(Source: ECI/ABP News/ABP Majha)
Quit Alcohol: అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Quit Alcohol: చాలామంది కొత్త ఏడాదిలో మందు మానేయడానికి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ, అదంత సులభమైన విషయం కాదు. అయినా.. మానేస్తే మందు కంటే ఎక్కువ కిక్కును జీవితంలో చూడవచ్చు.
గ్రీకు పురాణాలను అనుసరించి మనుషులకు అగ్నిని ప్రసాదించినందుకు ప్రోమేతియాస్‌ను జ్యూస్ శిక్షించాడు. ఆ శిక్షలో భాగంగా ప్రతి రాత్రి అతడి లివర్‌ను తినేందుకు ఒక గద్ద వచ్చేది. తెల్లవారే పెరిగిన తన లివర్‌ను మళ్లీ రాత్రి గద్ద తినేసేది. నిజంగా లివర్ తిరిగి పెరుగుతుందా?
కాలేయం శరీరంలోపలి అతి పెద్ద అవయవం. ఆల్కహాల్ విచ్ఛిన్నం నుంచి రకరకాల శరీర జీవక్రియలు సక్రమంగా సాగాలంటే ఇది ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఆల్కహాల్ తాగడం వల్ల మెదడు నుంచి గుండె వరకు రకరకాల అవయవాలు కూడా ప్రభావితం అవుతాయి.
కాలేయ సమస్యలను గుర్తించడం కష్టమే
ఫ్యాటీ లివర్ నుంచి లివర్ సిర్రోసిస్ వరకు.. ఏ కాలేయ సమస్యల్లో అయినా సరే చివరి వరకు కూడా ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించవు. ఆల్కహాల్ వినియోగం ఎక్కువగా ఉన్నపుడు ముందుగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. కొవ్వు వల్ల లివర్‌లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఈ స్థితిలో లివర్ సెల్ఫ్ హీలింగ్ కోసం ప్రయత్నం చేస్తుంది. దీనికి చికిత్స చెయ్యకుండా వదిలేస్తే కాలేయంపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి.. సిర్రోసిస్ వంటి సీరియస్ సమస్య వస్తుంది.
ఆల్కహాల్ మానేస్తే ఏం జరుగుతుంది?
ఫ్యాటీ లివర్ సమస్య మొదలైన తర్వాత ఆల్కహాల్ మానేసిన రెండు, మూడు వారాల్లో కాలేయం తిరిగి కోలుకుంటుంది. అదే కాలేయంలో తేలికపాటి మచ్చలు ఏర్పడి ఉన్నపుడు ఆల్కహాల్ మానేసిన ఏడు రోజుల్లో మచ్చలు గణనీయంగా తగ్గుముఖం పడుతాయి. కొన్ని నెలల పాటు పూర్తిగా ఆల్కహాల్ మానేస్తే కాలేయం పూర్వపు స్థితికి చేరుతుంది.
సమస్య తీవ్రంగా ఉన్నపుడు లివర్ సిర్రోసిస్ ఏర్పడినపుడు కూడా ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేస్తే లివర్ ఫెయిల్యూర్ వల్ల మరణించే ప్రమాదం తగ్గుతుంది. ఆల్కహాల్ మానెయ్యడం వల్ల నిద్ర, మెదడు పనితీరు, రక్తపోటు మీద కూడా మంచి ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఆల్కహాల్ కు దూరంగా ఉండడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది.
వ్యసనం తీవ్రమైతే.. నిపుణులను సంప్రదించాలి
ఆల్కహాల్ వ్యసనంగా మారిన వారిలో అకస్మాత్తుగా మానేస్తే అది విత్ డ్రావల్ లక్షణాలకు కారణం అవుతుంది. శరీరం చిన్నగా కంపించడం, చమటలు పట్టడం వంటి తేలిక పాటి లక్షణాల నుంచి బ్రాంతి కలగడం, ఫిట్స్ నుంచి మరణం వంటి తీవ్రమైన పరిణామాలు కూడా కలగవచ్చు. తీవ్రమైన వ్యసనంలో ఉన్నవారు అకస్మాత్తుగా, పూర్తిగా మానెయ్యకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో ఈ వ్యసనం నుంచి బయటపడాల్సిందిగా సలహా ఇస్తున్నారు.
ఆర్టికల్ మొదట్లో చెప్పుకున్నట్టు ప్రొమేతియస్ కాలేయం తిరిగి పెరిగినట్టు.. లివర్ తనకు జరిగిన నష్టాన్ని తానే తగ్గించుకుని తిరిగి ఆరోగ్యాన్ని సంతరించుకోగలదు. కానీ నష్టం తక్కువగా ఉన్నపుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. తీవ్రమైన నష్టం జరిగితే మాత్రం తిరిగి కోలుకోవడం కష్టం అని మరచిపోవద్దు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.