Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక
డార్క్ చాక్లెట్లలో భారీ లోహాలు ఉన్నట్టు ఒక కొత్త అధ్యయనం తేల్చింది.
సాధారణ చాక్లెట్ తో పోలిస్తే, డార్క్ చాక్లెట్ చాలా ఆరోగ్యకరమైనది. ఈ విషయాన్ని పోషకాహార నిపుణులు కూడా చెబుతారు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎన్నో మానసకిపరమైన అధ్యయనాలు కూడా తేల్చాయి. పోషకాహార నిపుణుల నుండి డైటీషియన్ల వరకు, అనేక ఒత్తిడి సమస్యలను ఎదుర్కోవటానికి డార్క్ చాక్లెట్ తినాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ, డిసెంబర్ 2022లో జరిగిన కన్స్యూమర్ రిపోర్ట్స్ పరిశోధన ప్రకారం, డార్క్ చాక్లెట్లలో రెండు రకాల భారీ లోహాలు ఉన్నట్టు తేలింది. ఆ భారీ లోహాలను సీసం, కాడ్మియంలుగా గుర్తించారు. అందుకే డార్క్ చాక్లెట్లను తినడం అంత సురక్షితం కాదని చెబుతోంది ఈ పరిశోధన. ఇది వినడానికి షాక్ అయ్యే విషయమే. ఎందుకంటే వాటిని రోజూ తినే వారి సంఖ్య ఎంతో మంది.
అంతర్జాతీయ మీడియా నివేదికలు ప్రకారం, డిసెంబర్ 2022లో వినియోగదారుల నివేదికల పరిశోధనలో వివిధ బ్రాండ్‌లకు చెందిన 28 డార్క్ చాక్లెట్ బార్ లను పరిశీలించారు. వాటిలో 23 చాక్లెట్లలో సీసం, కాడ్మియంల ఉనికి ఉన్నట్టు తేలింది. అధ్యయనాలు మరియు నిపుణుల అభిప్రాయం ప్రకారం, డార్క్ చాక్లెట్ అనేది పోషకాల పవర్‌హౌస్. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలును అదుపులో ఉంచడం, రక్తపోటు పెరగకుండా నియంత్రణలో ఉంచడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
నివేదిక ప్రకారం, మిల్క్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ చాలా ఉత్తమం. ఇది తినడం వల్ల పొట్ట త్వరగా నిండిన భావన వస్తుంది. సీసం, కాడ్మియం వంటివి భూమిలో లభించే లోహాలు. ఇవి నేల, నీటిలో కలిసిపోయి ఆహరంలోకి ప్రవేశిస్తాయి. చాక్లెట్లను తయారుచేసే కోకో బీన్స్ పెరుగుదల సమయంలో నేల ద్వారా వాటిలోకి ప్రవేశించి వాటిలో స్థిరపడతాయి. అలా చాక్లెట్లలో ఈ హెవీ మెటల్స్ చేరుతాయి. డార్క్ చాక్లెట్‌ను ఆస్వాదించడానికి ఉత్తమ మార్గం ఆర్గానిక్ కోకో పౌడర్‌ని తయారు చేయడం. అంటే ఎలాంటి రసాయనాలు వాడని సేంద్రియ భూమిలో, పద్ధతిలో కోకో బీన్స్ పండించి, చాక్లెట్లను తయారు చేసుకోవాలి. అలా చేయడం చాలా కష్టం. కాబట్టి మార్కెట్లో దొరికే చాక్లెట్లతోనే సర్దుకుపోతున్నారు అందరూ. డార్క్ చాక్లెట్ రోజుకో చిన్నముక్క తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. మెదడు పనితీరు మెరుగుపరచడంలో ముందుంటుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Also read: వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?
Also read: నా కూతురు ముందే నా భర్త నన్ను కొట్టాడు, నేను అలానే చేయాలనుకుంటున్నాను
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.