Valentine's Day: ప్రేమించమని చెప్పడమే వాలెంటైన్‌కు శాపమైంది, ఉరికొయ్యకు వేలాడాల్సి వచ్చింది
ప్రేమకు బలైపోయిన ఎంతోమందిలో సెయింట్ వాలెంటైన్ కూడా ఒకరు.
ప్రేమికుల దినోత్సవం పుట్టుకకు కారణం సెయింట్ వాలెంటైన్. ఆయన కూడా అదే ప్రేమకు బలైపోయాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. ప్రపంచం మొత్తం ప్రేమ భావనతో నిండిపోవాలని కోరుకున్నాడు వాలెంటైన్. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ చిగురించడం చాలా అవసరమని ప్రచారం చేసే వాడు. అదే అతని పాలిట శాపమైంది. చివరకు ప్రాణాలు తీసేసింది. ఇది ప్రేమికుల గురువుగా పేరు పొందిన సెయింట్ వాలెంటైన్ కథ. అతడిని ఫిబ్రవరి 14నే ఉరితీశారు. అందుకే అదే రోజును కొన్ని దేశాల్లో ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.
ఎవరీ వాలెంటైన్
వాలెంటైన్ అనే యువకుడు ఒక మత ప్రవక్త. రోమ్ దేశంలో పుట్టాడు. మూడో శతాబ్ధంలో (270 వ సంవత్సరంలో) రోమ్‌ను రెండో క్లాడియస్ పాలిస్తూ ఉండేవారు. అతను చాలా క్రూరుడు. జాలి దయ తక్కువగా ఉండేవి. దేశంలోని మగవారంతా పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కంటే, వారి మీద ప్రేమతో సైన్యంలోకి రారని భావించాడు. అందుకే పెళ్లిళ్లపై నిషేధం విధించాడు. కేవలం తన సైనికుల సంఖ్య పెంచుకునేందుకు ఇలా స్వార్థంగా ఆలోచించాడు ఆ చక్రవర్తి. వాలెంటైన్‌కు విషయం అర్థమైంది. ఆయన వీధి వీధి తిరుగుతూ ప్రేమ ప్రభోధాలు చేసేవారు. ప్రేమ చాలా అవసరమని, దాన్ని గురించి గొప్పగా ఉపన్యసించేవారు. అతను మాటలకు ప్రభావితమైన చాలా మంది పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు వాలెంటైన్ కూడా రహస్యంగా చాలా వివాహాలు చేశాడు. విషయం చక్రవర్తికి తెలిసింది. వాలెంటైన్‌ను జైల్లో బంధించాడు. అంతేకాదు అతనికి మరణశిక్ష కూడా విధించాడు.
అతనిలో ప్రేమ పుట్టిందిలా...
జైల్లో పెట్టడానికి కొన్ని రోజుల ముందు జైలర్ కూతురి అంధత్వానికి వాలెంటైన్ చికిత్స చేశాడు. ఆమెకు మళ్లీ చూపు వచ్చింది. ఆ సమయంలోనే ఆమెతో వాలెంటైన్ ప్రేమలో పడ్డాడని అంటారు. ఆమెకు ‘ప్రేమతో నీ వాలెంటైన్’ అని ఒక లేఖ కూడా రాసినట్టు చరిత్రకారులు చెబుతారు. అది కూడా రోమ్ చక్రవర్తికి చాలా కోపం తెప్పించిందని అంటారు. అలాగే వాలెంటైన్ ప్రేమ ప్రవచనాలకు స్వయంగా రోమ్ చక్రవర్తి కూతురు కూడా ఆకర్షితురాలైందని, ఆమె అతడిని ప్రేమించిందని కూడా మరో కథ ప్రచారంలో ఉంది. ఆ విషయం ఆమె తండ్రికి తెలిసిపోవడంతో వాలెంటైన్‌కు ఉరిశిక్షను అమలు చేసినట్టు చెబుతారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్ ఉరికొయ్యకు వేలాడాడు. విషయం తెలిసి రోమ్ లోని చాలా మంది ప్రేమికులు మూగగా రోదించారు. అతను చనిపోయిన రెండు దశాబ్ధాల తరువాత పోప్ గెలాసియన్స్ వాలెంటైన్ చావుకు ఓ కారణం ఉందని, అతని చావు అలా కాలగర్భంలో కలిసిపోనివ్వకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ రోజును ప్రేమికుల దినోత్సవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చాడు. అందుకే రోమ్‌లోనే ప్రేమికుల దినోత్సవం పుట్టిందని చెబుతారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియా దేశాలు వాలెంటైన్స్ డేపై నిషేధం విధించాయి. అది తమ మతాచారాలకు విరుధ్ధమని చెప్పాయి. కొన్ని దేశాల్లో మాత్రం ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయి.
Also read: మనసును తాకే అందమైన ప్రేమ సందేశాలు ఇవిగో
Also read: ఇలాంటి వాగ్ధానాలు చేస్తే ఎవరు మాత్రం పడిపోరు, హ్యాపీ ప్రామిస్ డే