Acidity: పాలు తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుందా? అది ఎంతవరకు నిజం?
ఎసిడిటీ సమస్య వస్తే ఏది తినాలన్న భయం వేస్తుంది. కాస్త కారం, మసాలా తగిలినా కూడా పొట్టలో వేడి ఆవిర్లు, మంట, చికాకుగా అనిపిస్తుంది. ఎసిడిటీ సమస్య తగ్గించుకోవడానికి పాలు ఉత్తమం అంటారు నిజమేనా?
ఈరోజుల్లో చిన్న వయసు వాళ్ళు కూడా ఎసిడిటీ బారిన పడుతున్నారు. ఎక్కువ మందిని ప్రభావితం చేస్తున్న సాధారణ సమస్యగా ఇది మారిపోయింది. కాస్త మసాలా ఉన్న ఆహారం తీసుకుంటే చాలు ఎసిడిటీతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవనశైలిలో మార్పులు వంటి కారణాల వల్ల ఇది సంభవిస్తుంది. ఈ ఎసిడిటీ నుంచి రిలీఫ్ పొందేందుకు ఎక్కువ మంది పాలు తాగుతారు. గుండెల్లో మంటగా అనిపించినప్పుడు చల్లటి పాలు తాగితే రిలీఫ్ వస్తుందని చెప్తారు. అయితే నిజంగానే ఎసిడిటీ చికిత్సకు పాలు సహాయపడతాయా? అనే సందేహం వెలువడుతోంది. అందుకే మీకు ఈ సమాధానం..
పాలు ఎసిడిటీకి మంచిదేనా?
పాలు చాలా సంవత్సరాలుగా ఎసిడిటీకి సంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇందులోని ఆల్కలీన్ స్వభావం కడుపులోని అదనపు యాసిడ్స్ ని తటస్థం చేయడంలో సహాయపడతాయి. ఇవి మంట, యాసిడ్ రిఫ్లక్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. పాలలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అయితే పాలు ఎసిడిటీకి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి కానీ శాశ్వత పరిష్కారం కాదు.
పాలు తాగితే ఏమవుతుంది?
మరికొంతమంది వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఎసిడిటీతో బాధపడే వాళ్ళు పాలు తాగొద్దని చెప్తారు. కొన్ని సందర్భాలలో ఇవి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. పాలలో కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. ఆమ్లత్వ లక్షణాలని మరింత పెంచేస్తాయి. కొవ్వు ఎక్కువగా ఉండే పాలు తాగితే ఈ సమస్య తప్పకుండా ఎదురవుతుంది. లాక్టోస్ అసమతుల్యంగా ఉంటే పాలు తాగడం వల్ల ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. ఎసిడిటీ తగ్గించుకోవడం కోసం పాలు తాగితే వచ్చే మరొక సమస్య యాసిడ్ రీఫ్లక్స్. కడుపు నుంచి విడుదలైన ఆమ్లాలు అన్నవాహికలోకి తిరిగి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుంది. దీని వల్ల ఛాతిలో, గొంతులో మంటగా అనిపిస్తుంది. పాలు కడుపు ఆమ్లం ఉత్పత్తిని పెంచుతాయి.
గుండెల్లో మంటకి నివారణలు
ఎసిడిటీగా అనిపిస్తే పాలపై ఆధారపడే బదులు మీరు చేయాల్సిన మొదటి పని సరైన ఆహారం తీసుకోవడం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం. స్పైసీ, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలని నివారించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. ఇది యాసిడ్ ని బయటకి పంపించి ఉపశమనం కలిగిస్తుంది.
ఎసిడిటీ సమస్య నుంచి బయట పడేందుకు కొన్ని ఆహార పదార్థాలు కూడా సహాయపడతాయి. చామంతి పూల టీ, పండిన అరటి పండు తినడం, అల్లం, కాస్త తులసి ఆకులు నమిలినా గుండెల్లో మంట తగ్గించుకోవచ్చు. అజీర్తి సమస్యలను తగ్గించడంలో ఇవి ప్రభావవంతంగా పని చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: కుర్చీలకు అతుక్కుపోతున్నారా? జాగ్రత్త మీ ఆయుష్హు తగ్గిపోతుంది