Dal Recipe: మైక్రోవేవ్ లో నోరూరించే రుచికరమైన పప్పుని ఇలా వండేయండి!
బ్యాచిలర్స్ అమ్మాయిలూ, అబ్బాయిలూ మైక్రోవేవ్ లో ఇలా సింపుల్ గా పప్పు చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది.
లంచ్ టైమ్ అవుతుందని హడావుడిగా పప్పు వండటానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నప్పుడు సడెన్ గా గ్యాస్ అయిపోతే ఏంటి పరిస్థితి? బయట కూరలు తెచ్చుకుంటారు. తినలేక తినలేక తింటూ మమ అనిపించేస్తారు. అలా ఇబ్బంది లేకుండా సింపుల్ గా మైక్రోవేవ్ కనుక మీ ఇంట్లో ఉంటే అందులో పప్పు వండుకోవడం చాలా సింపుల్. అదేంటి ఆహార పదార్థాలు వేడి చేసుకోవడానికె కదా మైక్రోవేవ్ ఉందని అనుకుంటున్నట్టయితే పొరపడినట్టే. చాలా సింపుల్ గా మైక్రోవేవ్ లో పప్పు వండుకోవచ్చు. అది కూడా కేవలం 30నిమిషాల కంటే తక్కువ సమయంలోనే రుచికరమైన పప్పు వండుకోవచ్చు. గ్యాస్ అందుబాటులో లేనివారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
మైక్రోవేవ్ లో పప్పుని ఎలా ఉడికించాలి?
ఎర్రకంది పప్పు- అరకప్పు
మామూలు కందిపప్పు- అరకప్పు
పసుపు- ½ టీ స్పూన్
రెండు పప్పులను బాగా కడుక్కోవాలి. వాటిని పెద్ద మైక్రోవేవ్ సేఫ్ బౌల్ లో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ½ టీస్పూన్ పసుపు వేసి రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఆ మైక్రోవేవ్ లో గిన్నె పెట్టి టైమర్ ని 20 నిమిషాలకి సెట్ చేసుకోవాలి. టైమ్ అయిపోయిన తర్వాత గిన్నె బయటకి తీసి చూసే పప్పు ఉడికి చిక్కగా ఉంటుంది. గరిటె లేదా పప్పుగుత్తి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. అంతే సింపుల్ పప్పు రెడీ. ఇందులోనే తడ్కా పప్పు కూడా చేసుకోవచ్చు.
తడ్కా పప్పు తయారీ విధానం
పప్పు ఉడికించుకున్న తర్వాత అందులోకి తాలింపు కూడా మైక్రోవేవ్ లోనే చేసుకోవచ్చు. అందుకోసం మీరు మైక్రోవేవ్ బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, ఒక బె ఆకు, ఒక ఎండు మిరపకాయ, తరగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన టమోటా ఒకటి వేసుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ¼ టేబుల్ స్పూన్ కారం, ¼ టేబుల్ స్పూన్ గరం మసాలా జోడించుకోవాలి. ఈ మిక్స్ గిన్నె ని మైక్రోవేవ్ లో 4 నిమిషాల పాటు ఉంచాలి. అంతే పప్పులోకి తాలింపు కూడా రెడీ అయిపోయింది.
చివరిగా..
ముందుగా ఉడికించిన పప్పులో ఈ తాలింపు మిశ్రమం వేసి కలుపుకోవాలి. తర్వాత మరొక కప్పు నీటిని వేయాలి. ఆ గిన్నె మూత పెట్టి మళ్ళీ మైక్రోవేవ్ లో ఉంచాలి. సుమారు 3-4 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. అంతే రుచికరమైన వేడి వేడి పప్పు రెడీ అయిపోతుంది. వడ్డించే ముందు తరిగిన కొత్తిమీర ఆకులు వేసి అలంకరించుకోవాలి.
అన్నం కూడా మైక్రోవేవ్ లో ఇలా వండేసుకోవచ్చు
ఒక కప్పు కడిగిన బియ్యం తీసుకుని దాన్ని ఒక గిన్నెలో వేసి అందులో రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఆ గిన్నెని మైక్రోవేవ్ లో 15 నిమిషాల పాటు ఉంచాలి. అంతే అన్నం కూడా ఉడికిపోతుంది.
Also Read: కిచెన్లో పాన్ ఎటువైపు పెడుతున్నారు? అలా చేస్తే మీ ఇంటి సంపద పెరుగుతుందట