September Movies : టార్గెట్ పాన్ ఇండియా - సెప్టెంబర్ బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమాలే టాప్!
September Release Movies 2023 : 'ఖుషి' నుంచి 'సలార్' వరకు సెప్టెంబర్ నెలలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను రూల్ చేయనున్నాయి. ఆ నెలలో వస్తున్న సినిమాలు ఏవి? ఓ లుక్ వేయండి!
జాతీయ పురస్కారాలు ఇటీవల ప్రకటించారు. మెజారిటీ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమ ఖాతాలో పడ్డాయి. సారీ... తెలుగు సినిమా కైవసం చేసుకుంది. జాతీయ పురస్కారాలా? లేదంటే తెలుగు సినిమాకు ఇచ్చిన పురస్కారాలా? అనే స్థాయిలో చర్చ నడిచింది. దేశవ్యాప్తంగా తెలుగు సినిమా హవా గురించి చెప్పడానికి జాతీయ పురస్కారాలు ఓ ఉదాహరణ మాత్రమే. వచ్చే నెల (సెప్టెంబర్)లో కూడా పాన్ ఇండియా బాక్సాఫీస్ మీద తెలుగు సినిమాలు యుద్ధం చేయబోతున్నాయి. రాబోయే 30 రోజుల్లో విడుదల కానున్న తెలుగు సినిమాలు ఏవి? పాన్ ఇండియా స్థాయిలో వాటి ప్రభావం ఎలా ఉంది? ఓ లుక్ వేయండి!
విజయ్ దేవరకొండ 'ఖుషి'తో సెప్టెంబర్ షురూ!
సెప్టెంబర్ 1న శుక్రవారం వచ్చింది. ఆ రోజు నుంచి బాక్సాఫీస్ బరిలో మన తెలుగు సినిమా సందడి షురూ కానుంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' విడుదల సెప్టెంబర్ 1నే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు పోటీ ఏదీ లేదని చెప్పాలి.
'లైగర్' ఫ్లాప్ అయినప్పటికీ... విజయ్ దేవరకొండ పాన్ ఇండియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన ఫాలోయింగ్ అలాగే ఉంది. దానికి తోడు సమంత ఉండటం, పాటలు హిట్ అవ్వడం 'ఖుషి' (Kushi movie 2023)కి ప్లస్ పాయింట్స్. ప్రేమ పెళ్లి, పెళ్లి తర్వాత ఆలుమగల మధ్య గొడవలు - మెజారిటీ ఆడియన్స్, ముఖ్యంగా యూత్ కనెక్ట్ అయ్యే కథాంశాన్ని దర్శకుడు శివ నిర్వాణ ఎంపిక చేసుకున్నారు. కథ పరంగా కొత్తదనం ఎంత ఉంటుంది? రొటీన్‌గా కాకుండా ఎంత కొత్తగా చెప్పారు? అనే అంశంపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.
సెప్టెంబర్ 1న తమిళంలో యోగిబాబు 'లక్కీ మ్యాన్', శరత్ కుమార్ 'పారంపొరుళ్', మరో రెండు మూడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. హిందీలో కల్కి కొచ్చిన్ 'గోల్డ్ ఫిష్', కేకే మీనన్ 'లవ్ ఆల్', 'మిస్టరీ ఆఫ్ టాటూ' సినిమాలు విడుదల అవుతున్నాయి.
షారుఖ్ ఖాన్ 'జవాన్' వర్సెస్ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'
సెప్టెంబర్ రెండో వారంలో, 7వ తేదీన పాన్ ఇండియా రిలీజ్ కానున్న తెలుగు సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వెళుతున్న అనుష్క పాన్ ఇండియా చిత్రమిది. మధ్యలో 'భాగమతి' చేసినా అది తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే విడుదలైంది.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty Mr Polishetty)లో హీరో నవీన్ పోలిశెట్టి సైతం హిందీ ప్రేక్షకులకు బాగా తెలుసు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 'చిచోరే'లో నటించారుగా! హీరో హీరోయిన్లకు తోడు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా కావడం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'కి ప్లస్ పాయింట్. అయితే... దీనికి బాక్సాఫీస్ బరిలో గట్టి పోటీ ఉంది.
షారుఖ్ ఖాన్ 'జవాన్' కూడా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఆ చిత్రానికి అట్లీ దర్శకుడు కావడంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ నెలకొంది. సౌత్ మార్కెట్ మీద కాన్సంట్రేట్ చేసిన షారుఖ్ ఖాన్ దక్షిణాదిలో కూడా ప్రమోట్ చేస్తున్నారు. అందువల్ల, 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'కి ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి. తెలుగులో అయితే ఎటువంటి ఢోకా లేదని చెప్పవచ్చు.
సెప్టెంబర్ 8న తమిళంలో హరీష్ ఉత్తమన్ 'నూడిల్స్', సత్యరాజ్ నటించిన 'అంగారాగన్' చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి', 'జవాన్' చిత్రాలకు అవి ఏమాత్రం పోటీ కావు.
రామ్ 'స్కంద' వర్సెస్ రాఘవా లారెన్స్ 'చంద్రముఖి 2'
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమా 'స్కంద'. సెప్టెంబర్ 15న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది.
రామ్ సినిమాలకు ఉత్తరాదిలో మంచి ఆదరణ ఉంది. ఆయన సినిమాలు హిందీలో డబ్బింగ్ చేయగా... మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమాల హిందీ డబ్బింగ్ రికార్డ్ కూడా బావుంది. అందువల్ల, వీళ్ళ కాంబినేషన్ 'స్కంద'పై క్రేజ్ పెంచింది. ట్రైలర్ అంతా సౌత్ ఇండియా స్టైల్ మాస్ యాక్షన్ & ఫ్యామిలీ మూమెంట్స్ నిండుగా ఉండటంతో బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
'స్కంద'తో పాటు సెప్టెంబర్ 15న 'చంద్రముఖి 2', 'మార్క్ ఆంటోనీ' కూడా రిలీజ్ అవుతున్నాయి. 'కాంచన' సిరీస్ సినిమాలతో హారర్ థ్రిలర్ కాన్సెప్ట్ & రాఘవా లారెన్స్ అంటే హిట్ అనే ఇమేజ్ వచ్చింది. దానికి తోడు 'చంద్రముఖి' అన్ని భాషల్లో హిట్ కావడంతో ఆ బ్రాండ్ వేల్యూ కూడా యాడ్ అయ్యింది. ఆ సినిమా 'స్కంద'కు పోటీ ఇవ్వవచ్చు. విశాల్ సినిమాలు ఈ మధ్య భారీ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెట్రో జానర్ అంటూ 'మార్క్ ఆంటోనీ'తో ఆయన ఏం చేస్తారో చూడాలి.
'సలార్'... నో కాంపిటీషన్ బాస్!
సెప్టెంబర్ అంతా విడుదల అయ్యే సినిమాలు ఓ ఎత్తు... నెలాఖరున వచ్చే 'సలార్' మరో ఎత్తు! రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా అది.
సెప్టెంబర్ 28న 'సలార్' (Salaar Part 1 ceasefire) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. మూడున్నర కోట్లు వచ్చాయి. విడుదలకు ఒకట్రెండు రోజుల ముందు చూస్తే... సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. ఇప్పటి వరకు ప్రభాస్ స్టిల్స్, చిన్న విజువల్స్ తప్ప పెద్దగా ఏమీ విడుదల చేయలేదు. అయినా సినిమా కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారనేది చెప్పడానికి ఆ బుకింగ్స్ చిన్న ఉదాహరణ.
'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఆ స్థాయి విజయం అందుకోలేదు. ఆ లోటు 'సలార్' తప్పకుండా తీరుస్తుందని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నారు. యాక్షన్ జానర్ సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడం అందుకు కారణమని చెప్పాలి.
Also Read : ప్రతి పండక్కి... ప్రతి నెలలో శ్రీ లీల సినిమా - వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు!
'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన 'వ్యాక్సిన్ వార్' కూడా సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధమవుతోంది. నిజం చెప్పాలంటే... ప్రభాస్ 'రాధే శ్యామ్', వివేక్ అగ్నిహోత్రి 'కశ్మీర్ ఫైల్స్' ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 'కశ్మీర్ ఫైల్స్' సంచలన విజయం సాధించగా... 'రాధే శ్యామ్' ఫ్లాప్ అయ్యింది. అది గుర్తు చేస్తూ... 'వ్యాక్సిన్ వార్' పబ్లిసిటీ జరుగుతోంది. కానీ, ఈసారి 'సలార్' ముందు ఆ సినిమా నిలవడం కష్టమని ట్రెండ్ చూస్తుంటే అర్థం అవుతోంది.
తమిళంలో సెప్టెంబర్ 28న 'జయం' రవి, నయనతార నటించిన 'ఇరైవన్' రిలీజ్ కానుంది. కోలీవుడ్ వరకు ఆ సినిమా పరిమితం కానుందని ఓ అంచనా. సెప్టెంబర్ 22న హిందీలో విక్కీ కౌశల్, మానుషీ చిల్లర్ 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ', శిల్పా శెట్టి 'సుఖీ' వస్తున్నాయి కానీ అవి 'సలార్' రేంజ్ సినిమాలు కావు. సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న సినిమాలు చూస్తే... పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలే టాప్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read : వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial