Male Contraceptive Pill: మగవారు గర్భనిరోధక మాత్రలు వాడడం సురక్షితమేనా? ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉంటాయి?
ప్రస్తుతం మహిళలకే గర్భనిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో పురుషులకు రాబోతున్నాయి.
పురుషులకు గర్భనిరోధక మాత్రలు తయారు చేసే పనిలో ఎన్నో ఫార్మా కంపెనీలు బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం ఆడవారికి మాత్రమే గర్భనిరోధకమాత్రలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆడవారి శరీరంపై, ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాలు చూపిస్తున్నాయి. అందుకే మగవారికి కూడా గర్భనిరోధక మాత్రలను తయారు చేస్తున్నారు. అయితే వీటి అభివృద్ధి నెమ్మదిగానే ఉందని చెప్పాలి. అవి ఇంకా తయారీ దశను దాటి క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఆడవారు వేసుకునే గర్భనిరోధక మాత్రలు అండోత్సర్గాన్ని నిరోధించి గర్భం ధరించకుండా అడ్డుకుంటాయి. ఇక మగవారి కోసం తయారు చేస్తున్న గర్భనిరోధకం మాత్రలు వీర్యం ఉత్పత్తిని లేదా విడుదలను నిరోధించడం ద్వారా గర్భం రాకుండా అడ్డుకుంటాయి. ఈ ఆలోచన ఉత్తమంగానే ఉన్నా వీటితో ముడిపడి కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా ఉన్నాయి.
పురుషులకు గర్భనిరోధక మాత్రలు అనగానే మొదట వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఏంటి అనే సందేహం వస్తుంది. ఏవైనా మందులకు సైడ్ ఎఫెక్ట్లు కలగడం సాధారణం. మందులు వాడుతున్నప్పుడు వాటి వల్ల కలిగే అనుకూల ప్రభావంతో పాటు కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి. అలాగే మగ గర్భనిరోధక మాత్రల వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా లైంగికాసక్తి తగ్గుతుంది. మూడ్ స్వింగ్స్ వస్తాయి. మొటిమలు, బరువు పెరగడం, కండరాలు తగ్గడం వంటివి జరుగుతాయి. అయితే వాటిని అధిగమించడం కూడా సులువే.
గర్భనిరోధక మాత్రలను పురుషులు అధికంగా, దీర్ఘకాలికంగా వాడటం వల్ల వారి వీర్య కణాలపై, వాటి సంఖ్య పై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు నిపుణులు. ఈ మాత్రలు వీర్యం ఉత్పత్తిని, విడుదలను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. దీర్ఘకాలంగా వీటిని వాడడం వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గవచ్చు. లేదా వాటిలోని చలనశీలతను తగ్గవచ్చు. దీనివల్ల సంతాన ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ గర్భనిరోధక మాత్రలు వాడడం ఆపేసాక, సంతాన ఉత్పత్తి సామర్ధ్యం సాధారణ స్థితికి రావడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు అని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎలా నివారిస్తాయి?
మగ గర్భనిరోధక మాత్రలు గర్భాన్ని రాకుండా ఎలా అడ్డుకుంటాయని కూడా చాలామందిలో సందేహం ఉంది. ఇది ఒక హార్మోన్ ఆధారిత మాత్ర. టెస్టోస్టరాన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీనివల్ల స్పెర్మ్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అలా గర్భంధారణను నివారించే సామర్థ్యం 96% శాతంతో పనిచేస్తుంది.
పురుషుల గర్భనిరోధక మాత్రలపై ఇంకా క్లినికల్ ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇవి భాగస్వాములకు కూడా ఎలాంటి హాని కలిగించవు అని ఇంతవరకు నిర్ధారణ అయింది. హృదయ సంబంధ వ్యాధులు, రక్తం గడ్డ కట్టడం, క్యాన్సర్ ప్రమాదాలు పెంచవని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే దీర్ఘకాలికంగా వాడడం వల్ల మాత్రం కొంత హాని జరగవచ్చు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ మాత్రలు మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Also read: మహిళల సరికొత్త సౌందర్య సాధనం ‘ఫేస్ రేజర్’ - ఇక ముఖానికి షేవింగ్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.