Remote Robotic Surgery : హైదరాబాద్లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
Robotic Tele Surgery : డాక్టర్ చైనాలో ఉన్నారు.. రోగి హైదరాబాద్లో ఉన్నారు. అక్కడి నుంచే ఇక్కడ సర్జరీ నిర్వహించి చరిత్ర సృష్టించారు ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్యులు.

- హైదరాబాద్ రోగికి చైనా సర్జన్ రిమోట్ రోబోటిక్ సర్జరీ చేశారు.
- 3,900 కిలోమీటర్ల దూరం నుంచి ప్రపంచంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ.
- లోయర్ యూరెటెరిక్ స్ట్రిక్చర్ సమస్యతో బాధపడుతున్న మహిళకు చికిత్స.
- 5G టెక్నాలజీతో టెలిసర్జరీ వైద్య రంగ భవిష్యత్తుగా మారుతుంది.
World First Tele Robotic Ureteric Reimplantation : భారత వైద్య రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. హైదరాబాద్‌లోని ఓ రోగికి.. చైనాలో ఉన్న సర్జన్ విజయవంతంగా రిమోట్ రోబోటిక్ సర్జరీ నిర్వహించారు. దాదాపు 3,900 కిలోమీటర్ల దూరం నుంచే ఈ శస్త్రచికిత్స జరగడంతో వైద్య రంగంలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏమి సర్జరీ చేశారు.. దీని గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
ఈ అరుదైన టెలి-రోబోటిక్ సర్జరీని హైదరాబాద్‌కు చెందిన ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా టెలి-రోబోటిక్ యూరెటెరిక్ రీఇంప్లాంటేషన్ సర్జరీ చేయడం విశేషమని వైద్యులు చెప్తున్నారు.
రోగికి ఉన్న సమస్య ఇదే
హైదరాబాద్‌కు చెందిన 57 ఏళ్ల మహిళ లోయర్ యూరెటెరిక్ స్ట్రిక్చర్ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో మూత్ర మార్గానికి పదేపదే అడ్డంకి ఏర్పడటంతో.. ముందుగా స్టెంట్ ద్వారా తాత్కాలిక ఉపశమనం కల్పించారు. కానీ సమస్య మళ్లీ తిరిగి రావడంతో.. టెస్ట్‌లు చేశారు. దానిలో మూత్ర ప్రవాహానికి నిరంతర అడ్డంకి ఉన్నట్లు గుర్తించి.. యాంటీ-రిఫ్లక్స్ యూరెటెరిక్ రీఇంప్లాంటేషన్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ శస్త్రచికిత్స ద్వారానే మూత్రం సాధారణంగా ప్రవహించేలా చేసినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.
ఉన్నది చైనాలో.. సర్జరీ హైదరాబాద్‌లో
AINUలో డైరెక్టర్ రోబోటిక్ అండ్ మినిమల్ యాక్సెస్ యూరాలజికల్ సర్జన్గా చేస్తున్న డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ ఘౌస్.. చైనాలోని వుహాన్ నగరంలో ఉంటూ.. హైదరాబాద్‌లోని రోగికి ఈ శస్త్రచికిత్స చేశారు. చైనాలోని టాంగ్జీ హాస్పిటల్‌తో కలిసి ఈ సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు.
సర్జరీ ప్రత్యేకత ఇదే
ఈ టెలిసర్జరీలో అత్యాధునిక రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ఉపయోగించారు. కేవలం 100 మిల్లీసెకండ్ల కంటే తక్కువ లేటెన్సీతో రియల్ టైమ్‌లో సర్జన్ రోబోటిక్ పరికరాలను నియంత్రించినట్లు తెలిపారు. రోగి నుంచి అనుమతి తీసుకుని.. దానికి సంబంధించిన నియంత్రణ సంస్థల ఆమోదంతోనే ఈ శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని AINU, చైనాలోని టాంగ్జీ హాస్పిటల్ రెండు చోట్లా ప్రత్యేక యూరో సర్జన్ల బృందాలు అందుబాటులో ఉండేలా చూసుకున్నామన్నారు.
వైద్యులు ఏమంటున్నారంటే..
AINU చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ & రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ.. రోబోటిక్ సర్జరీ వల్ల సంక్లిష్టమైన ఆపరేషన్లు మరింత బాగా, సులభంగా చేయగలుగుతున్నామని తెలిపారు. 5G టెక్నాలజీతో టెలి-ప్రాక్టరింగ్, టెలిసర్జరీ వైద్య రంగ భవిష్యత్తుగా మారుతున్నాయన్నారు. అనుభవజ్ఞులైన సర్జన్లు ఎక్కడ ఉన్నా కీలక దశల్లో బృందాన్ని గైడ్ చేయవచ్చని తెలిపారు.
డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ ఘౌస్ మాట్లాడుతూ.. సాంకేతికత వల్ల శస్త్రచికిత్సల సరిహద్దులు పూర్తిగా మారుతున్నాయని తెలిపారు. అధిక వేగంతో కూడిన కనెక్టివిటీ, ఆధునిక రోబోటిక్ వ్యవస్థలతో దేశాల మధ్య దూరం ఉన్నా.. సర్జరీలు చేయగలుగుతున్నామన్నారు. అలాగే ఇప్పటివరకు AINUలో 1,400కు పైగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించినట్లు తెలిపారు.
టెలిసర్జరీ వల్ల లాభాలు
మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు టెలిసర్జరీ వల్ల మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. అలాగే పెద్ద నగరాలకు ప్రయాణించాల్సిన అవసరం తగ్గుతుంది. స్థానిక వైద్యుల నైపుణ్యం పెరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చికిత్స అందించే అవకాశం ఉంటుంది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.
Before You Go
Simple Yoga for Body Fat | చెడు కొవ్వును సింపుల్ యోగాసనాలతో దూరం చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















