తీపి పదార్థాలు తినాలన్న కోరిక పెరిగిపోతోందా? అయితే జాగ్రత్త భవిష్యత్తులో వచ్చే ముప్పు ఇదే
తీపి ఆహారాల కోరిక పెరిగిపోతుంటే, అది డిమెన్షియా అనే సమస్య రావడానికి ముందస్తు హెచ్చరికగా భావించాలి.
తీపి పదార్థాలను తినాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కాస్త తీపి తిన్నాక ఆ కోరిక తగ్గిపోతుంది. కానీ కొందరికి రోజురోజుకి తీపిగా ఉండే పదార్థాలను తినాలన్న కోరిక ఎక్కువైపోతూ ఉంటుంది. అలా తీపి ఆహారాల కోరిక పెరుగుతుందంటే అంటే భవిష్యత్తులో కొన్ని రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పే ఒక హెచ్చరికగా భావించాలి. అల్జీమర్స్ వ్యాధి... జ్ఞాపకశక్తి, ఆలోచన , సామాజిక సామర్ధ్యాలను ప్రభావితం చేస్తుంది. తీపి ఆహారం తినాలన్న కోరిక అధికంగా ఉన్నవారికి సమీప భవిష్యత్తులో ఈ అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. దీన్నే డిమెన్షియా అని కూడా అంటారు. డిమెన్షియా అంటే చిత్త వైకల్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మెదడులోని వ్యక్తిత్వం, ప్రవర్తన, మాట తీరు గురించి పని చేసే భాగాలపై ప్రభావం చూపిస్తుంది. ఇది మెదడులో ఫ్రంట్ టెంపోరల్ లోబ్స్‌లో ఉన్న న్యూరాన్లకు నష్టం కలిగేలా చేస్తుంది. నిజానికి ఈ సమస్య 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులకు వస్తుంది. ఇలాంటివారు తీపి పదార్థాలు తినాలన్న కోరిక పెరుగుతుంటే, తినకుండా తమను తాము నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
ఏమిటీ లింక్?
అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెబుతున్న ప్రకారం ఆహారంపై ఉన్న ఆసక్తికి, డిమెన్షియా వచ్చే అవకాశానికి మధ్య బంధం ఉంది. ప్రవర్తనలో మార్పులు, తీపి పదార్థాలను అధికంగా కోరుకోవడం వంటి వన్నీ కూడా డిమెన్షియా రాకకు సంకేతాలుగా చెబుతున్నారు. అతిగా తినడం, అతిగా మద్యం సేవించడం, తినేటప్పుడు మర్యాదలు పాటించకపోవడం వంటివి కూడా భవిష్యత్తులో డిమెన్షియా వచ్చే రాకను సూచిస్తున్నట్టే. ఇవే కాదు ఇంకా అనేక లక్షణాలు ఉన్నాయి. తదేకంగా చూడడం, వ్యక్తులతో అధికంగా మాట్లాడడం, చేసే పనిపై దృష్టి పెట్టలేకపోవడం, చేసిన పనే పదేపదే చేయడం వంటివి కూడా భవిష్యత్తులో ఈ వ్యాధి రాకకు సూచనలే.
చికిత్స
ఈ వ్యాధికి చికిత్స లేదు. అయితే లక్షణాలను మాత్రం మందుల ద్వారా తగ్గించవచ్చు. వైద్యులు ఈ వ్యాధి బారిన పడిన వారికి యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తుంటారు. ఇది అతిగా తినడం, విచిత్ర ప్రవర్తనలను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఫిజియోథెరపీని కూడా సూచిస్తారు. స్పీచ్ థెరపీ ద్వారా కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. ఏది ఏమైనా అతి స్వీట్లు తినడం మాత్రం ఆరోగ్యానికి అనర్ధదాయకం
Also read: పప్పు వండడానికి ముందు నీళ్లలో నానబెట్టమని చెబుతుంది ఆయుర్వేదం, ఎందుకు?
Also read: గర్భిణులు జాగ్రత్త, దంత సమస్యలు ఉంటే ముందస్తు ప్రసవం అయ్యే అవకాశం - చెబుతున్న కొత్త అధ్యయనం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.