Sitting Side Effects: కుర్చీలకు అతుక్కుపోతున్నారా? జాగ్రత్త మీ ఆయుష్హు తగ్గిపోతుంది
ఇప్పుడు అన్నీ గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే పనులే. సుమారు పది గంటల పాటు కూర్చుని ఉంటున్నారు. దాని వల్ల ఎన్నో సమస్యలు.
మనలో ఎక్కువ మంది ఆఫీసులో అనేక గంటలపాటు కూర్చొనే ఉంటారు. డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఉద్యోగం దగ్గర నుంచి వినోదం వరకు అది లేకపోతే పని జరగడం లేదు. డెస్క్ స్క్రీన్ కి ఎక్కువగా అతుక్కుపోయేలా చేస్తుంది. గంటల తరబడి ఒకే పొజిషన్ లో కూర్చుని ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం కూర్చుని చేసే ఉద్యోగాలు దాదాపు 83 శాతం పెరిగినట్టు నివేదించింది.
అధిక సమయం కూర్చుని స్క్రీన్ చూస్తూ ఉండటం వల్ల అనేక వ్యాధులు చుట్టుముట్టేస్తున్నాయి. ఇది రోజువారీ జీవనంలో సాధారణ భాగమే అయినప్పటికీ ఎక్కువ సేపు కుర్చీకి అతుక్కుపోవడం వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే అన్ని రోగాల్లోకెల్లా భయంకరమైనది కూర్చోవడమే. ఇదే సగం రోగాలకు కారణమవుతుంది.
జీవిత కాలాన్ని తగ్గిస్తుంది
కూర్చుంటే జీవిత కాలం ఎలా తగ్గిపోతుందా అని ఆలోచిస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
బరువు పెరుగుతారు
హెల్త్ లైన్ నివేదిక ప్రకారం రోజంతా కూర్చున్నప్పుడు లిపోప్రోటీన్ లైపేస్ వంటి అణువులు విడుదల కావు. ఇవి బరువు పెంచుతాయి. ఊబకాయానికి దారి తీస్తాయి.
రోజంతా అలసట
కూర్చుని ఉండటం వల్ల ఇంకా ఎక్కువగా అలసిపటారు. ఎక్కువ గంటలు కూర్చుని ఉండటం వల్ల కలిగే దుష్ప్రభావాల్లో ఇది ఒకటి. ఏడెనిమిది గంటల పాటు ఏకధాటిగా ఒకే భంగిమలో కూర్చుని ఆఫీసులో పని చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల అలసటగా ఉంటుంది.
భంగిమ సరిగా ఉండాలి
ఒకే విధంగా ఎవరు కూర్చోలేరు. కొన్ని సార్లు వంగి కూర్చోవడం, కొన్ని సార్లు నిటారుగా కూర్చుంటారు. దాని ప్రభావం వెన్నెముక, నడుము, మెడ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సరైన భంగిమలో కూర్చోవడం చాలా ముఖ్యం. వెన్నెముకలోని డిస్క్ లపై కుదింపులకు కూడా కారణమవుతుంది. అదనంగా దీర్ఘకాలిక నొప్పులు, క్షీణతకు దారితీస్తుంది.
వెన్ను నొప్పి
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, నరాలు, స్నాయువులతో పాటి ఇతర అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. నిరంతరం స్క్రీన్ లను చూస్తూ పని చేయడం వల్ల మెడ నొప్పి వస్తుంది. కళ్ళు కూడా దెబ్బతింటాయి. నీలిరంగు కాంతి కళ్ళని దెబ్బతీస్తుంది. కళ్ళు పొడిబారిపోయే విధంగా చేస్తుంది.
ఈ సమస్యల నుంచి బయట పడాలంటే నిటారుగా కుర్చీలో కూర్చోవాలి. కనీసం అరగంటకి ఒకసారైన లేచి కొద్ది దూరం అటు ఇటూ నడవటం మంచిది. కళ్ళు స్క్రీన్ వైపు చూడకుండా 20/20/20 రూల్ పాటించాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు కళ్ళు తిప్పడం, రెప్పలు వేయడం, కళ్ళు మూసుకోవడం వంటివి చేయాలి. అలా చేస్తే కళ్ళకి శ్రమ లేకుండా విశ్రాంతి ఇచ్చినట్టు అవుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.