Ganesh Chaturthi Recipes: బొజ్జ గణపయ్య కోసం నైవేద్యంగా పాల తాలికలు, చేయడం చాలా సులువు
( Vinayaka Chavithi 2022 Recipes)వినాయక చవితికి నైవేద్యంగా ఏం వండాలా? అని ఆలోచిస్తున్నారా... పాలతాలికలు చేసి చూడండి.
విఘ్నాలు తొలగించి విజయాలు అందించే వినాయకుని అత్యంత విశిష్టమైన పండుగ ‘వినాయక చవితి’. ఆరోజున ఆ బొజ్జగణపయ్యకు ఇష్టమైన నైవేద్యాలు చేసి కుటుంబమంతా కలిసి భక్తి శ్రద్ధాలతో పూజిస్తారు. ప్రతి ఏడాది భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ గణపయ్యను ఘనంగా పూజిస్తాము. వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలలో పాల తాలికలు ఒకటి. దీనిలో నూనె వాడము. నిజానికి వినాయక చవితి రోజూ నూనె లేని వంటలే నైవేద్యంగా పెట్టాలని కూడా చెబుతారు. ఈ పాలతాలికల్లో నెయ్యి తప్ప నూనె అవసరం లేదు. ఈ వంటకాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ విఘ్ననాయకుడి ఆశీస్సులు పొందండి.
కావాల్సిన పదార్థాలు
పాలు - మూడు కప్పులు
నెయ్యి - ఒక స్పూను
జీడిపప్పు - పది
ఎండుద్రాక్షలు - పది
బెల్లం తురుము - ఒక కప్పు
బియ్యంప్పిండి - ఒక కప్పు
సగ్గుబియ్యం - రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - ఒక స్పూను
తయారీ ఇలా...
1. సగ్గుబియ్యాన్ని అరకప్పు నీటిలో నానబెట్టుకోవాలి.
2. కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ పండ్లు వేయించాలి. తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడదే కళాయిలో ముప్పావు కప్పు నీళ్లు వేయాలి. అలాగే రెండు స్పూన్ల బెల్లం తురుము వేయాలి.
4.బెల్లం తురుము బాగా కరిగి పోయాక ఒక కప్పు బియ్యంప్పిండి వేసి కలపాలి.
5. పిండి వేశాక వెంటనే స్టవ్ కట్టేయాలి. ఆ పిండిని బాగా కలిపాలి. కాస్త వేడి తగ్గాక చపాతీ పిండిలా చేత్తో కలుపుకోవాలి.
6. ఇప్పుడు ఆ పిండి నుంచి చిన్న ముద్ద తీసి సన్నగా, పొడవుగా తాడులాగా తాలికలు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కప్పు బెల్లం వేసి, పావు కప్పు నీళ్లు వేయాలి. బెల్లం కరిగాక దాన్ని ఓ గిన్నెలో తీసి పెట్టుకోవాలి.
8. ఇప్పుడు కళాయిలో మూడు కప్పుల పాలు వేసి కాచాలి.
9. పాలు బాగా మరిగాక నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేయాలి.
10. సగ్గుబియ్యం ఉడికాక, ముందుగా తయారుచేసుకున్న తాలికలు వేయాలి. పాలల్లో మునిగేటట్టు గరిటెతో సర్ది మూత పెట్టేయాలి.
11. పావు గంటసేపు ఉడికిస్తే తాలికలు కాస్త గట్టిపడతాయి. ముక్కలు కాకుండా ఉంటాయి.
12. ఇప్పుడు పావు కప్పు నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ బియ్యంప్పిండి వేసి బాగా గిలక్కొట్టి కళాయిలోని మిశ్రమంలో కలపాలి. మూత పెట్టి మరో అయిదు నిమిషాలు ఉడికించాలి. ఇలా కలపడం వల్ల పాయసం చిక్కగా మారుతుంది.
13. తరువాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
14. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ లను కలపాలి. అలాగే యాలకుల పొడిని చల్లుకోవాలి.
15. అలాగే ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం కూడా కలుపుకోవాలి.
16. అంతే టేస్టీ పాల తాలికలు రెడీ. బొజ్జగణపయ్యకు వీటిని నైవేద్యంగా సమర్పించండి.
Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి