Pregnancy: పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఏది? ఏ వయసులో కంటే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది?
ఉద్యోగాల సుడిలో చిక్కుకుని పెళ్లిని, పిల్లలు కనడాన్ని ఆలస్యం చేస్తున్నాయి చాలా జంటలు.
కాలం మారింది. ఆడపిల్లలు కూడా చదువు తరువాత ఉద్యోగం బాట పడుతున్నారు. ఉద్యోగంలో ఇప్పుడే కదా చేరాం అని పెళ్లిని, తద్వారా పిల్లల్ని వాయిదా వేస్తున్నారు. త్వరగా పెళ్లి చేసుకున్న జంటలు కూడా పిల్లల్ని మాత్రం లేటుగా కనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. కానీ పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే సరైన వయసులో కనాల్సిందేనని చెబుతున్నాయి వైద్య పరిశోధనలు. ఉద్యగం చేస్తున్న ఆడవాళ్లు అధికంగా 35కి చేరువయ్యాక పిల్లల్ని కనేందుకు ఇష్టపడుతున్నారు.
ఆ వయసులోనే సామర్థ్యం ఎక్కువ...
ఆడవారిలో పిల్లలు కనే సామర్థ్యం, ఆరోగ్యకరమైన అండాలు ఏ వయసులో ఉంటాయో తెలుసా? 21 ఏళ్ల నుంచే ఆడవాళ్ల శరీరం పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉంటుంది. ఆ వయసు దాటిన వారిలో గర్భధారణకు అనువైన పరిస్థితులు, అండాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగని 21 ఏళ్లకే పిల్లల్ని కనమని కాదు, 25 ఏళ్ల నుంచి 30 లోపు పిల్లల్ని కంటే ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. అప్పుడు విడుదలయ్యే అండాలు కూడా పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన పిల్లలు కావాలనుకుంటే 30 లోపు కనమని సిఫారసు చేస్తున్నారు వైద్యులు. ఆ వయసు దాటాకా ఆడవారిలో చాలా మార్పులు వస్తాయి. హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటివి ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే అవకాశం ఎక్కువ. ఇక 35 ఏళ్లు దాటాక వచ్చే గర్భం హై రిస్క్ కింద భావిస్తారు వైద్యులు. వారికి ప్రత్యేక జాగ్రత్తలు తప్పవు. కాబట్టి పెళ్లయిన జంటలు 30 ఏళ్లలోపు పిల్లల్ని కనేందుకు ప్రయత్నించడం చాలా ఉత్తమం.
ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి...
కెరీర్ కోసం అలాగే, డబ్బులు బాగా సంపాదించి సెటిలయ్యాక పిల్లల్ని కనాలని భావించే జంటలు ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్దతులకు వెళ్లడం మంచిది. అంటే 30 లోపు పిల్లల్ని కనలేం అనుకునే వారు తమ ఆరోగ్యకరమైన అండాలను దాయచ్చు. ఇందుకోసం ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. ఫెర్టిలిటీ వైద్యులను కలిస్తే ఎగ్ ఫ్రీజింగ్, స్మెర్మ్ ఫ్రీజింగ్ కు సంబంధించి వివరాలను అందిస్తారు.
లేటయితే ప్రసవం కూడా కష్టం...
30 లోపు ఆడవారిలో ప్రసవం సులువుగా అవుతుంది. రిస్క్ లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ 30 ఏళ్లు దాటాకా రకరకాల సమస్యలు రావచ్చు. అదే 35 ఏళ్లు దాటితే అండోత్పత్తి కూడా తగ్గిపోయి, చాలా నీరసమైన అండాలు విడుదలవుతాయి. దీని వల్ల బిడ్డ కూడా సమస్యలతో పుట్టొచ్చు. అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి.
Also read: గ్రీన్ టీ పిల్లలు కూడా తాగొచ్చా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Also read: ఏ వయసు పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూడొచ్చు? అతిగా స్క్రీన్ చూడడం వల్ల వచ్చే ప్రమాదమేంటి?