Salt: సాధారణ ఉప్పుకు బదులు రాతి ఉప్పు వాడి చూడండి, ఎన్ని ప్రయోజనాలో
ఇప్పుడు అందరూ అయోడైజ్డ్ ఉప్పు పొడినే వాడుతున్నారు. కానీ రాతి ఉప్పుతోనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
మన శరీరానికి అయోడిన్ చాలా అవసరం. అందుకే ఇప్పుడు అందరూ బయట అమ్మే అయోడైజ్డ్ ఉప్పు ప్యాకెట్లని కొంటున్నారు. అయితే రాతి ఉప్పుని వాడడం పూర్తిగా మానేశారు. అలా కాకుండా వారంలో ఒకటి, రెండు సార్లు అయినా రాతి ఉప్పును వాడడం చాలా మంచిది. సాధారణ ఉప్పు కంటే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. కాకపోతే కొంచెం అయోడిన్ తక్కువ ఉంటుంది. కాబట్టి పూర్తిగా వాడడం మానేసే కన్నా అప్పుడప్పుడు ఆహారంలో వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సముద్రంలోని ఉప్పునీరు ద్వారా ఇది తయారవుతుంది. సముద్రపు నీటిలోని నీరంతా ఆవిరయ్యాక మిగిలిన సోడియం క్లోరైడ్ గులాబీ రంగు స్పటికాలుగా మారుతుంది. అదే రాతి ఉప్పు. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. హిమాలయన్ పింక్ సాల్ట్ కూడా ఒకటి. ఆయుర్వేదంలో రాతి ఉప్పుకు ఎంతో గౌరవం ఉంది. ప్రాచీన కాలం నుండి రాతి ఉప్పుని ఔషధంగా వాడుతున్నారు. సాధారణ దగ్గు, జలుబుకు చికిత్స చేయగల సామర్థ్యం రాతి ఉప్పుకి ఉంది. అలాగే కంటి చూపుకు, జీర్ణక్రియకు ఇది సహాయపడుతుంది.
రాతి ఉప్పులో ఐరన్, జింక్, నికెల్, మాంగనీస్ ఇలా శరీరానికి మేలు చేసే ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి అత్యవసరమైనవి. అలాగే సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ రాతి ఉప్పులో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరానికి హానికరం కాదు. అలాగే ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్ కంటెంట్ కండరాల నొప్పిని, తిమ్మిరి నుంచి కాపాడుతుంది. శరీరంలోని నరాలు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం రాతి ఉప్పు పేగు ఆరోగ్యానికి మంచిది. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సమస్యలకు చెక్ పెడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ముందుంటుంది.
అన్నిటికంటే ముఖ్యంగా రాతి ఉప్పు తయారీలో ఎలాంటి ప్రాసెసింగ్ జరగదు. అంటే ఇది సహజమైన పద్దతిలో లభిస్తుంది. సాధారణ టేబుల్ సాల్ట్‌ను ప్రాసెస్ చేస్తారు. దాంతో పోల్చుకుంటే రాతి ఉప్పు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ఏ ఉప్పు అయినా వాడకం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది శరీరంలో అధికంగా చేరడం వల్ల అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు వల్ల గుండె జబ్బులు, మధుమేహం, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది.
Also read: పాలు తాగిన వెంటనే ఇంటి నుంచి బయటకు వెళితే అరిష్టమా? సైన్సు ఏం చెబుతోంది?
Also read: తీపి పదార్థాలు తినాలన్న కోరిక పెరిగిపోతోందా? అయితే జాగ్రత్త భవిష్యత్తులో వచ్చే ముప్పు ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.