Face Razor: మహిళల సరికొత్త సౌందర్య సాధనం ‘ఫేస్ రేజర్’ - ఇక ముఖానికి షేవింగ్
అందానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు అధికంగా బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు.
వీధికో బ్యూటీ పార్లర్ కనిపిస్తుంటేనే అర్థమవుతుంది, అందానికి యువత ఎంత ప్రాధాన్యత ఇస్తుందో. ముఖ్యంగా మహిళలే అధికంగా అందానికి ప్రాధాన్యత ఇస్తారని అంటారు. వారి కోసమే కొత్త మేకప్ ఉత్పత్తులు, సాధనాలు పుట్టుకొస్తున్నాయి. మొన్నటి వరకు షేవింగ్ అనేది కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన పదం. ఇప్పుడు మహిళలలకూ ఈ పదం వర్తిస్తుంది. ఎందుకంటే ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించుకోవడం కోసం, ఫేస్ రేజర్ వాడడం మొదలుపెట్టారు. దీనితో ముఖ వెంట్రుకలను సున్నితంగా షేవింగ్ చేసుకోవచ్చు. మార్లిన్ మన్రో, ఎలిజిబెత్ టేలర్ వంటి అందానికి చిరునామా అయిన నటీమణులు తమ ముఖాలను షేవ్ చేసుకునేవారని అంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మహిళలు ముఖంపై ఉన్న చిన్న చిన్న వెంట్రుకలను కూడా తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నారు.
కొందరికి ముఖంపై వెంట్రుకలు ఎక్కువగా వస్తాయి. వీటిని ముఖ వెంట్రుకలు అంటారు. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వెల్లస్ హెయిర్, రెండోది టెర్మినల్ హెయిర్. వెల్లస్ హెయిర్ అంతగా కనిపించదు, చాలా చిన్న వెంట్రుకలు ఉంటాయి. ఇక టెర్మినల్ హెయిర్ ముదురుగా, మందంగా పెరుగుతుంది. ఇవి ఎక్కువగా పై పెదవులు, గడ్డం చుట్టూ వస్తాయి.
చర్మంపై ఉన్న జుట్టును తొలగించడానికి షేవింగ్ అనేది సులభమైన పద్ధతిగా భావిస్తున్నారు. అందుకే ఫేషియల్ షేవింగ్ కు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఫేషియల్ రేజర్’ వచ్చేసింది. దీనితో ముఖాన్ని షేవ్ చేసుకుంటే మృదువుగా మారుతుంది. ఇది జుట్టుతో పాటు మృత కణాలను కూడా తొలగిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. అలాగే షేవింగ్ చేసుకున్నాక మేకప్ చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం పాటు ముఖంలో మెరుపు ఉంటుంది.
సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ రేజర్ ను ముఖంపై షేవింగ్ చేసేందుకు వాడకూడదు. సోరియాసిస్, మొటిమలు, తామర వంటి సమస్యలు ఉన్నవారు, సున్నితమైన చర్మం కలవారు ఎట్టి పరిస్థితుల్లో రేజర్ వాడకూడదు. లేకుంటే ఆ సమస్యలు మరింత తీవ్రంగా మారుతాయి. దద్దుర్లు, అసౌకర్యం, ఇన్ఫెక్షన్ వంటివి వచ్చే అవకాశం ఉంది.
మొటిమలు ఉన్నవాళ్లు షేవింగ్ చేయడం వల్ల అక్కడ గాయాలయ్యే అవకాశం ఉంది. రక్తస్రావం అయ్యి అవి నల్లటి మచ్చలకు దారితీస్తాయి. రేజర్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అది చర్మంపై బ్యాక్టీరియా వ్యాప్తికి కారణం అవుతుంది. కాబట్టి దీన్ని వాడితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Also read: అతను తుమ్మితే ఏకంగా మెదడులో నరాలు చిట్లిపోయాయి, చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు
మండే ఎండల్లో జీన్స్ వేసుకోకపోవడమే మంచిది, లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.