Parents: మీ పిల్లల ముందు ఇలా చేస్తున్నారా? దాని ఫలితం మీరు ఊహించలేరు
పిల్లల ముందు ఇలా ప్రవర్తిస్తే జీవితాన్నే నష్టపోవాల్సి వస్తుంది.
భార్యాభర్తలు అన్నాక పోట్లాడుకోవడం, చిలిపి తగాదాలు, అలకలు అన్నీ ఉంటాయి. అవి పెద్దవి కాకుండా చూసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటూ ఉంటే ఆ దంపతుల జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. కానీ, తల్లిదండ్రులుగా మారిన తర్వాత కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ఎందుకంటే వారి మధ్య పిల్లలు, బాధ్యతలు, బంధాలు ముడి పడి ఉంటాయి. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఆచితూచి అడుగులు వేయాలి. లేదంటే దాని ప్రభావం తల్లిదండ్రుల జీవితం మీదే కాదు వారి మధ్య ఉన్న పిల్లల మీద కూడా పడుతుంది. అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
తల్లిదండ్రులుగా పిల్లల బాధ్యత తీసుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి సమయానికి ఏం కావాలి? ఎలాంటివి అందించాలి? అనే దాని మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. పిల్లల పట్ల చాలా ప్రేమ చూపిస్తూ.. మంచేదో, చెడు ఏదో చెప్తూ వాళ్ళకి వివరించాలి. అప్పుడే వాళ్ళు సరైన దారిలో నడుస్తారు. అలా కాకుండా వాళ్ళ ముందే తల్లి దండ్రులు తిట్టుకోవడం, గట్టిగా అరుచుకోవడం. కొట్టుకోవడం వంటివి చేస్తే ఆ పసి మనసుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలతో వాళ్ళు బాధపడే అవకాశం ఉంది. భవిష్యత్ లో వాళ్ళు ఇతరులతో ఏర్పరుచుకునే బంధాల మీద కూడా అది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకే పిల్లల ముందు తల్లిదండ్రులు తమ ప్రవర్తన విషయంలో ఇవి పాటించాలి.
వాళ్ళని సాకుగా చూపకూడదు
తల్లిదండ్రులు ఎప్పుడు పోట్లాడుకుంటూ కనిపిస్తే పిల్లల మనసు మీద అది చెడు ప్రభావాన్ని చూపుతుంది. వారి ఆలోచనా విధానంలో చాలా మార్పులు వస్తాయి. కొన్ని సార్లు తమ గొడవలకి కారణం పిల్లలే అని ఎత్తి చూపడం చాలా ప్రమాదకరం. అది వారి ఉనికినే ప్రశ్నించేదిగా ఉంటుంది. ఆ క్షణికావేశం కోపంలో వాళ్ళు ఎంతకైనా తెగించే ధోరణికి వెళతారు.
పిల్లల ముందు బిగ్గరగా అరవకూడదు
తల్లిదండ్రులుగా మీరు పిల్లల ముందు ఎప్పుడు అరుచుకుంటూ పోట్లాడుకోకూడదు. ఎదుటి వ్యక్తితో మీరు ఏకీభవించకపోతే కొందరు గట్టిగా అరుస్తూ తమ వాదన వినిపిస్తారు. కానీ అలా చేయడం అసలు మంచిది కాదు. ఆ అరుపులకి మీ బిడ్డ భయపడతారు. ఒక్కోసారి మీ పిల్లలు కూడా మీరు చేసే విధానాన్ని అనుసరించవచ్చు. వాళ్ళు చెప్పాలి అనుకున్నపుడు కూడా ఇలాగే అరుస్తూ చెప్పాలనే తప్పుడు సంకేతాలు వెళతాయి.
ఒకరినొకరు బెదిరించుకోవద్దు
మీ జీవిత భాగస్వామి మీ మాట వినకపోతే వాళ్ళని బెదిరించడం, వాళ్ళని కొట్టడం అరవడం చెయ్యకూడదు. ఇటువంటి హింసాత్మక ధోరణితో పిల్లల ముందు ప్రవర్తిస్తే వాళ్ళ దృష్టిలో మీ విలువ దిగజారిపోతుంది. మీ పిల్లలకి మిమ్మల్ని దూరం కూడా చేస్తుంది. అదే ధోరణి పిల్లలు కూడా అనుసరిస్తారు. అందుకే వాళ్ళ ముందు ప్రేమగా మాట్లాడుకోవాలి. సమస్య ఉంటే సావధానంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. అంతే కానీ పిల్లల ముందు వాదన పెట్టుకోకూడదు.
ఇలా అడగొద్దు
నీకు అమ్మ కావాలా.. నాన్న కావాలా తేల్చుకో అని ఆవేశంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని అడుగుతారు. ఇలా అసలు చెయ్యకూడదు. అలా అడగటం వల్ల వాళ్ళు చాలా భయపడటంతో పాటు కలవరపాటుకి గురవుతారు. మీరు మీ పిల్లలకి మార్గదర్శంగా ఉండాలే కానీ వారిని తప్పుదోవ పట్టించేలా మీ ప్రవర్తన ఉండకూడదు.
Also Read: మీ మూడ్ మార్చే సూపర్ ఫుడ్స్ - ఇవి తింటే రిఫ్రెష్ అయిపోతారు
Also Read: రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే ఈ సమస్యలు అధిగమించవచ్చు