Stress: ఒత్తిడి వల్ల శరీరమే కాదు, నోరూ చెడిపోతుంది జాగ్రత్త!
ఒత్తిడికి నోటి శుభ్రతకు సంబంధం ఏముందా అని ఆలోచిస్తున్నారా? కానీ ఉంది ఒత్తిడి అధికమైతే నోరు దుర్వాసన వస్తుంది.
ఒత్తిడి అనేక రోగాలను తెచ్చిపెడుతుంది. ఇది శారీరక ఆరోగ్యంపైనే కాకుండా దంత పరిశుభ్రత మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. మానసిక ఒత్తిడి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఒక పరిశోధన సూచిస్తోంది. ఒక వ్యక్తి ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఇది రక్తప్రవాహంలో గ్లూకోజ్ ని పెంచుతుంది. ఈ హార్మోన్ కారణంగా అనారోగ్యాలు ఎక్కువ అవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్వీయ సంరక్షణ లేకపోవడం
ఒత్తిడిలో ఉన్నప్పుడు స్వీయ సంరక్షణ సవాలుగా మారుతుంది. కార్బోహైడ్రేట్లు, చక్కెర ఉన్నటువంటి పదార్థాల మీదకు మనసు వెళ్ళిపోతుంది. అవి తినడం వల్ల దంతాల మీద ఫలకం ఏర్పడుతుంది. క్షీణతకు దారితీస్తాయి. పిరియాంటైటిస్ వంటి చిగుళ్ళ సమస్యల్ని తీసుకొస్తుంది.
నోరు తడి ఆరిపోవడం
ఒత్తిడి వల్ల నోరు పొడిబారిపోతుంది. లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. లేదా జిరోస్టోమియాకు దారితీస్తుంది. లాలాజలం చాలా ముఖ్యమైనది, ఇది ఆహార కణాలను తొలగించడంలో బఫర్ గా పనిచేస్తుంది. దంతాల పునరుద్ధరణకు సహాయపడే ఎంజైమ్ లను కలిగి ఉంటుంది. ఒక వేళ ఇప్పటికే పుచ్చు పళ్ళు ఉంటే అవి మరింత పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఆల్కహాల్, పొగాకు అధికంగా తీసుకోవడం వల్ల నోరు పొడిబారిపోయి చిగుళ్ళ వ్యాధి సమస్యలు వస్తాయి.
పళ్ళు కొరకడం
అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు చాలా మంది పళ్ళు గట్టిగా బిగించి కరకరామని కొరికేస్తూ ఉంటారు. ఇది కండరాలను సక్రియం చేస్తుంది. దవడ, చెవులు చుట్టూ ఒత్తిడి, నొప్పి అధికంగా ఉంటుంది. దీన్ని బ్రక్సిజం అని కూడా పిలుస్తారు. దవడ నొప్పుల కారణంగా నోరు తెరవడం, మూసివేయడం కష్టంగా అనిపిస్తుంది.
పళ్ళు కొరకడం వల్ల దంతాలు సున్నితంగా మారిపోయితాయి. కార్టిసాల్ స్థాయిల పెరుగుదలకు ప్రోటీన్‌ను ప్రేరేపిస్తుంది. ఇది వాపుకు కారణమవుతుంది. చిగురువాపు, పిరియాంటైటిస్ కు దారితీస్తుంది.
నోటి అల్సర్
ఒత్తిడి వల్ల నోటి అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ఆహారం తీసుకోవడం కష్టంగా మారుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మందులు వేసుకుంటూ చికిత్స తీసుకోవాలి.
ఒత్తిడికి గురైనప్పుడు దంతాలు కాపాడుకోవడం ఎలా?
యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. దంతాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీరు టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ (TMJ)తో బాధపడుతుంటే వైద్యులు మీకు నైట్ గార్డు సూచిస్తారు. పళ్ల మీద ఉండే పల్చని పొరలాంటిది ఇది. పళ్ల సెట్ పెట్టుకున్నట్టే వైట్ కలర్ తొడుగుని పళ్లకి వేసుకోవాలి. దంతాలు ఎగుడుదిగుడుగా ఉంటే వాటిని సరిచేయించుకోవాలి. అలా ఉంటే ఒత్తిడిని తగ్గించగలవు. నోటిని శుభ్రంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, నోరు పుక్కిలించడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఆరునెలలకి ఒకసారి దంత వైద్యులను కలిసి చెక్ చేయించుకోవడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీ మూత్రం రంగును బట్టి రోగాన్ని చెప్పేయొచ్చు - ఈ రంగులోకి మారితే జాగ్రత్త!