weight loss: సోంపు నీళ్లతో బరువు తగ్గుతారా? నిజమేనా?
బరువు పెరగడం సులువే... కానీ తగ్గడం మాత్రం చాలా కష్టం. సోంపునీళ్లతో బరువు తగ్గచ్చని కొందరి నమ్మకం.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ బరువు తగ్గడం అంత సులువు కాదు. అలాగని ఆహారం బాగా తగ్గిస్తే నీరసంతో పాటూ ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవాల్సిందే. అయితే కొన్ని చిట్కాలు బరువు తగ్గే ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయి. అలాంటి చిట్కాల్లో సోంపు నీళ్లు కూడా ఒకటి.
మనకి సోంపు మౌత్ ఫ్రెషనర్ గానే పరిచయం. నిజానికి సోంపు మన ఆరోగ్యానికి, శరీరానికీ చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఆహారంలోని పోషకాలను శోషించుకునే శక్తిని పెంచుతుంది.
రోజూ ఉదయాన గ్లాసుడు సోంపు నీళ్లను తాగితే చాలా మంచిది. ఆ రోజంతా మీరు చిరుతిళ్ల జోలికి పోకుండా ఉంటారు. అంతేకాదు ఆకలి కూడా ఎక్కువగా వేయదు. దీని వల్ల బరువు తగ్గేందుకు వీలుంటుంది. రాత్రిపూట ఒక టేబుల్ స్పూను సోంపును గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఉదయాన ఆ నీళ్లను సేవించాలి.
ఈ నీళ్లు అనేక రకాలుగా మేలుచేస్తాయి.
1. జీర్ణక్రియ వేగాన్ని పెంచి, కొవ్వు చేరకుండా చూస్తుంది.
2. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మీకు పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఆహారం తినరు.
3. సోంపు సహజంగానే డిటాక్సిఫయర్ గా పనిచేస్తుంది. శరీరంలోని మలినాలను బయటికి పంపించేస్తుంది. భోజనం తరువాత దీన్ని తీసుకుంటే చాలా మంచిది.
4. ఇందులో జింక్, ఫాస్పరస్, సెలీనియం, మాంగనీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు దీని ద్వారా లభిస్తాయి. శరీరానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్ నుంచి ఇవి కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు కారణమవుతాయి. దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ.
5. మధుమేహం ఉన్న వ్యక్తులకు సోంపు గింజలు నమలడం వల్ల మేలు జరుగుతుంది. వీటిలో క్లోరో జెనిక్, లైమొనెన్, క్వెర్సెటిన్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి డయాబెటిస్ తగ్గేందుకు సహకరిస్తాయి.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక, సోంపుని రోజూ నమలడం లేదా సోంపు నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. బరువు తగ్గాలనుకునేవారు మాత్రం సోంపుని తినడం కంటే సోంపు నీళ్లు తాగడమే మంచి ప్రయోజనాలు ఇస్తుంది.
Also read: గుడ్లు తిన్నాక... వీటిని తినకండి, తింటే ఏమవుతుందంటే...
Also read: ఇవి తినడానికీ ఓ టైముంది... ఎప్పుడు తినకూడదంటే...
Also read: రోజుకు నాలుగైదు వేరు శెనగపలుకులు తినండి చాలు... ఆ జబ్బులకు దూరంగా ఉండొచ్చు