Relationships: వారిద్దరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, ఆయనతో కలిసి ఉండలేకపోతున్నా
ప్రేమించిన వారు కళ్ళముందే మరణిస్తే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం.
ప్రశ్న: మా నాన్నకు ముగ్గురం ఆడపిల్లలం. నేనే పెద్దదాన్ని. నాకు నా చెల్లెళ్లు అంటే చాలా ఇష్టం. మా ముగ్గురం ప్రాణంగా కలిసి బతికాం. ముందుగా నాకే పెళ్లయింది. నా భర్త చాలా మంచివాడు. కుటుంబం కూడా మంచిది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకంటూ ఒక కుటుంబం ఇప్పుడు ఏర్పడింది. సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా నా ఇద్దరు చెల్లెలు అనారోగ్యం బారిన పడ్డారు. ఆరోగ్యంతోనే వారు హఠాత్తుగా మరణించారు. అప్పట్నుంచి నేను ఏదో తెలియని లోటుతో బాధపడుతున్నాను. ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయానని అనిపిస్తుంది. నేను ఉద్యోగం చేస్తాను. ఇంటి పనులతో కూడా బిజీగా ఉంటాను. 24 గంటలు బిజీగా ఉంటున్నా కూడా నా చెల్లెళ్లే గుర్తొస్తున్నారు. దీనివల్ల నేను నా భర్తతో కూడా సరిగ్గా ఉండలేకపోతున్నాను. ఆ బాధ నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. నాకంటూ ఒక కుటుంబం ఉన్న ఒంటరిగా ఎందుకు ఫీల్ అవుతున్నానో తెలియడం లేదు. నావల్ల నా భర్త కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆయనకి కూడా నేను దగ్గర కాలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంటోంది. ఈ ఒంటరితనం అనే ఫీలింగ్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు.
జవాబు: మీకు జరిగింది ఎంతో నష్టం. ప్రాణంగా పెరిగిన అక్కాచెల్లెళ్ళు పెద్దయ్యాక కూడా అదే బంధాన్ని కొనసాగిస్తారు. కానీ మీ ఇద్దరు చెల్లెళ్లు చాలా తక్కువ కాలంలో ఒకరి తర్వాత ఒకరు మరణించడం అనేది మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని అర్థమవుతోంది. పెళ్లయ్యి అత్తవారింటికి వెళ్ళినా కూడా ఆడవారికి పుట్టింటి పై ఎంతో మమకారం ఉంటుంది. బరువు బాధ్యతలు పెరుగుతున్నా కూడా మనసు పుట్టింటి వైపు లాగడం సహజం. మీకు భర్తా, పిల్లలు ఉన్నప్పటికీ మీ చెల్లెళ్లను మీరు మర్చిపోలేకపోతున్నారు. అంటే వారిని మీరు ఎంతగా ప్రేమించారో అర్థమవుతుంది. ఆత్మీయుల మరణం ఆరు నెలల వరకు మానసికంగా బాధపెడుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మీ చెల్లెళ్లు మరణించి ఏడాదికి పైగా అవుతోందని తెలుస్తోంది. అయినా కూడా మీరు ఆ బాధ నుంచి ఇప్పటికి బయటపడలేకపోతున్నారు. అంటే మీరు డిప్రెషన్ కి గురైనట్టు అర్థం చేసుకోవాలి. మీరు ముగ్గురు ఆడపిల్లలు కావడం, ముగ్గురూ సఖ్యతగా భావాలు పంచుకుంటూ పెరగడం వల్ల మీ అనుబంధం చాలా బలపడింది. పెళ్లయిన తర్వాత కూడా మీరు ఆ అనుబంధాన్ని కొనసాగించారు. ఇప్పుడు వాళ్లు లేరనే బాధ మిమ్మల్ని వేధిస్తోంది. మీ కళ్ళముందే వారు చనిపోవడం వల్ల మీ మనసు చాలా గాయపడింది.
అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది మరణించిన మీ చెల్లెళ్ల గురించి ఆలోచించడం కాదు, మీ కళ్ళ ముందున్న భర్తా, పిల్లల గురించి ఆలోచించాలి. జీవితమనేది ఒక రైలు ప్రయాణం అనుకోండి. ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్లిపోతారు. ఈ విషయాన్ని మీకు మీరే చెప్పుకోవాలి. ధైర్యాన్ని తెచ్చుకోవాలి. దీనికి మీరు మీ భర్త సహకారాన్ని తీసుకోవాలి. మీ బాధను అతనితో పంచుకొని సాయాన్ని కోరండి. వీలైతే సైక్రియాటిస్ట్ ను కలవండి. వెళ్ళిపోయిన వారి గురించి బాధపడుతూ మీ కళ్ళ ముందు ఉన్న వారిని బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచించండి. వైద్యులను కలిస్తే యాంటీ డిప్రెసెంట్ టాబ్లెట్లు, గ్రీఫ్ థెరపి, స్ట్రెస్ మేనేజ్మెంట్ వంటివి ఇస్తారు. అలాగే నచ్చిన హాబీలను చేసుకుంటూ ఉండండి. బంధుమిత్రులతో కలుస్తూ ఉండండి. ఇతరులకు సాయం చేసినప్పుడు ఎక్కువ ఆనందం కలుగుతుంది. అలా సంఘ సేవలో కూడా పాలుపంచుకోండి. మీ మనసును బాధ నుంచి వేరే వ్యాపకాల వైపు మళ్ళించండి. ఇది మీకు ఎంతో ఊరటనిస్తుంది. మీ ఇంట్లో వారికి కూడా మీ వల్ల కలిగే మానసిక వేదన నుంచి బయటపడేలా చేస్తుంది. ఇక మీ అమ్మ నాన్న గారికి మీరు ఒక్కరే దిక్కు అంటున్నారు. అలాంటప్పుడు మీరు ఇలా మానసికంగా వేదనతో రగిలిపోతే, వారు మాత్రం ఆనందంగా ఎలా ఉంటారు? అసలే ఇద్దరు ఆడపిల్లలను కోల్పోయిన బాధలో ఉన్నవారికి, మీరే అండగా నిలుచుని ధైర్యం చెప్పాలి. మీరే ఇలా మానసికంగా కుంగిపోతే ఆ ముసలి వయసులో వారిని ఆదుకునేది ఎవరు? ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరు ధైర్యంగా మార్చుకోండి.
Also read: మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో చెప్పే ఆరు టెస్టులు ఇవే