Rare Paediatric Robotic Surgery : యశోద హాస్పిటల్స్‌లో అరుదైన చికిత్స.. రోబోటిక్ సర్జరీతో 2 నెలల చిన్నారికి కొత్త జీవితం, ఫుల్ డిటైల్స్ ఇవే
Robotic Urological Surgery : వైద్య రంగంలో రొబోటిక్ సర్జరీ కీలకమైన, కచ్చితమైన ఫలితాలు ఇస్తుంది. ఈ టెక్నాలజీతో యశోద ఆస్పత్రి వైద్యులు రెండు నెలల బేబికి సర్జరీ చేశారు. పూర్తి వివరాలు చూసేద్దాం.

- రెండు నెలల చిన్నారికి పెల్వి-యూరెటరిక్ జంక్షన్ అడ్డంకి సమస్య గుర్తింపు.
- క్లిష్టమైన యూరాలజీ సమస్యకు రోబోటిక్ సర్జరీ ద్వారా విజయవంతంగా చికిత్స.
- రోబోటిక్ సర్జరీతో తక్కువ నష్టం, వేగంగా కోలుకునే ప్రయోజనాలు లభించాయి.
- చికిత్స తర్వాత చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉంది, త్వరలో డిశ్చార్జ్.
Paediatric Robotic Urology : రెండు నెలల చిన్నారి పెల్వి-యూరెటరిక్ జంక్షన్ (PUJ) అబ్స్ట్రక్షన్ అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నిర్థారించారు హైదరాబాద్లోని యశోద హాస్విటల్స్ వైద్యులు. ఈ సమస్య ఉంటే కిడ్నీ నుంచి యూరెటర్‌కు మూత్ర ప్రవాహం సరిగా జరగదు. సకాలంలో చికిత్స చేయకపోతే కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని.. దీంతో బేబికి సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. పేరెంట్స్ అంగీకారంతో రోబోటిక్ సర్జరీ చేశారు.
కేవలం 2 నెలల వయసున్న ఈ బేబికి రోబోటిక్ సర్జరీ ద్వారా క్లిష్టమైన యూరాలజీ సమస్యకు సక్సెస్‌ఫుల్‌గా చికిత్స చేసినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అత్యాధునిక చైల్డ్ యూరాలజీ చికిత్సలో ఇది మరో కీలక మైలురాయి అని యశోద హాస్పిటల్స్ యాజమాన్యం తెలిపింది. అయితే ఈ రోబోటిక్ సర్జరీ వల్ల కలిగే లాభమేంటో.. వైద్యులు ఏమి చెప్తున్నారో చూసేద్దాం.
రోబోటిక్ సర్జరీతో బెనిఫిట్స్ ఇవే
ఈ శస్త్రచికిత్సలో ఆండర్సన్-హైన్స్ పైలోప్లాస్టీతో పాటు డీజే స్టెంటింగ్ చేశారు. రోబోటిక్ టెక్నాలజీ సహాయంతో కిడ్నీ పెల్విస్, యూరెటర్‌ను అత్యంత ఖచ్చితత్వంతో రీ కన్స్ట్రక్ట్ చేశారు. దీనివల్ల శరీర కణజాలానికి తక్కువ నష్టం కలగడం, రక్తస్రావం తగ్గడం, వేగంగా కోలుకునే అవకాశం ఉండటం వంటి ప్రయోజనాలు లభించాయని వైద్యులు తెలిపారు. అలాగే మూత్ర ప్రవాహం సక్రమంగా కొనసాగేందుకు డీజే స్టెంట్ కూడా అమర్చినట్లు వెల్లడించారు.
తక్కువ నొప్పి, చిన్న కట్స్, తక్కువ రోజుల్లో డిశ్చార్జ్, వేగవంతమైన రికవరీ, మెరుగైన ఫలితాల కారణంగా రోబోటిక్ పైలోప్లాస్టీకి ఆదరణ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
వైద్యులు ఏమంటున్నారంటే..
ఈ ఆపరేషన్‌కు యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజీ & రోబోటిక్ సర్జరీ నిపుణుడు డాక్టర్ మల్లికార్జున రెడ్డి నాయకత్వం వహించారు. భారతదేశంలోని కొద్ది ఆస్పత్రుల్లో మాత్రమే ఇలాంటి అడ్వాన్స్‌డ్ పీడియాట్రిక్ రోబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 25 ఏళ్లకు పైగా లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీ అనుభవంతో యశోధ ఆస్పత్రిలో అత్యాధునిక చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు.
రెండు నెలల శిశువుకు రోబోటిక్ పైలోప్లాస్టీ చేయడమంటే.. యూరాలజీ రంగంలో వచ్చిన సాంకేతిక పురోగతికి నిదర్శనమన్నారు. ఈ విధానం ద్వారా మెరుగైన విజువలైజేషన్, టిష్యూలను సున్నితంగా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుందని.. సమయానికి చికిత్స అందించడం ద్వారా కిడ్నీ పనితీరును కాపాడి చిన్నారి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేలా చేయవచ్చని తెలిపారు.
సర్జరీ తర్వాత బేబి ఆరోగ్య పరిస్థితి
శస్త్రచికిత్స తర్వాత చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉండగా.. యాంటీబయాటిక్స్, అవసరమైన సహాయక చికిత్స అందించారు. చిన్నారి వేగంగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఫాలోఅప్ ద్వారా డీజే స్టెంట్ తొలగించి.. పూర్తి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























