Periods Leave: మహిళలకు నెలసరి సెలవు కావాల్సిందే, తేల్చి చెప్పిన సర్వే
నెలసరికి సెలవు ప్రత్యేకంగా కావాల్సిందేనని మహిళలు కోరుకుంటున్నారు.
అన్ని ఉద్యోగాల్లోనూ మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. అయితే నెలసరి సమయంలో మాత్రం వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి నెలసరి సమయంలో వారికి సెలవు కావాలన్నా విషయం పై పలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు అవసరమంటే, మరికొందరు అవసరం లేదని అంటున్నారు. అయితే దీనిపై ‘ద మెనిస్ట్రువల్ హైజీన్ సర్వే 2023’ నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా హైదరాబాద్ తో సహా బెంగళూరు, ముంబై, కోల్ కతా, ఢిల్లీ వంటి నగరాల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న పదివేల మంది ఉద్యోగినులను కలిశారు. వారిని పది అంశాలపై ప్రశ్నించారు. దీన్ని బట్టి వారు నెలసరి సెలవును కోరుకుంటున్నారో లేదో తేల్చి చెప్పారు. మహిళలు అంతా కూడా నెలసరి సమయంలో తమకు సెలవు కావాలని కచ్చితంగా కోరుకుంటున్నారు. ఎందుకో కూడా వారు వివరించారు.
సర్వేలో పాల్గొన్న మహిళా ఉద్యోగులలో 50 శాతం మంది తమకు నెలసరి వచ్చినప్పుడు మొదటి రెండు రోజులు సరైన నిద్ర ఉండటం లేదని, దీనివల్ల విధుల్లో ఇబ్బంది కలుగుతుందని, సరిగా పనిచేయలేకపోతున్నామని చెప్పారు. అలాగే 63.6% మంది నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నామని, దీనివల్ల ఆఫీస్ కి రాలేకపోతున్నామని వివరించారు. 30 శాతం మంది మహిళలు నెలసరి సమయంలో వచ్చిన అనేక రకాల నొప్పులు వల్ల చాలా ఆందోళనగా, అసౌకర్యంగా అనిపిస్తుందని, ఆఫీసుల్లో ఉండలేకపోతున్నామని వివరించారు. 33 శాతం మంది మహిళలు ఆఫీసుకు వచ్చాక సానిటరీ ప్యాడ్స్ మార్చుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నామని, ఇది చాలా పెద్ద సమస్యగా తమకు మారిందని ఆవేదనగా చెబుతున్నారు.
ఇక 73 శాతం మంది మహిళలు తమకు కచ్చితంగా నెలసరికి సెలవు కావాల్సిందేనని చెప్పారు. అలాగే 86.6% మంది నెలసరి సమయంలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఆఫీసులో ఉండాలని కోరుకున్నారు. అలాగే పరిశుభ్రమైన వాతావరణం కూడా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక 71.7% మంది మహిళలు నెలసరికి కేటాయిస్తే సంస్థలు తమకు బదులుగా మరొకరిని తీసుకుంటారేమోనన్న భయంతో ఉన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న పదివేల మందిలో 68.9% మంది నెలసరి సమయంలో తమ సెలవులను వాడుకుంటున్నారు.
సర్వేలో పాల్గొన్న 40 శాతం మంది మహిళలు కనీసం తమ నెలసరి గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. సహోద్యోగినులతో కూడా ఈ విషయాన్ని వారు చర్చించడం లేదు. అయితే 5.2 శాతం మంది మహిళలు మాత్రం తమ నెలసరి గురించి ధైర్యంగా మేనేజర్ తో చర్చించి తమకు కావాల్సిన స్వేచ్ఛను తీసుకుంటున్నారు. సహాయాన్ని పొందుతున్నారు.
Also read: వారిద్దరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, ఆయనతో కలిసి ఉండలేకపోతున్నా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.