(Source: ECI/ABP News/ABP Majha)
Health Benefits Of Wedding: పెళ్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట, ఎలాగో తెలుసా?
పెళ్లిల్ల సీజన్ వచ్చేస్తోంది మరి. మీరు కూడా ఒక ఇంటివారు అవ్వాలని అనుకుంటున్నారా? వేరే ఆలోచన వద్దు. హాయిగా పెళ్లి చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమస్తు!
పెళ్లి చేసుకుంటున్నా బ్రో.. అనగానే ఇప్పుడు అందరూ చెప్పే సలహా. ఎందుకు బ్రో కోరి మరీ కష్టాలో కొని తెచ్చుకుంటున్నావ్ అని. ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడు రీల్స్, షార్ట్స్‌లో వస్తున్న జోక్స్ కూడా పెళ్లి చుట్టూనే తిరుగుతుంటాయి. భార్యభర్తల పంచులు.. గొడవలు.. వామ్మో చూస్తే బుర్రపాడైపోద్ది. అందుకే, చాలామంది తమ పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. అయితే, పరిశోధనలు మాత్రం.. పెళ్లి మంచిదేనని అంటున్నారు. పెళ్లి చేసుకుని హాయిగా.. ఆరోగ్యంగా జీవించండి సూచిస్తున్నారు. అయినా పెళ్లితో ఆరోగ్యం ఏమిటీ.. పిచ్చి కాకపోతేను అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవల్సిందే.
"పెళ్ళంటే నూరేళ్ళ పంట" అనే నానుడిని, చాలామంది నూరేళ్ళ మంటగా భావిస్తారు. కానీ ఓ కొత్త అధ్యయనం మాత్రం, "పెళ్ళి ఆరోగ్యానికి మేలు" అని చెప్తోంది. వినటానికి కాస్త విచిత్రంగా అనిపించినా, ఈ పరిశోధన మాత్రం పెళ్ళికాని వారితో పోలిస్తే, పెళ్ళి అయిన వారు ఆరోగ్యంగా ఉంటున్నట్టు కనిపెట్టింది. పెళ్ళి అయిన వారి జీవన పరిమాణం ఎక్కువగా ఉన్నట్టు, అలాగే వారికి గుండె జబ్బులు తక్కువగా వస్తున్నట్టు ఈ అధ్యయనం చెప్పింది. పెళ్ళి అయిన వారికి మానసిక సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువేనట! వీరికి కాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉండి, వచ్చాక బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందట. వీరు చాలామటుకు పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా తట్టుకొని, బయటపడగలరని ఈ అధ్యయనం అంటోంది.
అలాగని ఈ ఆరోగ్య సమస్యలన్నింటికీ పెళ్ళి పరిష్కారం కాదు. భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన బంధం లేకపోతే, మంచి మిత్రులు, కుంటుంబం, శ్రేయోభిలాషులు ఉండి, పెళ్ళికాకుండా ఉన్నవారికంటే ఎక్కువ అనారోగ్యానికి గురి కావొచ్చట. ఈ లాభాలు పెళ్ళయిన ఆడవారికి కంటే పెళ్ళి అయిన మగవారికి ఎక్కువగా ఉన్నట్టు ఈ పరిశోధన గుర్తించింది.
ఇంగ్లండ్‌లో 25,000 మంది మీద జరిపిన ఈ పరిశోధనలో, పెళ్ళి అయినవారిలో గుండెపోటు వస్తే, వారు కోలుకొని మిగిలిన వారికంటే రెండు రోజుల ముందు హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నట్టు ఈ పరిశోధనలో తేల్చారు. కాకపోతే దీని మీద ఇంకా పూర్తిస్థాయిలో పరిశోధన ఇంకా జరగాల్సి ఉంది. ఈ పరిశోధన ఫలితాల తర్వాత, ఆరోగ్యానికి, పెళ్ళికి ఏం సంబంధం ఉందని కొందరు పరిశోధకులు మరో అధ్యయనాన్ని మొదలుపెట్టారు. అందులో వారు తెలుసుకున్న విషయాలేమిటంటే:
⦿ ఆరోగ్యకరమైన వివాహబంధంలో ఉన్నవారికి, పెళ్ళి కానివారి కంటే రోగనిరోధకశక్తి అధికంగా ఉంటుంది. వారిలో ఒత్తిడి తక్కువగా ఉండి, రోగనిరోధకశక్తి తగ్గకుండా ఉండే అవకాశం ఉంది.
⦿ ఒంటరిగా ఉండే వారికంటే పెళ్ళి అయినవారి ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా మార్చుకుంటున్నారు. సమయానికి తింటున్నారు. అలాగే, క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ లకు వెళ్ళటం కూడా ఒక కారణం.
⦿ పెళ్ళి అయినవారు కొందరు, పెళ్ళి కాకముందు కూడా ఆరోగ్యంగానే ఉండటం ఇంకో కారణం.
హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన ఈ పరిశోధనా ఫలితాలను చాలా వాదనలు ఇంకా అంగీకరించలేదు. అయినప్పటికీ, ఈ ప్రశ్నల మీద అధ్యయనం ఇంకా జరుగుతోంది. ఈ అధ్యయనం వల్ల ఉపయోగం ఏమిటనే వాదనలూ వినిపించాయి. ఉదాహరణకు, పెళ్ళి కానివారికి వచ్చే గుండెపోటుకు తీవ్రత ఎక్కువన్నారు కనుక వారిని ప్రత్యేకంగా వైద్యం అందిస్తారా?
"పెళ్ళంటే నూరేళ్ళ మంట" అని నవ్వులాటకే మనం అనుకున్నా, ఈ పరిశోధన ఫలితాలు ఆ నానుడిని మళ్ళీ ‘పంట’గా మారిస్తే మంచిదే కదా!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.