Corona Virus: వ్యాపిస్తున్న BA.4 వేరియంట్, ఈ రెండు లక్షణాలను సీరియస్‌గా తీసుకోవాల్సిందే
కరోనా వైరస్ కొత్త వేరియంట్లు తమ ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాయి.
ప్రపంచాన్ని కమ్మేసిన మహమ్మారి కరోనా వైరస్. ఇలాంటి ఒక వైరస్ దాడి చేస్తుందని, కొన్ని నెలల పాటూ ప్రపంచాన్నే స్థంభించేలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కరోనా కొత్త వేరియంట్లను సృష్టిస్తూ ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉంది. మొన్నటి వరకు దేశాలను కంగారు పెట్టిన ఒమిక్రాన్ వైరస్ ముగిసిందనుకుంటే, ఇప్పుడు దాని సబ్ వేరియంట్లు రెచ్చిపోతున్నాయి. దక్షిణాఫ్రికాలో ఈ సబ్ వేరియంట్లు సోకిన కేసులు బయటపడుతున్నాయి. ఈ సబ్ వేరియంట్లు తొలిగా దక్షిణాఫ్రికా దేశంలోనే పుట్టాయన్న వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం ఒమిక్రాన్ వైరస్ కు చెందిన కొత్త సబ్ వేరియంట్లు BA.4, BA.5. ఇవి కొత్తగా బ్రిటన్ దేశంలో వెలుగు చూశాయి. ఇప్పటికీ 1300 కేసులు నమోదయ్యాయి. దీంతో వీటి వ్యాప్తి మొదలైపోయిందని అర్థమవుతోంది.
ఆందోళన కలిగించేవే...
కొత్త కోవిడ్ వేరియంట్ల ఆవిర్భావం ఆరోగ్యనిపుణులకు ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ 2021లో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. అప్పట్నించి మ్యుటేషన్ చెందుతూ కొత్త వేరియంట్లను పుట్టిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా మ్యుటేషన్ చెందిన BA.4, BA.5 కేసులు యూకేలో కూడా వెలుగు చూడడంతో అక్కడి ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ సబ్ వేరియంట్లు సోకిన వారిలో తీవ్ర స్థాయిలో అనారోగ్య లక్షణాలు లేకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం. BA.4 వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు అక్కడి ఆరోగ్య నిపుణులు.
ఈ రెండు లక్షణాలు కనిపిస్తే అదే..
బ్రిటన్ కు చెందిన వైద్యులు, ఆరోగ్య శాస్త్రవేత్తలు అక్కడ BA.4 సబ్ వేరియంట్ సోకిన వ్యక్తుల లక్షణాలను నిశితంగా పరిశీలించారు. వారిలో కామన్ గా రెండు లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ రెండు లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వారు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
1. రుచి, వాసన కోల్పోవడం
2. చెవుల్లో రింగ్ అవుతున్న శబ్ధాలు వినిపించడం, ఈ సమస్యను టిన్నిటస్ అంటారు.
వీరి పరిశీలనతో మరొక కొత్త విషయం కూడా తెలిసింది. అందులో BA.4 సోకిన వారిలో ప్రతి అయిదుగురిలో ఒకరికి కోవిడ్ కారణంగా చెవి సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. ఒక సర్వే ప్రకారం 14,500 మంది కోవిడ్ సోకిన వ్యక్తుల్లో 5000 మందిలో చెవిలో రింగింగ్ అవుతున్న శబ్ధాలు వినిపించినట్టు గుర్తించారు. ఈ సమస్య కోవిడ్ తగ్గిపోయినా కూడా కొన్ని వారాల నుంచి నెలల వరకు కొనసాగుతున్నట్టు చెప్పారు బ్రిటన్ ఆరోగ్య నిపుణులు.
చెవుల్లో రింగ్ అవుతున్నట్టే కాదు, బజ్ శబ్ధం, సన్నగా కూనిరాగాలు తీస్తున్నట్టు, హిస్ అనే శబ్ధాలు, ఏదైనా సంగీతం, లేదా పాట పాడుతున్నట్టు వినిపించడం ఇవన్నీ టిన్నిటస్ అనే చెవి సమస్య కిందకే వస్తాయి.