Foods For Skin: ఆరోగ్యకరమైన చర్మం కోసం ఈ ఐదు ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సిందే
చర్మ సంరక్షణ కోసం ప్రతిరోజూ తీసుకునే స్కిన్ కేర్ టిప్స్ మాత్రమే కాదు మంచి ఆహారం కూడా తీసుకోవాలి.
ఎండల్లో చర్మాన్ని రక్షించుకోవడం అంటే సవాలుతో కూడుకున్న విషయమే. అందుకు కారణం వేడి గాలులు, వాటి వల్ల ఏర్పడే ట్యాన్. చర్మాన్ని రక్షించుకోవడం కోసం తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇదే కాదు ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కావాలంటే తప్పనిసరిగా నిర్ధిష్టమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం అత్యవసరం. ఇంట్లో వండిన భోజనం తాజా ఉత్పత్తులు తీసుకోవాలి. చర్మాన్ని కాపాడుకోవడానికి పోషకాలు అవసరం. అందుకే ఆరోగ్యకరమైన చర్మం కోసం ఐదు ముఖ్యమైన ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి.
పుదీనా: మంచి సువాసన కలిగిన పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్ రోస్మరినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యంగా, హైడ్రేట్ గా ఉంచుతుంది. పుదీనా నీళ్ళు తాగితే అటు అందంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
కాకరకాయ: చేదు రుచి కలిగి ఉండే కాకరకాయ అంటే ఎక్కువ మంది ఇష్టం చూపించరు. కానీ ఇది అందాన్ని ఇవ్వడంలో చక్కగా సహాయపడుతుంది. ఇందులో నీటిలో కరిగే విటమిన్ సి, లిపోఫిలిక్ విటమిన్ ఇ, కెరొటీనాయిడ్స్ (కెరోటిన్, శాంతోఫిల్స్, జియాక్సంతిన్) వంటి అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి చర్మ కణాలని దెబ్బతినకుండా చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాకరకాయ రసం తాగితే డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.
జామున్ ఫ్రూట్: జామున్‌లోని ఎల్లాజిక్ యాసిడ్, క్వెర్సెటిన్‌లు ఉన్నాయి. ఇవి UV డ్యామేజ్‌కు వ్యతిరేకంగా చర్మ రక్షణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఎరుపు, దురద, మంటని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
ఉసిరి: ఉసిరి జుట్టుకి మాత్రమే కాదు చర్మ సంరక్షణకి మేలు చేస్తుంది. ఫైబ్రోబ్లాస్ట్ విస్తరణను పెంచుతుంది. UVB ప్రేరిత సైటోటాక్సిసిటీకి వ్యతిరేకంగా అత్యంత ముఖ్యమైన ఫోటో ప్రొటెక్టివ్ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. బలమైన చర్మ రక్షణ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది బలమైన యాంటీ హైలురోనిడేస్ చర్యను కలిగి ఉంది. హైలురోనిక్ యాసిడ్ వృద్ధాప్యం, ముడతలు ఏర్పడకుండా నిరోధించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బూడిద గుమ్మడికాయ: ఫైబర్ రిచ్ ఫుడ్ ఇది. దీన్నే వింటర్ మిలాన్స్ అని కూడా పిలుస్తారు. ఇందులోని విటమిన్ ఇ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది.
విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం చర్మానికి మేలు చేస్తుంది. అందుకోసమైన ఇటువంటి ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. లేదంటే చర్మం పేలవంగా, నిస్తేజంగా కనిపిస్తుంది. ఈ ఆహారాలు చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేసేందుకు అద్భుతమైన ఎంపికలు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!