Sneezing: అతను తుమ్మితే ఏకంగా మెదడులో నరాలు చిట్లిపోయాయి, చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు
తుమ్ము కారణంగా చావు అంచులు దాకా వెళ్ళొచ్చిన ఒక యువకుడి నిజజీవిత ఘటన ఇది.
తుమ్ములు రావడం సర్వసాధారణ విషయం. ఒక యువకుడికి అలాగే ఒకసారి తుమ్ము వచ్చింది, తుమ్మిన తర్వాత జరిగింది మాత్రం భయానకమైనది. ముక్కు నుండి రక్తం కారింది, ఆ రక్తం కూడా గడ్డ కట్టింది. అతడు స్పృహ కోల్పోయాడు. కాస్త స్పృహ వచ్చాక చూస్తే దృష్టి అస్పష్టంగా అనిపించింది. ఒళ్లంతా వణుకుతున్నట్టు అయింది. మెల్లగా ఫోన్లో తన తల్లి, చెల్లెలికి ఫోన్ చేశాడు. వారు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేవలం తుమ్మడం వల్ల ఆసుపత్రికి రావడం అక్కడ ఉన్నవారికీ ఆశ్చర్యం కలిగించింది. వైద్యులు అతనికి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం స్కానింగ్ లు, పరీక్షలు చేశారు.అతనికి చాలా అరుదైన వ్యాధి ఉన్నట్టు తేల్చారు. ఆ యువకుడి పేరు సామ్ మెస్సిన్. నివసించేది అమెరికాలో.
అసలేం జరిగింది?
వైద్యులు అతనికి అత్యవసర చికిత్స చేసి కాపాడారు. అయితే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ముందుగా ప్రయత్నించారు. మెదడులోని ధమనులు, సిరలను కలిపే రక్తనాళాలు ఉంటాయి. అవన్నీ కూడా చిక్కుపడిపోయి ఉన్నాయి.ఇదే అతని సమస్యా. ఇలా చిక్కుపడటాన్ని ఆర్టెరియోవెనస్ మాల్ఫార్మేషన్ అంటారు. ఇది చాలా తక్కువ మందిలో వచ్చే వ్యాధి. ప్రపంచ జనాభాలో ఒక శాతం కంటే తక్కువ మందిలోనే ఇది సంభవించే అవకాశం ఉంది. వీటివల్ల మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం అవుతుంది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జన్స్ చెప్పిన ప్రకారం అలా రక్తనాళాలు చిట్లడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దృష్టి మసకబారుతుంది. తుమ్మినప్పుడు చిక్కుపడిపోయిన ఆ రక్తనాళాలు చిట్లిపోతాయి. దీంతో వ్యక్తులు స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తారు. మెదడులో అంతర్గతంగా రక్తస్రావం అధికంగా అవుతుంది. ఈ యువకుడి విషయంలో కూడా ఇదే జరిగింది. వారం రోజులు పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు అతడు. నెల రోజులు ఇంట్లో మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత మెల్లగా తన పనులు తాను చేసుకోగలుగుతున్నాడు.
ఏంటి సమస్య?
ఆర్టెరియోవెనస్ మాల్ఫార్మేషన్ (AVM)అంటే మెదడులోని రక్తనాళాలు ఒకదానితో ఒకటి చిక్కుపడిపోవడం. అప్పుడు ధమనులు, సిరలు కలిసిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితి అధికంగా మెదడు వెన్నుపాములోనే జరుగుతుంది. కొన్ని సార్లు శరీరంలో ఎక్కడైనా జరగవచ్చు. అంతర్గతంగా చాలా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో శస్త్ర చికిత్స ఒక్కటే నివారణ. మందులతో సమస్య తగ్గదు.
లక్షణాలు ఇలా...
ఈ అరుదైన సమస్య ఉన్న వారిలో ఒక్కోసారి ఎలాంటి లక్షణాలు కనిపించవు. సమస్య కాస్త తీవ్రంగా మారాక కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
1. స్పృహ కోల్పోవడం
2. తలనొప్పి
3. కండరాల బలహీనత
4. పక్షవాతం
5. వికారం, వాంతులు
6. తిమ్మిరి
7. వణుకుతున్నట్టు అనిపించడం
8. తల తిరగడం
9. మాట్లాడటంలో ఇబ్బంది
10. మానసిక గందరగోళం
11. చిత్తవైకల్యం
12. వెన్నునొప్పి రావడం
దీనికి చికిత్స ఎలా చేస్తారంటే MRI ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. యాంజియోగ్రఫీ కూడా చేస్తారు. తర్వాత శాస్త్ర చికిత్స ద్వారా ఆ చిక్కులను తొలగిస్తారు.
Also read: మండే ఎండల్లో జీన్స్ వేసుకోకపోవడమే మంచిది, లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.