(Source: ECI/ABP News/ABP Majha)
VaraLakshmi vratham Prasadam: వరలక్ష్మీ వ్రతానికి బెల్లం అన్నం, పులగం రెసిపీలు ఇవిగో, ఇలా సింపుల్‌గా చేసేయచ్చు
వరలక్ష్మీ వ్రతం వచ్చేస్తుంది. సింపుల్‌గా చేసే నైవేద్యాల కోసం వెతుకుతున్నారా? అయితే ఈ రెసిపీలు మీకోసమే.
వరలక్ష్మీ వ్రతం ఏరోజు చేసుకోవాలన్న విషయంపై కాస్త సందిగ్ధత నెలకొంది ఈసారి. కొంతమంది ఆగస్టు 5న చేసుకుంటే, మరికొందరు ఆగస్టు 12న చేసుకుంటారు. ఏ రోజు చేసుకున్నా అమ్మవారికి నైవేద్యాలైతే వండి నివేదించాల్సిందే. అందరూ సింపుల్ గా చేసుకునే నైవేద్యాలైతే కొత్త పెళ్లికూతుళ్లు, చిన్న పిల్లలున్న తల్లులకు ఉపయోగపడతాయి. అలా చిటికెలో పెద్ద ప్రాసెస్ లేకుండా వండుకునే ప్రసాదాలు ఈ రెండూ. ఒకటి స్వీట్, ఒక హాట్ రెసిపీలు ఇవి. వీటిని నివేదించి భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆ వరలక్ష్మీ దేవి మీ కోరికలను తీరుస్తుంది.
బెల్లం అన్నం
కావాల్సిన పదార్థాలు
బియ్యం - ఒక కప్పు
పెసరపప్పు - అరకప్పు
నెయ్యి - మూడు స్పూనులు
బెల్లం - అరకప్పు
పాలు - ఒక కప్పు
జీడిపప్పులు - ఆరు
కిస్ మిస్లు - పది
యాలకుల పొడి - అరచెంచా
తయారీ విధానం
1. ముందుగానే బియ్యాన్ని, పెసరపప్పును అరగంట ముందు నానబెట్టాలి.
2. వాటిని కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి.
3. కుక్కర్ మూత తీసేశాక గరిటెతో ఓసారి బాగా కలపుకోవాలి.
4. స్టవ్ చిన్న మంట మీద పెట్టి బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని పెట్టాలి.
5. అందులో తురిమిన బెల్లం, యాలకుపొడి వేసి బాగా కలపాలి.
6. బెల్లం కరిగి పలచగా అయ్యాక, కాచిన పాలను వేయాలి.
7. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అయ్యేదాకా ఉడికించాలి.
8. నెయ్యిలో వేయించిన కిస్ మిస్, జీడిపప్పులు కూడా కలుపుకోవాలి.
9. దించే ముందు రెండు స్పూనుల నెయ్యి వేసుకోవాలి.
10. బెల్లం అన్నం రెడీ అయినట్టే.
పులగం
కావాల్సిన పదార్థాలు
బియ్యం - ఒక కప్పు
పెసరపప్పు - అర కప్పు
మిరియాల పొడి - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు
జీడిప్పులు - ఆరు
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. బియ్యం, పెసరపప్పును అరగంట ముందే నానబెట్టుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి జీడి పప్పును వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. మిగిలిన నెయ్యిలో జీలకర్ర, మిరియాలు, కరివేపాకులు వేసి వేయించాలి.
4. ఇప్పుడు మూడు గ్లాసుల నీళ్లు పోయాలి. అందులో ఉప్పు కూడా వేయాలి.
5. నీళ్లు సలసల కాగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేయాలి.
6. మెత్తగా ఉడికాక స్టవ్ కట్టేసి పైన జీడిపప్పులు చల్లుకోవాలి.
7. టేస్టీ పులగం సిద్ధమైనట్టే.
పెళ్లయిన స్త్రీలు వరలక్ష్మీ వ్రతం చేయడం వల్ల వారికి, వారి కుటుంబానికి సకల సుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీ దేవికి చాలా ప్రత్యేకత ఉంది. విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిటా వచ్చే మాసంలో లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో ఆర్ధికంగా కలిసి వస్తుంది. వరలక్ష్మీ వ్రతం సకల శుభకరం. దీపారాధనతో పాటూ చేతనైన నైవేద్యాన్ని వండి పెట్టి మనస్పూర్తిగా మొక్కితే ఆ తల్లి మీ కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది.
Also read: బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఈ తప్పులు చేస్తే బాన పొట్ట రావడం ఖాయం
Also read: డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన నాలుగు కూరగాయలు ఇవే