Diabetes: డయాబెటిస్ రోగుల కోసమే ఈ తియ్యని పాయసం రెసిపీలు
డయాబెటిస్ రోగులు ఖీర్ వంటి తీపి పదార్థాలు తినేందుకు భయపడతారు.ఈ పాయసాలు వారి కోసమే ప్రత్యేకం.
డయాబెటిస్ రోగులు టేస్టీ పాయసాలకు దూరంగా ఉండాల్సిందేనా? జీవితాంతం నోరు కట్టేసుకోవాల్సిందేనా? అవసరం లేదు. ఇలా తీయడి పాయసాలు తయారుచేసుకుని తినవచ్చు. వీటిని తినడం వల్ల స్వీట్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. స్వీట్ క్రేవింగ్స్ కూడా తీరుతాయి. వీటిని తయారుచేయడం చాలా సులువు. పైగా ఇందులో చక్కెర, బెల్లం వంటివి వినియోగించము. కాబట్టి ఆరోగ్యం కూడా.
కావాల్సిన పదార్థాలు
పాలు - రెండు కప్పులు
కుంకుమ పువ్వు - అయిదు రేకులు
ఆర్టిఫిషియల్ చక్కెర గుళికలు - మూడు టీస్పూన్లు
బియ్యం - పావు కప్పు
పిస్తాలు - నాలుగు
యాలకుల పొడి - అర స్పూను
తయారీ ఇలా
1. పాలు ముందుగా మరిగించి పక్కన పెట్టుకోవాలి.
2. బియ్యాన్ని ముందుగానే మూడు గంటల పాలూ నానబెట్టాలి. వాటిని నీళ్లు వడకట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
3. చిన్న గిన్నెలో పాలు వేసి, కుంకుమ పూలను నానబెట్టాలి.
4. పిస్తా పప్పును తరగి పక్కన పెట్టుకోవాలి.
5. మరిగించిన పాలను గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి.
6. చిన్న మంటపై ఉడికించాలి. అందులో బియ్యం పేస్టును వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి.
7. అందులో పచ్చి యాలకుల పొడి కూడా వేసి కలపాలి.
8. ఆర్టిఫిషియల్ చక్కెర గుళికలను మెత్తటి పేస్టులా చేసి వాటిని వేసి కలపాలి. చిక్కని పాయసంలా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
9. పిస్తా పప్పును సన్నగా తరిగి పైన చల్లుకోవాలి. టేస్టీ పాయసం రెడీ అయినట్టే.
..........................
క్యారెట్ పాయసం
కావాల్సిన పదార్థాలు
ఓట్స్ - ఒక స్పూను
క్యారెట్ తురుము - పావు కప్పు
నారింజ తొక్క తురుము - ఒక స్పూను
తేనె - ఒక స్పూను
వెన్న తీయని పాలు - పావు లీటరు
యాలకులు - ఒకటి
బాదం పప్పులు - అయిదు
తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి ఓట్స్ వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఒక గిన్నెలో పాలు వేసి స్టవ్ మీద మీడియం మంట మీద ఉంచాలి.
3. మరుగుతున్న పాలలో తురిమిన క్యారెట్ వేసి బాగా కలపాలి. దాదాపు పది నిమిషాలు ఉడకనివ్వాలి.
4. అందులో ఓట్స్ కూడా వేసి బాగా కలపాలి.
5. పాయసం చిక్కబడే వరకు స్టవ్ మీద ఉంచాలి.
6. పచ్చియాలకుల పొడిని వేసి కలపాలి.
7. అందులో నారింజ తొక్కల పొడి, తురిమిన బాదం పప్పులు వేసి కలపాలి.
8. రెండు నిమిషాలు అలా ఉంచి స్టవ్ కట్టేయాలి. చల్లారకా తేనె కలుపుకోవాలి. టేస్టీ క్యారెట్ ఖీర్ తినేందుకు సిద్ధమైపోతుంది.
9. వేడి మీద ఉన్నప్పుడు తేనె వేయకూడదు. అలా వేస్తే తేనెలోని సుగుణాలు నశిస్తాయి. ఒక స్పూను తేనె తినడం డయాబెటిక్ రోగులకు ప్రమాదమేమీ లేదు.
Also read: ఆయుర్వేదం ప్రకారం మిగిలిపోయిన ఆహారాన్ని ఎన్ని గంటల్లోపు తినాలో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.