రోజ్ టీ ఎప్పుడైనా తాగారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు
టీ ని తెలుగులో తేనీరు అంటారు. ఎందుకంటే ఇది తేయాకులతో తయారవుతుంది కనుక. ఇదొక్కటే కాదు రకరకాల టీలు తయారు చేసుకుని తాగవచ్చు. ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అలాంటి మంచి టీలలో ఒకటి రోజ్ టీ.
తేయాకులతో చేసే తేనీరు ఒక్కటే టీ కాదు. రకరకాల హెర్బల్ టీలు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో ఒకటి రోజ్ టీ. అవును మీరు చదివింది కరక్టే. రోజ్ టీ, గులాబి రేకులతో తయారయ్యే టీ. నిజానికి ఈ టీ శతాబ్దాలుగా వినియోగంలో ఉన్నదే. కానీ ఈ మధ్య కాలంలో మరుగున పడిపోయింది.
రోజ్ టీని మనం హెర్బల్ టీ గా చెప్పుకోవచ్చు. రుచి కూడా చాలా రిఫ్రెషింగ్ గా బావుంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి దీనితో. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ప్రీరాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని పూడుస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు. శరీరంలో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చర్మ సౌందర్యాన్ని కూడా ఇనుమడింపజేస్తుంది. ఇప్పుడిప్పుడే వయసు ఛాయలు చర్మం మీద కనిపిస్తున్న నడివయసు వారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం మీద సన్నగా కనిపిస్తున్న ముడతల వంటివి మాయం అవుతాయి. రిఫ్రెషింగ్ గా ఉండి మంచి మంచి శక్తిని కూడా ఇస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా శరీర బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. జీవక్రియలన్నీంటిని ప్రభావితం చేస్తుంది కూడా. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కూడా దోహదం చేస్తుంది. డయాబెటిస్ ను కూడా అదుపులో ఉంచుతుందట.
చాలా ఈజీ
రోజ్ టీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. దీన్ని పొద్దున్నే వెచ్చని టీగా తీసుకోవచ్చు. లేదంటే తయారు చేసి చల్లార్చి ఐస్ ముక్కలతో చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిజ్ లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు స్మూదీల వంటి వాటిలో కూడా వాడుకోవచ్చు.
ఎలా చేసుకోవాలి?
గులాబి రేకులను నీడన ఆరబట్టి నిలువ చేసుకోవచ్చు. అలా ఎండిన గులాబి రేకులను రోజ్ టీ తయారికీ వినియోగించుకోవచ్చు. ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో అందులో ఆరబెట్టుకున్న గులాబిరేకులు ఒక గుప్పెడు వరకు వేసుకుని మూత పెట్టి ఉంచాలి. ఒక ఐదారు నిమిషాల్లో టీ రెడి అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత రుచి కావాలనుకునే వారు కాస్త నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకుని తాగెయ్యొచ్చు. శరీరంలో కొవ్వు నిలువలను తగ్గించే సహజమైన పానీయం ఇది. కానీ క్రమం తప్పకుండారోజూ తీసుకోవాలి. రోజుకు మూడు నాలుగు సార్లయినా తాగొచ్చు ఇది. రాత్రి నిద్రకు ముందు ఈ టీ తాగితే ఉదయాన్నే అసిడిటి సమస్య లేకుండా ఉండొచ్చు. ఉదయాన్నే ఒక కప్పు వేడి రోజ్ టీ తోపాటు ఒక అరగంట వ్యాయామం తో చాలా త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఇంత సులభంగా తయారుచేసుకోగలిగే రుచికరమైన టీ తాగి ఎన్నెన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కనుక ఇక నుంచి రోజ్ టీని మీ దిన చర్యలో భాగం చేసుకుంటే మంచిది.
Also read: ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని నీళ్లను తాగుతున్నారా? గుండెపై అది చూపే ప్రభావం ఎక్కువ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.