Sneezing: తుమ్మి తుమ్మి అలిసిపోయారా? ఇలా చేశారంటే చిటికెలో తుమ్ములు ఆగిపోతాయ్
తుమ్ములు ఎక్కువగా వస్తున్నాయా ఇలా చేశారంటే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
మీకు ఎప్పుడైనా వచ్చే వచ్చే తుమ్ము ఆగిపోయిందా! అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మన అందరికి బాగా తెలుసు. అబ్బా.. ఆ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని అనుకుంటారు. తుమ్ము ముక్కులోనే ఆగిపోవడం అది మళ్ళీ రాకపోవడం వల్ల తెగ ఇబ్బంది పడిపోతారు. సాధారణంగా తుమ్ములు ఎందుకు వస్తాయంటారు? జలుబు చేసినప్పుడో లేదంటే గాల్లోని దుమ్ము నాసికలోకి వెళ్ళినప్పుడు, ముక్కులోకి ఘాటు వెళ్ళినప్పుడు, మిరియాలు లేదా మిరపకాయల కోరు ముక్కు లోకి ప్రవేశించినపుడు తుమ్ములు వస్తాయి. సైనస్ ఇబ్బంది ఉంటే ఇక చెప్పనవసరం లేదు ఒకటే తుమ్ములు.
తుమ్మి తుమ్మి ముక్కు ఊడిపోతుందేమో అని అనిపిస్తుంది. అత్యంత సాధారణ అలర్జీలో ఇది కూడా ఒకటి. ముక్కు కారటం, దురద, తలనొప్పి, విపరీతమైన అలసట వస్తుంది. ఎక్కువగా తుమ్మడం వల్ల తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. తలలో నరాలు కూడా నొప్పి వచ్చేస్తాయి. వాటి నుంచి తప్పించుకోవాలంటే ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా ఈ చిట్కాలు పాటిస్తే తుమ్ముల నుంచి చిటికెలో ఉపశమనం లభిస్తుంది.
పసుపు పాలు
పసుపు ఆరోగ్యానికి అన్నీ విధాలుగా మేలే చేస్తుంది. జలుబు చేసినప్పుడు పసుపు పాలు తాగడం వల్ల చాలా రిలీఫ్ గా ఉంటుంది. పసుపుకి వ్యాధులని నయం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పసుపులో కర్కుమిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, గాయాలు నయం చేసేందుకు ఇవి సహకరిస్తాయి. పసుపు పాలు తాగడం వల్ల శరీరంలో వెచ్చదనం వస్తుంది. దీని వల్ల తుమ్ముల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లం రసం, తేనె
మసాలా కూరల్లో అల్లం వేయనిదే వాటికి రుచి రాదు. జలుబు, కడుపు ఉబ్బరం నుంచి అల్లం ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. తేనెతో కలిపినప్పుడు శ్వాసకోశ రుగ్మతలు ప్రమాదాన్ని నివారించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. లెమన్ టీలో ఒక స్పూన్ తేనె వేసుకుని తాగొచ్చు. ఇదే కాదు అల్లం రసంతో కూడా తేనె కలిపి తీసుకోవచ్చు, కానీ ఒకసారి ఒక టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా కూడా తుమ్ముల సమస్య నుంచి బయటపడొచ్చు.
సిట్రస్ పండ్లు
రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో సిట్రస్ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. స్ట్రాబెర్రీలు, నిమ్మకాయలు, ఇండియన్ గూస్ బెర్రీ, ఉసిరికాయ, నారింజ వంటి పండ్లు తీసుకోవచ్చు. ఇవి తుమ్ములు, ఇతర శ్వాసకోశ రుగ్మతల ప్రమాదాన్ని దూరం చేస్తాయి.
ఆవిరి పట్టడం
నాసికా మార్గాన్ని క్లియర్ చెయ్యడానికి, ఇతర శ్వాసకోశ రుగ్మతలు వదిలించుకోవడానికి ఆవిరి పట్టడం ఉత్తమమైన మార్గం. మూసుకుపోయిన ముక్కు, చలి నుంచి ఉపశమనం పొందేలా చేసేందుకు సహాయపడుతుంది. బాగా మరుగుతున్న నీటిలో ఆవిరి పట్టే క్యాప్సూల్స్ వేసి ఆ వాసన బాగా పీల్చాలి. ఆ ఘాటు పక్కలకి పోకుండా మన మీద టవల్ లేదా దుప్పటితో ముసుగు వేసుకుని పిలిస్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే
Also Read: వయాగ్రా అందుకే కాదు - ఈ భయానక వ్యాధిని సైతం నయం చేస్తుందట!