Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్
తాజా మాంసం తింటే మంచిదే కానీ ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ తింటే మాత్రం ఆరోగ్యం కాదు ప్రమాదకరమైన రోగాల బారిన పడతారు.
మాంసాహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జంతు కాలేయం తినమని ఎక్కువ మందివైద్యులు సిఫార్సు చేస్తూ ఉంటారు. కానీ ఎర్రటి లేదా ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఎక్కువ మంది దీన్ని తింటూ ఉంటారు. కానీ రెడ్ మీట్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంతృప్త కొవ్వులు ప్రత్యేకించి కొన్ని మాంసాల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా కరొనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం ముందుంటుంది.
జంతు మాంసకృతులు ముఖ్యంగా రెడ్ మీట్ ఎముకలకు ఆరోగ్యరకరమే కానీ దీన్ని ఎక్కువగా తింటే అవే ఎముకలు దెబ్బతింటాయి. ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రాసెస్ చేసిన మాంసం కంటే తాజాగా ఉండే మాంసాన్ని ఎంచుకోవాలని అంటారు. ఇదే ఆరోగ్యానికి మంచిది.
రెడ్ మీట్ తింటే వచ్చే అనార్థాలు
☀ అధిక ప్రోటీన్ ఆహారం జంతు మాంసంలోనే ఉంటుంది. ఇది కాల్షియం నష్టానికి దారి తీస్తుంది. ఎముకల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
☀ మాంసంలో అధిక మొత్తంలో ఫాస్పరస్ ఉంటుంది. దీని వల్ల కాల్షియం దెబ్బతింటుంది. ఫలితంగా ఎముకలు డీమినరలైజేషన్ కి కారణంఅవుతుంది.
☀ జంతు ప్రోటీన్ తీసుకోవడం వల్ల రక్తం ఆమ్లంగా మారుతుంది. ఎముకల నుండి కాల్షియంని తొలగిస్తుంది. దీని వల్ల ఎముకలు బలహీనపడిపోతాయి.
☀ రెడ్ మీట్ తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని పరిస్థితుల్లో మరణం కూడా సంభవించవచ్చు.
☀ కొన్ని పరిశీలన అధ్యయనాల ప్రకారం ఎర్ర మాంసం తింటే కొలోరెక్టల్, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చూపిస్తున్నాయి.
☀ ఇదే కాదు టైప్ 2 డయాబెటిస్ ముప్పుకూడా ఎక్కువే ఉంటుందని మరికొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ప్రాసెస్ చేసిన, ప్రాసెస్ చేయని రెడ్ మీట్ తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు ప్రమాద కారకంగా మారుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం సంతృప్త కొవ్వు రోజు మొత్తం మీద 6 శాతం కంటే తక్కువగా తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ప్రోటీన్స్ కోసం ఇవి తినండి
మాంసం ద్వారా పొందలేని ప్రోటీన్లను బీన్స్, కాయధాన్యాలు, కూరగాయలు, పోషకాలు నిండిన ధాన్యాలు తీసుకుని కూడా పొందవచ్చు. మొక్కల ఆధారిత ప్రోటీన్ల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శీతల పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసాలు, వేయించిన ఆహార పదార్థాలు, శుద్ధి చేసిన్ ధాన్యాల వినియోగం తగ్గిస్తే ఎముకలు బలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: పాలు తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుందా? అది ఎంతవరకు నిజం?