కర్ణాటకలోని కారకల ప్రాంతం నుంచి కృష్ణశిలను తెచ్చి విగ్రహం తయారు చేసినట్లు చెప్పారు.
కుటుంబ సభ్యుల సంతోషం
అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహం 'అయోధ్య'లో ప్రాణ ప్రతిష్టకు ఎంపిక కావడంపై అరుణ్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నట్లు అరుణ్ తల్లి సరస్వతి తెలిపారు. 'అరుణ్ శిల్పం చెక్కడాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకున్నా. కానీ చివరి రోజు తన పని వద్దకు తీసుకెళ్తానని నా కుమారుడు చెప్పాడు. శిల్పం ప్రతిష్టించిన రోజు అయోధ్యకు వెళ్లనున్నా. నా కుమారుడు చెక్కిన రాముడి శిల్పం ప్రపంచమంతా చూస్తుంది. ఇంతకన్నా నాకు సంతోషం ఏముంది.' అని ఆమె తెలిపారు. తన భర్త పట్ల గర్వంగా ఉన్నట్లు అరుణ్ భార్య విజేత తెలిపారు. 'రామ్ లల్లా'ను చెక్కిన విషయాన్ని తన భర్త తనకు చెప్పలేదని, మీడియా ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. తనకు మాటలు రావడం లేదని, సంతోషంగా ఫీలవుతున్నట్లు చెప్పారు.
అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 'రామ్ లల్లా' విగ్రహాన్ని ఈ నెల 22న ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్య రామ మందిర గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు.
Also Read: ఈ ఏడాదిలో నెలకో మిషన్‌తో దూసుకుపోతాం,అదే మా లక్ష్యం - ఇస్రో చీఫ్ సోమనాథ్