Heart Attack: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? గుండె ప్రమాదంలో పడినట్లే
ఉన్నట్టుండి మాట్లాడుతూనే కిందపడిపోతారు. ఏమైందా అని అనుకుంటే గుండెపోటుతో చనిపోయారని అంటారు. గుండె పోటు సంకేతాలను ముందుగానే పసిగడితే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
ఒకప్పుడు యాబై సంవత్సరాలు దాటిన తర్వాత గుండె పోటు వచ్చేది. ఇప్పుడు మాత్రం వయసుతో సంబంధం లేకుండా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా గుండె పోటు వచ్చి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి దాకా మాట్లాడుతూ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా నిలబడిన చోటే కూలబడిపోతున్నారు. కారణం హార్ట్ ఎటాక్. గుండె నొప్పి వచ్చిందని వారికి అర్థం అయ్యేలోపే ప్రాణాలు పోతున్నాయి. యూకేలో ఏడాదికి సుమారు 64వేల మంది గుండె పోటుతో మృతి చెందుతున్నారు. మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే గుండె నొప్పి వచ్చే ముందు సంకేతాలు తెలియకపోవడం. ఎంతో మందికి గుండెపోటుకి సంబంధించిన అవగాహన లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
తీవ్ర అలసట, నిద్రా భంగం, అసాధారణంగా బరువు పెరుగుట, నిరాశ వంటి లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకుంటున్నారు. కానీ అవి చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. గుండె పోటు, గుండె వైఫల్యం, గుండె వాల్వ్ చెడిపోవడం, కార్డియాక్ అరెస్ట్, గుండెకి రక్తాన్ని తీసుకెళ్ళే ధమనుల్లో రక్తం గడ్డ కట్టుకుపోవడం లేదా మూసుకుపోవడం మొదలైనవి గుండెకి సంబంధించిన జబ్బులుగా పరిగణిస్తారు. అయితే అసలు అవి వచ్చే ముందు సంకేతాలు గుర్తించడంలో ఆలస్యం చెయ్యడం వల్లే ప్రాణాలు పోతున్నాయి.
గుండె పోటు సంకేతాలు
గుండెకి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. గుండెకి ఆక్సిజెన్ నిలిపివేసి ఇది కండరాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. సాధారణంగా ఛాతిలో నొప్పి వచ్చే ముందు గుండెల్లో అసౌకర్యంగా అనిపిస్తుంది. దవడం భుజం, చెయ్యి పైభాగానికి ముందుగా నొప్పి వస్తుంది. తర్వాత గుండెకి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అతిగా చెమటలు పట్టడం, ఉన్నట్టుండి అలసట రావడం, వికారం, వాంతులు, తలనొప్పి వంటివి వస్తాయి.
గుండె వైఫల్యం
శరీరానికి సరిగా రక్తాన్ని ప్రసరణ జరగనప్పుడు గుండె ఆగిపోతుంది. సాధారణంగా గుండె బలహీనంగా ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి. గుండె వైఫల్యాన్ని గుర్తించే సంకేతం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడమే. అలసట, నిద్రలేమి, ఛాతిలో అసౌకర్యంగా ఉండటం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు ఎక్కువగా మహిళల్లో కలుగుతాయి. గుండెల్లో దడ, శరీరంలోని అన్ని ప్రాంతాల్లో నొప్పి రావడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చెయ్యకూడదు.
పీఏడీ
పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి(పీఏడీ) వల్ల ధమనుల్లో రక్తప్రసరణలో మార్పులు వస్తాయి. ఈ వ్యాధితో బాధపడే వాళ్ళలో చాలా వరకు పెద్ద లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ కాళ్ళు, పాదాల్లో నొప్పి, అసౌకర్యంగా అనిపిస్తుంది. వృద్ధుల్లో పీఏడీ ఎక్కువగా కనిపిస్తుంది. వారిలో డిప్రెషన్ కూడా ఒక సంకేతంగా కనిపిస్తుంది.
మారుతున్నా జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. తీవ్రమైన పని ఒత్తిడి, సరైన సమయానికి తినకుండా ఉండటం, సమతులాహారాన్ని తీసుకోకుండా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, నిద్రలేమి వంటి వాటి వల్ల గుండె సమస్యలు వస్తున్నాయి. అతిగా వ్యాయామం చెయ్యడం కూడా గుండెకి ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అందుకే గుండెని పదిలంగా ఉంచుకోవాలంటే మనల్ని మనం వీలైనంత వరకు మార్చుకోవాలి. అప్పుడే క్షేమంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
Also Read: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!
Also Read: ఓ మై గాడ్, కోవిడ్ సోకినవారికి మూర్చల ముప్పు - మాస్క్ పెట్టుకోపోతే కష్టమే!