(Source: ECI/ABP News/ABP Majha)
Signs of kidney disease: ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి... వైద్యుడిని కలవండి
ఈ మధ్యన కిడ్నీ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ఆ వ్యాధుల లక్షణాలను మొదట్లోనే గుర్తిస్తే చికిత్స సులభతరం కావచ్చు.
ఆధునిక కాలంలో ఆరోగ్యం చేజారిపోతోంది. ముఖ్యమైన అవయవాలపై దీర్ఘకాలిక రోగాలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్న ప్రమాదకర వ్యాధుల్లో కిడ్నీ రోగాలు కూడా ఒకటి. ఇది హైబీపీ, డయాబెటిస్ ఉన్నవారిలో లేదా కుటుంబ చరిత్రలో ఎవరికైనా కిడ్నీ రోగాలుంటే వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. లేదా తక్కువ బరువుతో పుట్టిన వారిలో, ముసలితనం వల్ల, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఊబకాయంతో బాధపడే వారిలో ఈ వ్యాధులు కలగవచ్చు. వ్యాధి ముదిరిన తరువాత గుర్తించడం వల్ల చికిత్స కష్టమవ్వచ్చు. కొన్ని లక్షణాల ద్వారా కిడ్నీ వ్యాధులను గుర్తించవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.
1. కిడ్నీ వ్యాధులు ఉన్నవారిలో నిద్రలేమి ముఖ్యమైనది. మూత్రపిండాలు మలినాలను సరిగా ఫిల్టర్ చేయనప్పుడు, టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటికి పోకుండా, రక్తంలోనే ఉండిపోతాయి. దీని వల్ల నిద్ర ప్రభావితం అవుతుంది. కిడ్నీ సమస్యలున్న వారిలో సాధారణంగా కనిపించే లక్షణం ఇది.
2. చేతులపైనా, ముఖంపైనా దురదలు, దద్దుర్లు వంటివి కలుగుతాయి. చర్మం పొడిగా కూడా మారుతుంది. రక్తంలో ఖనిజాలు, పోషకాల సమతుల్యతను కాపాడేది కూడా మూత్రపిండాల పనితీరే. కనుక దీర్ఘకాలంగా దద్దుర్లు, దురదలు వేధిస్తుంటే ఓసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
3. కిడ్నీ వ్యాధుల వల్ల పెరిఆర్బిటల్ ఎడిమా కలుగుతుంది. దీని వల్ల కళ్ల చుట్టూ వాపు వస్తుంది. శరీరంలోని ప్రోటీన్ అధికంగా మూత్రం ద్వారా బయటికి పోయినప్పుడు ఇలా రెండు కళ్లకి వాపు వస్తుంది.
4. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు కండరాల వాపు, తిమ్మిరి కూడా కలుగుతుంది. శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత కారణంగా ఇలా తిమ్మిరి ఏర్పడవచ్చు. నరాలు దెబ్బతినడం, రక్తప్రసరణలో ఆటంకాలు కూడా కలగవచ్చు. బలహీనమైన మూత్రపిండాల కారణంగా ఇలా జరుగుతుంది. కనుక ఇలాంటి లక్షణాలను కూడా తేలికగా తీసుకోవద్దు.
5. కాళ్లల్లో, పాదాల్లో వాపులను కూడా లైట్ తీసుకోకండి. ఇది కూడా కిడ్నీ వ్యాధులకు ఓ సూచిక. అధికంగా ఉన్న ద్రవాలను కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటికి పంపడంలో ఫెయిలైనప్పుడు ఇలా కాళ్లు, పాదాలు, చేతుల్లో వాపు కనిపిస్తుంది. అలాంటప్పుడు ముందుగా ఉప్పు, ద్రవపదార్థాలు తీసుకోవడం తగ్గించి, వైద్యుడిని సంప్రదించాలి.
6. మూత్రాన్ని తయారుచేసేవి కిడ్నీలే. అవి సరిగా పనిచేయనప్పుడు మూత్రం రంగు మారుతుంది. అలాగే అధికంగా మూత్రానికి వెళ్లాల్సి రావొచ్చు. ముఖ్యంగా రాత్రిపూట పదేపదే మూత్రానికి వెళ్లాలనిపిస్తుంది. ఇది కూడా కిడ్నీ వ్యాధికి సంకేతం కావొచ్చు.
7. ఆకలి కూడా తగ్గిపోతుంది. ఏమీ తినాలనిపించదు. తద్వారా బరువు కూడా తగ్గిపోతున్నారు.
Also read: రోజుకో రెండు తమలపాకులు నమలండి... ఈ రోగాలు దరిచేరవు
Also read: వంటనూనె పసుపు రంగులో ఉందా? మంచిదో, కల్తీదో ఇలా తెలుసుకోండి
Also read: సోంపు నీళ్లతో బరువు తగ్గుతారా? నిజమేనా?