Cataracts: కంటి శుక్లాలు ఎందుకు వస్తాయి? ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువ?
కంటి శుక్లాలతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. వీటిని రాకుండా ముందే అడ్డుకుంటే మేలు.
కంటి శుక్లాలు అనేవి మనిషిని అంధుడిని చేసే వ్యాధి. ఇది మీ దృష్టిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే కంటి చూపు పోవడానికి కారణం అవుతుంది. ఎక్కువ మంది అంధత్వానికి ఈ కంటి శుక్లాలే ప్రధాన కారణం. ఈ వ్యాధి బారిన అధికంగా వృద్ధులు పడుతూ ఉంటారు. కానీ మారుతున్న కాలంలో యువత కూడా కంటిశుక్లాలు బారిన పడే అవకాశం ఉంది. కంటి శుక్లాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి వచ్చిందంటే జీవితాంతం వాటితో బాధపడాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు అంచనా.
కంటి శుక్లాలు అంటే ఏమిటి?
మన కంటిలో సహజ లెన్స్ ఉంటుంది. ఇదే మనకు ఎదురుగా ఉండే వస్తువులను చూడటానికి వీలు కల్పిస్తుంది. ఇది నీరు, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ లెన్స్ లోని ప్రోటీన్, నీరు ఒకదానితో ఒకటి కలిసిపోయి మబ్బు లాంటి సమూహాలను సృష్టిస్తాయి. ఇవి చూపుకి అడ్డంరిగా మారుతాయి. ఈ కంటి శుక్లాలు ఒకటి లేదా రెండు కళ్ళల్లోనూ ఏర్పడవచ్చు.
లక్షణాలు ఎలా ఉంటాయి?
కంటి శుక్లాలు వచ్చాక ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ అది ముదురుతున్న కొద్ది కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
1. అస్పష్టమైన చూపు
2. ఎదురుగా ఉన్నవి ఏవైనా రెండుగా కనిపించడం
3. లైట్లు చుట్టూ చీకటి ప్రాంతాలు కనిపించడం
4. కాంతి చూడలేకపోవడం
5. రాత్రిపూట చూడటం కష్టతరంగా మారడం
6. రంగులు సరిగా గుర్తించలేకపోవడం
7. చూసేవన్నీ పసుపు రంగులో కనిపించడం
8. ఎదుటివారి ముఖాలు పోల్చలేకపోవడం
ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ?
వృద్ధుల్లో ఈ కంటి శుక్లాలు వచ్చే అవకాశం ఎక్కువజ అలాగే గ్లాకోమా వంటి వ్యాధుల బారిన పడే వారిలో కూడా కంటి శుక్లాలు వస్తాయి. మధుమేహం కారణంగా కంటికి ఏమైనా గాయాలు అయితే కంటి శుక్లంగా మారే అవకాశం ఉంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా కంటి శుక్లాలు రావచ్చు.
చికిత్స ఎలా?
కంటి శుక్లాలు ముదిరిపోతే మరలా చూపు రావడం కష్టతరంగా మారొచ్చు. దీని చికిత్సలో భాగంగా కంటిలోని సహజ లెన్స్‌ను తీసివేసి కృత్రిమ లెన్స్‌ను అమరుస్తారు. ఈ కృత్రిమ లెన్స్ ద్వారా మళ్ళీ చూపు మెరుగుపడుతుంది. ఆపరేషన్, లేజర్ చికిత్స ద్వారా కంటి శుక్లాలకు చికిత్స చేస్తారు. కంటిలో చిన్న కోత ద్వారా ఈ లెన్స్ తొలగిస్తారు. చికిత్స తర్వాత రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నల్లటి కళద్దాలు పెట్టుకుని వారం రోజుల పాటూ కంట్లో దుమ్మూ ధూళి పడకుండా చూసుకోవాలి.
Also read: వారానికోసారి బాడీ మసాజ్ చేయించుకుంటే ఈ సమస్యలన్నీ మాయం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.