Tic Disorder: బ్యాన్ అయిపోయింది కనుక బతికిపోయాం! లేకపోతే టిక్ టాక్‌తో 'టిక్స్' రోగం!
టిక్ టాక్‌తో కొత్త రకం జబ్బులు వస్తున్నట్లు వైద్యులు గుర్తిస్తున్నారు. అసలు టిక్ టాక్‌తో జబ్బులు రావడమేంటి? మీరే చదవండి.
టిక్ టాక్.. ఈ పేరు మర్చిపోలేదు కదా! అయినా ఎలా మర్చిపోతారు. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడ చూసినా టిక్ టాక్ గోలే. చివరికి ఆసుపత్రుల్లో కూడా కొంతమంది నర్సులు టిక్ టాక్ వీడియోలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా టిక్ టాక్‌తో కొత్త ఇబ్బందులు వచ్చాయట. ఎందుకంటే వివిధ దేశాల్లో వైద్యులు టిక్ టాక్‌తో కొత్త ఇబ్బందులు తలెత్తినట్లు గుర్తించారు. కొంతమంది యువతుల్లో కొత్తగా 'టిక్స్' లక్షణాలు కనిపించినట్లు డాక్టర్ల పరిశీలనకు వచ్చింది.
టిక్స్ అంటే..?
టిక్స్ అంటే.. ఆందోళన, దుఃఖం, వణుకు, తిమ్మిరి వంటివి తరుచుగా కలగడం. కళ్లు బ్లింక్ అవడం వంటివి కూడా టిక్స్ లక్షణాలే. ముఖ్యంగా కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇలాంటి కేసులు వెలుగుచూసినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. తమకు టొరేట్ సిండ్రోమ్ ఉందని కొంతమంది చెప్పిన టిక్ టాక్ వీడియోలను బాధితులు ఎక్కువగా చూశారు.
టొరేట్ సిండ్రోమ్..
టొరేట్ సిండ్రోమ్.. అనేది ఒక జన్యు సంబంధమైన నాడీ వ్యవస్థ దెబ్బతినడమని వైద్యులు అంటున్నారు. దీని వల్ల టిక్స్, చెప్పిందే చెప్పడం, మనకు తెలియకుండానే శరీర అవయవాలు కదలడం, కొన్ని రకాల కూని రాగాలు రావడం ఇవన్నీ టొరేట్ సిండ్రోమ్ లక్షణాలు. ఎక్కువగా ఇది యువకుల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంటోంది. కానీ ఈసారి ఇది ఎక్కువగా అమ్మాయిల్లో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
వైద్యులు ఏమన్నారంటే?
జర్మనీ హానోవర్‌కు చెందిన డా.క్రిస్టేన్ ముల్లర్ ఈ కేసుల గురించి జరుసలేం పోస్ట్‌కు తెలిపారు. తన వద్దకు వచ్చిన కేసులను ప్రస్తావిస్తూ చాలా మంది యువతులు టిక్స్ తో బాధపడుతూ తన వద్దకు వచ్చినట్లు ఆమె తెలిపారు.
అయితే కరోనా విపత్తు కంటే ముందు ఇలాంటి కేసులు వచ్చినప్పటికీ ఆ తర్వాత వచ్చినవాటిలో ఈ లక్షణాలు ఎక్కువ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఒక నెలలో ఒకటి లేదా రెండు కేసులు వచ్చేవి.. అయితే కరోనా తర్వాత ఒక నెలలో 10 లేదా 20 కేసులు వస్తున్నట్లు తెలిపారు.
జెరుసలేమ్ పోస్ట్‌లో ఈ డిజార్డర్లను నయం చేయవచ్చని పేర్కొన్నారు వైద్యులు. సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుని కుటుంబంతో గడపాలని సూచిస్తున్నారు.
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!