Donald Trump: నేను యుద్ధం ఆపకపోయి ఉంటే పాక్ ప్రధాని చనిపోయేవాడు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని, లేకపోతే అది అణు యుద్ధానికి దారితీసేదని పాక్ ప్రధాని చనిపోయేవాడు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాషింగ్టన్: భారత్‌తో యుద్ధాన్ని తాను ఆపకపోయి ఉంటే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎప్పుడో చనిపోయేవాడు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రెండో పదవీకాలం మొదటి 10 నెలల్లోనే తాను 8 యుద్ధాలను అంతం చేశానని, అందులో భారత్, పాకిస్థాన్ వివాదం కూడా ఉందని పేర్కొన్నారు. రెండో పదవి కాలంలో తొలి స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగంలో మరోసారి విదేశాంగ విధానంలో తాను సాధించిన విజయాలను ట్రంప్ ప్రస్తావించారు. తన మధ్యవర్తిత్వంతోనే భారత్, పాక్ యుద్ధం ఆగిపోయిందని.. లేకపోతే అణు యుద్ధానికి దారితీసేదని ట్రంప్ ప్రస్తావించారు.
నేను లేకపోతే 3.5 కోట్ల మంది చనిపోయేవారు: ట్రంప్
ప్రపంచంలో పలు యుద్ధాలను ఆపిన క్రెడిట్ తీసుకునే క్రమంలో ట్రంప్ ఈసారి రెండు అడుగులు ముందుకు వేశారు. జాయింట్ సెషన్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. 'నా మొదటి 10 నెలల పాలనలో నేను 8 యుద్ధాలను ఆపేశాను. కంబోడియా - థాయ్‌లాండ్, పాకిస్థాన్ - భారత్ లాంటి ముఖ్యమైన యుద్ధాలున్నాయి. ఈ యుద్ధాలు అణు యుద్ధంగా మారకుండా నిలిపివేశాను. నేను మధ్యవర్తిత్వం చేయకపోయి ఉంటే 3.5 కోట్ల మంది చనిపోయేవారని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ నాతో చెప్పారు. అమెరికా మరోసారి బలమైన శక్తిగా మారుతోంది. ఆర్థిక వ్యవస్థ సైతం బలోపేతం చేస్తున్నాం. టారిఫ్ లతో అమెరికా ప్రయోజనాలు తిరిగి దక్కించుకుంటుంది' అని అన్నారు.
#WATCH | Addressing the 2026 State of the Union, United States President Donald Trump says, "... In my first 10 months, I ended eight wars... Pakistan and India would have had a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for… pic.twitter.com/GnrgJKtjID
— ANI (@ANI) February 25, 2026
ట్రంప్ తన ప్రసంగంలో ఇజ్రాయెల్-ఇరాన్, ఆర్మేనియా-అజర్‌బైజాన్, రువాండా- డిఆర్‌సి, సెర్బియా-కొసోవో వంటి మరికొన్ని యుద్ధాల గురించి కూడా ప్రస్తావించారు. తాను శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నామని, అమెరికా ఇప్పుడు గతంలో కంటే మరింత దృఢంగా మారుతోందని ట్రంప్ అన్నారు. తన వల్లే ప్రపంచంలో చాలా దేశాల్లో శాంతి నెలకొందని ట్రంప్ క్లెయిమ్ చేశారు. అమెరికాతో స్నేహం ద్వారా ఆయా దేశాలకు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు.
సంక్షోభంలో ఉన్న అమెరికాను గట్టెక్కించా: ట్రంప్
గడిచిన 13 నెలల్లో తన ప్రభుత్వం అసాధారణ విజయాలను సాధించినట్లు చెప్పుకొచ్చారు. సంక్షోభంలో ఉన్న దేశానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి, ముందెన్నడూ లేని విధంగా విప్లవాత్మక తీసుకువచ్చానని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా అక్రమ వలసల నిరోధం, సరిహద్దు భద్రత, ఐదేళ్ల కనిష్టానికి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, తొలి ఏడాదిలోనే 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించడాన్ని ట్రంప్ తన ప్రధాన విజయాలుగా పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థ కేవలం 3 నెలల్లోనే పుంజుకుందని, గ్యాస్ ధరలు తగ్గాయని, వెనిజులా నుండి 80 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతోందని తెలిపారు. టారిఫ్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూనే, ఏ దేశం విషయంలోనూ తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అరాచకం నెలకొన్న తరుణంలో అమెరికాను మునుపటి కంటే అత్యంత సురక్షితంగా, దృఢంగా మార్చామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
























