World Laughter Day 2023: నవ్వు, నవ్వించు- ఎక్కువ కాలం జీవించు
నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్యం ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు.
ఎంత నవ్వితే అంత ఆరోగ్యం...
ఎంత నవ్వితే అంత ఐశ్వర్యం...
ఎంత నవ్వితే అంత ఆయుష్షు...
ప్రపంచంలోనే అత్యంత చవకైన ఔషధం నవ్వే. నవ్వితే ఎన్ని సమస్యలైనా ఇట్టే ఆవిరైపోతాయని అంటారు. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించేందుకు నవ్వే పరమ ఔషధం. ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం. ఈ సందర్భంగా నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రారంభించింది 1998లో. మొదటి వేడుక మనదేశంలోని ముంబైలో జరిగింది. ఈ నవ్వుల దినోత్సవం స్థాపించింది డాక్టర్ మదన్ కటారియా. ఈయన నవ్వును మించిన పరమ ఔషధం లేదని ప్రపంచం నవ్వుల యోగా ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి ఏడాది మేలో వచ్చే మొదటి ఆదివారం ప్రపంచం నవ్వుల దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది.
నవ్వడం వల్ల నరాలు ఎంతో చురుగ్గా ఆరోగ్యంగా మారుతుంది. దీర్ఘ కాలంగా ధ్యానం చేసే వారిలో ఎంత మంచి మార్పులు కలుగుతాయో. నవ్వే వారిలో కూడా ఆ మార్పులే కలుగుతాయి. నవ్వడం వల్ల మెదడులో గామా తరంగాలను ప్రేరేపిస్తుందని, ఈ గామా తరంగాలలో గాయాలను తగ్గించే లక్షణం ఉంటుందని అంటారు. నవ్వు నరాలలో ఆక్సిజన్ సమృద్ధిగా అందేలా చేస్తుంది. అలాగే గుండె, ఊపిరితిత్తులు, కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో ఎండార్పిన్లు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి వెంటనే తగ్గిపోతుంది.
మీరు ఒత్తిడికి గురైనప్పుడల్లా మీ మెదడు ఒత్తిడితో పోరాడటానికి న్యూరోపెప్టైడ్స్ అనే చిన్న అణువులను విడుదల చేస్తుంది. ఆ అణువులను అణచడానికి డోపమైన్, సెరటోనిన్, ఎండార్పిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లు అవసరం పడతాయి. నవ్వినప్పుడు ఈ న్యూరో ట్రాన్స్మిటర్లా ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. అప్పుడు ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఎండార్పిన్లు నొప్పిని తగ్గించడానికి సహకరిస్తే, సెరటోనిన్ యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. సానుకూల భావోద్వేగాలను పెంచేందుకు చాలా అవసరం. అలాగే రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. మెదడు సరిగా పనిచేసేలా చేసి తెలివితేటలను పెంచుతుంది. అందుకే రోజువారీ జీవితంలో నవ్వు చాలా ముఖ్యం.
నవ్వినప్పుడు హృదయ స్పందన రేటు పెరుగుతుంది. నవ్వే సమయంలో లోతైన శ్వాసలను తీసుకుంటారు. అంటే దీని అర్థం ఆక్సిజన్ నిండిన రక్తం మీ శరీరంలోని ప్రతి భాగానికి చేరుతుందని. అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా అడ్డుకుంటాయి. మెదడు, గుండెకు నవ్వు ఎంతో ముఖ్యం. నవ్వడం వల్ల ఆరోగ్యంతో పాటూ ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే హాయిగా నవ్వండి.
Also read: మగవారు గర్భనిరోధక మాత్రలు వాడడం సురక్షితమేనా? ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉంటాయి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.