Palli Chikki: రోజుకో చిన్నముక్క పల్లీ చిక్కీ తింటే మహిళలు, పిల్లల్లో ఆ సమస్య దూరం
పల్లీ పట్టి, పల్లి చెక్క, పల్లి చిక్కి... ఎలా పిలిచినా తినుబండారం అదే.
పల్లీలు, బెల్లం కలిపి చేసే వంటకం పల్లి పట్టి. అమ్మమ్మల కాలం నుంచి ఇది మన తినుబండారాల జాబితాలో ఉంది. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని తినేవారు చాలా తగ్గిపోయారు. నిజానికి రోజూ చిన్న ముక్క పల్లి పట్టి తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు మరీ మంచిది.
ఆ సమస్యకు చెక్
రక్త హీనత సమస్య మహిళలు, పిల్లల్లోనే కనిపిస్తుంది. త్వరగా నీరసంగా మారడానికి అదే కారణం. ఆ ఆరోగ్య సమస్య నుంచి త్వరగా తేరుకోవాలంటే రోజుకో అరముక్క పల్లీ పట్టి తింటే చాలా మేలు. ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య తీరిపోతుంది. అంతేకాదు దీన్ని తినడం వల్ల శక్తి లభిస్తుంది. శక్తిహీనంగా, నీరసంగా అనిపించదు. శరీరం చురుకుగా మారుతుంది.
పిల్లలకు...
పల్లి చిక్కి తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. చదువులో చురుగ్గా రాణిస్తారు. పల్లీ పట్టీల్లో నియాసిన్, థయామిన్, ఫాస్పరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే పాలిచ్చే తల్లలు వీటిని తింటే పిల్లలకు బలం చేకూరుతుంది. అలాగే గర్భిణీలు కూడా కచ్చితంగా తినాల్సిన వాటిల్లో ఇవి కూడా ఒకటి.
చర్మ సౌందర్యానికి...
పల్లీ పట్టిలోని పోషకాలు చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. విటమిన్ ఇందులో లభిస్తుంది. జింక్ కూడా ఉంటుంది. కాబట్టి చర్మం అందంగా మారుతుంది.
గుండెకు...
పల్లీ పట్టీలో ఉండే విటమిన్ ఇ వల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా బయటికి పంపుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి వైరస్ లు శరీరంపై దాడిచేయకుండా అడ్డుకుంటుంది. పల్లీ పట్టీలో ప్రధానంగా వాడే బెల్లంలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఇది రక్తాన్నిశుధ్ది చేస్తుంది. గ్యాస్ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మలబధ్దాకాన్ని నిరోధిస్తుంది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే కచ్చితంగా బెల్లం ముక్క తినమని చెబుతారు పోషకాహార నిపుణులు.
మరో ప్రధాన పదార్థం వేరుశెనగ గింజలు కూడా ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ప్రొటీన్, మంచి కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. అందుకే బయటికి వెళ్లేటప్పుడు బ్యాగులో ఓ పల్లీ చిక్కి పెట్టుకుంటే త్వరగా ఆకలేయదు. బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. వేరుశెనగలో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలను అడ్డుకునే గుణం ఉంది.
Also read: ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మొటిమలు రావు, ఈ సమస్య ఎంతమందిని వేధిస్తోందో తెలుసా?
Also read: కరోనా టీకా భుజానికే ఎందుకు వేస్తారు? నరాలకు కాకుండా కండరాలకే సూది ఎందుకు గుచ్చుతారు?