Cholesterol: ఈ ఆహారాలు కలిపి తీసుకున్నారంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది
అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య కొలెస్ట్రాల్. ఇది పెరగడం వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది. గుండె పోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
శరీరానికి కొంతవరకు కొవ్వు అవసరమే. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ వివిధ ఆరోగ్య సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హార్మోన్ ఉత్పత్తి వంటి శారీరక విధులకు అవసరం. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలలో అసమతుల్యత ఏర్పడితే మాత్రం ప్రమాదం. చెడు కొలెస్ట్రాల్ లేదా లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ అధిక స్థాయిలు గుండె పోటు, స్ట్రోక్ తో పాటు హృదయ సంబంధ వ్యాధుల అభివృద్ధికి దారితీయవచ్చు. అందుకే చెడు కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవాలి. దాన్ని తగ్గించుకునేందుకు ఈ ఆహారాలని కలిపి తీసుకుంటే చాలా మంచిది.
వెల్లుల్లి, ఉల్లిపాయ
వెల్లుల్లి,, ఉల్లిపాయలు వంటలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి రెండింటికీ కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలని కలిగి ఉంటుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇక ఉల్లిపాయలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది LDL కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ రెండూ కలిపితే రుచిగా ఉండటమే కాకుండా కూరలు, పులుసు, గ్రేవీలకు మంచి ఆకృతి ఇస్తుంది. ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
బాదం, పెరుగు
బాదం పప్పులు గుండెకి ఆరోగ్యకరమైన మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వు, ప్రోటీన్ ని అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగు తినడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు 4 శాతం వరకు తగ్గుతాయని ఒక అధ్యయనం వెల్లడించింది. ఇందులో ప్రొ బయోటిక్స్ ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. ఈ రెండు ఆహారాలు పోషకాలతో కూడినవి. అల్పాహారంగా తీసుకోవచ్చు. రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు.
గ్రీన్ టీ, నిమ్మకాయ
గ్రీన్ టీ ప్రపంచవ్యాప్తంగా వినియోగించబడే ప్రసిద్ధ పానీయం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయలో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలను కలిగి ఉండే ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రీఫ్రెష్ గా అనిపిస్తుంది. వేడిగా లేదా చల్లగా తీసుకోవచ్చు. నిమ్మకాయల్లో ఉండే ఫ్లేవ నాయిడ్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది.
పప్పులు, బ్రౌన్ రైస్
పప్పు భారతీయుల ప్లేట్ లో ప్రధానమైన ఆహారం. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఇక బ్రౌన్ రైస్ మధుమేహులకు చాలా మంచిది. పోషక విలువలు ఎక్కువ. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. బ్రౌన్ రైస్ మాత్రమే కాదు బ్లాక్ రైస్ కూడా కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు, ఫైటో కెమికల్స్, విటమిన్ ఇ, ప్రోటీన్లు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. మిగతా రైస్ తో పోలిస్తే బ్లాక్ రైస్ వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.