(Source: ECI/ABP News/ABP Majha)
Kushi Review - 'ఖుషి' రివ్యూ : విజయ్ దేవరకొండ, సమంత జోడీ హిట్టు, మరి సినిమా?
Kushi Review in Telugu : విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' ఈ రోజు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?
శివ నిర్వాణ
విజయ్ దేవరకొండ, సమంత, జయరామ్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ తదితరులు
సినిమా రివ్యూ : ఖుషి
రేటింగ్ : 3/5
నటీనటులు : విజయ్ దేవరకొండ, సమంత, జయరామ్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, రోహిణి, లక్ష్మీ, శరణ్య, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
ఛాయాగ్రహణం : జి మురళి
సంగీతం : హిషామ్ అబ్దుల్ వాహాబ్
నిర్మాతలు : నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి
కథ, కథనం, మాటలు, సాహిత్యం, దర్శకత్వం : శివ నిర్వాణ
విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2023
'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా నటించిన సినిమా 'ఖుషి' (Kushi Movie). ఈ రోజు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. సాంగ్స్ హిట్ కావడం... విజయ్ దేవరకొండ, సమంత జోడీ... విజువల్స్... ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. మరి, సినిమా ఎలా ఉంది?
కథ (Kushi Movie Story) : విప్లవ్ (విజయ్ దేవరకొండ) బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. కశ్మీర్ పోస్టింగ్ కావాలని మరీ తీసుకుని వెళతాడు. అక్కడ ఆరా బేగం (సమంత)ను చూసి ప్రేమలో పడతాడు. ముస్లిం అని తెలిసి ఆమె వెనక తిరుగుతాడు. తన మీద విప్లవ్ చూపించే ప్రేమ చూసి ఆరా కూడా ప్రేమలో పడుతుంది. తర్వాత అసలు నిజం చెబుతుంది. తాను బేగం కాదని, బ్రాహ్మిణ్ అని, తన పేరు ఆరాధ్య అని, తాను ప్రముఖ హిందూ ప్రవచన కర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) కుమార్తె అని చెబుతుంది. చదరంగం శ్రీనివాసరావుకు... విప్లవ్ తండ్రి, ప్రముఖ నాస్తికుడు లెనిన్ సత్యం (సచిన్ ఖేడేకర్)కి అసలు పడదు. దాంతో పిల్లల పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరు. వాళ్ళను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు విప్లవ్, ఆరాధ్య. ఆ తర్వాత ఏమైంది? పెళ్లి తర్వాత సంసార జీవితం ఎలా సాగింది? గొడవలకు కారణం ఏమిటి? చివరకు, ఏం చేశారు? అనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ (Kushi Movie Review) : బంధం విలువ బరువైన మాటల్లో కాదు, భాగస్వామితో మనం వ్యవహరించే తీరులో, భాగస్వామిపై మనం చూపించే బాధ్యతలో ఉంటుందని చెప్పే సినిమా 'ఖుషి'. భార్యా భర్తల మధ్య కలహాలు ఎన్ని వచ్చినా కలిసి ఉండాలని, కలకాలం ఒకరికి మరొకరు తోడు ఉండాలని చెప్పే సినిమా 'ఖుషి'.
'ఖుషి'లో ఇచ్చిన సందేశం గానీ, చెప్పిన విషయం గానీ కొత్తది కాదు. ఆ మాటకు వస్తే... పరస్పర భిన్నమైన కుటుంబ నేపథ్యాలు గల యువతి యువకులు ప్రేమలో పడటం, ఆ తర్వాత పెద్దలు ఎలా కలిశారు? ఈ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తెలుగులో కొన్ని వచ్చాయి. ఆ సినిమాలకూ, 'ఖుషి'కి వ్యత్యాసం ఏమిటి? అంటే... విజయ్ దేవరకొండ & సమంత జోడీ, హిషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం!
విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్... వాళ్ళిద్దరి నటన... సన్నివేశాలకు ప్రాణం పోసింది. 'ఖుషి' ప్రథమార్థం అంతా సరదాగా సాగుతుంది. ప్రేమ కోసం, ప్రేమను వ్యక్తం చేయడం కోసం పరితపించే యువకుడిగా విజయ్ దేవరకొండ చేసిన సీన్లు నవ్విస్తాయి.
ద్వితీయార్థంలో ఆలుమగల మధ్య అసలు కథ, కథలో కాన్‌ఫ్లిక్ట్ మొదలయ్యాయి. టీవీ డిబేట్ గానీ, కేరళ ఎపిసోడ్ గానీ అంత ఆసక్తిగా అనిపించవు. నిడివి పెంచిన ఫీలింగ్ తీసుకొచ్చాయి. అయితే... విజయ్ దేవరకొండ, సమంత స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ మేజిక్ వర్కవుట్ అయ్యింది.
'నిన్ను కోరి', 'మజిలీ' చిత్రాల్లో దర్శకుడు శివ నిర్వాణ బలమైన భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించారు. పైగా, వాటిని సున్నితంగా చూపించారు. అందువల్ల, ఈ సినిమాపై కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, 'ఖుషి'లో ప్రేమపై ఎక్కువ ఫోకస్ చేసిన దర్శకుడు... ఎమోషనల్ డెప్త్ చూపించడంలో కాస్త వెనుకబడ్డారు. ఈతరం ప్రేమ జంటల వైవాహిక జీవితాన్ని సోసోగా తెరపైకి తీసుకొచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారంటే : విప్లవ్, ఆరాధ్య... ఈ పాత్రలు విజయ్ దేవరకొండ, సమంతకు సవాల్ విసిరేవి కాదు. అయితే... హీరో హీరోయిన్లు ఇద్దరూ తమ నటనతో పాత్రలను చూడబుల్‌గా చేశారు.
విజయ్ దేవరకొండ నటన గురించి చెప్పుకోవాలి. ఇంతకు ముందు సినిమాల్లో క్యారెక్టర్ షేడ్స్ ఎక్కడా కనిపించకుండా కేవలం విప్లవ్ మాత్రమే కనిపించేలా నటించారు. 'ఖుషి' ప్రథమార్థంలో వచ్చీరాని హిందీలో తన ప్రేమను బేగంకు వ్యక్తం చేసే సీన్లలో సగటు యువకుడిగా భలే చేశారు. సినిమాలో ఉన్నవి రెండు ఫైట్స్ మాత్రమే. ఆ రెండిటిలోనూ విజయ్ బాగా చేశారు. స్టయిలిష్‌గా కనిపించారు. ఇక, ఎమోషనల్ సీన్లలోనూ మెప్పించారు. ఆరాధ్య పాత్రలో సమంత ఒదిగిపోయారు. ఆమె నటనకు చిన్మయి డబ్బింగ్ తోడు కావడంతో ప్రేక్షకులు మరింత కనెక్ట్ అవుతారు.
సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, శత్రు, లక్ష్మీ, శరణ్య పొన్నవన్... ప్రధాన తారాగణం తమ పాత్రలకు న్యాయం చేశారు. 'వెన్నెల' కిశోర్ పాత్ర ప్రథమార్థంలో మాత్రమే ఉంది. ఆయన కాసేపు నవ్వించారు. హీరో స్నేహితుడి పాత్రలో రాహుల్ రామకృష్ణ తన పాత్ర పరిధి మేరకు చేశారు. బ్రహ్మానందం చివరి సన్నివేశంలో తళుక్కున మెరిశారు. అలీ సైతం ఓ సీన్ చేశారు. ఆయన గెటప్ 'దేశముదురు'ను, అందులో పాత్రను గుర్తు చేస్తుంది. రోహిణి, జయరాం... పాత్రలు కథను ముందుకు తీసుకువెళ్లాయి. కానీ, ఆ ఎపిసోడ్ నిడివి ఎక్కువైంది.
Also Read : 'ఖుషి' ప్రీ రిలీజ్ డీటెయిల్స్ - విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఎంత?
చివరగా చెప్పేది ఏంటంటే : వినసొంపైన పాటలు, కనువిందు చేసే విజువల్స్, మనసుకు హత్తుకునే విజయ్ దేవరకొండ & సమంత నటన కలబోత 'ఖుషి'. బరువైన కథ, కథనాలు లేవు. అయితే... కుటుంబ ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. యువత ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే కాసేపు సరదాగా ఎంజాయ్ చేయవచ్చు. చిన్నపాటి సందేశాన్ని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు.
Also Read : టార్గెట్ పాన్ ఇండియా - సెప్టెంబర్ బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమాలే టాప్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial