Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది
ఉగాది రోజున ఏ నైవేద్యాలు చేయాలని ఆలోచిస్తున్నారా? సులువుగా అయిపోయే ఈ నైవేద్యాలు ప్రయత్నించండి.
ఉగాది పండుగ వచ్చిందంటే పచ్చడితోపాటు మరికొన్ని నైవేద్యాలను ఇష్టదైవానికి నివేదిస్తారు. ఆ రోజున సింపుల్‌గా అరగంటలో అయిపోయే ప్రసాదాలు రెడీ చేసుకోవడం ఉత్తమం. లేకుంటే పండగ రోజంతా వంటతోనే సరిపోతుంది. అలాంటి మూడు రెసిపీలు ఇవిగో.
అటుకుల పాయసం
అటుకులు - అరకప్పు
పంచదార - పావు కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
జీడిపప్పు - నాలుగు
ఎండు ద్రాక్ష - నాలుగు
యాలకుల పొడి - పావు టీ స్పూను
పాలు - రెండున్నర కప్పులు
తయారీ ఇలా
స్టవ్ మీద కళాయి పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో అటుకులను వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి. అవి వేగాక పాలను పోసి ఉడికించాలి. ఈ పాలు ముందుగా కాచి చల్లార్చుకున్నవి అయి ఉండాలి. పచ్చిపాలు పోయకూడదు. మరుగుతున్న పాల మిశ్రమంలో పంచదారని కూడా వేసి తిప్పుతూ గరిటతో కలుపుతూ ఉండాలి. అలా పది నిమిషాలు పాటూ ఉడికించాలి. తర్వాత యాలకుల పొడిని, డ్రై ఫ్రూట్స్‌ను కూడా వేసి కలపాలి. అంతే పాయసం రెడీ అయినట్టే. కేవలం 20 నిమిషాల్లో ఈ నైవేద్యం రెడీ అయిపోతుంది.
........................................................
మామిడికాయ పులిహోర
కావలసిన పదార్థాలు
మామిడి తురుము - రెండు కప్పులు
వండిన అన్నం - రెండు కప్పులు
పోపు గింజలు - కొద్దిగా
పచ్చిమిర్చి - ఆరు
అల్లం - చిన్న ముక్క
వేరుశనగ పలుకులు - 50 గ్రాములు
కరివేపాకు - రెండు రెమ్మలు
ఎండుమిర్చి - నాలుగు
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర టీ స్పూను
తయారీ ఇలా
ముందుగా అన్నం వండుకోవాలి. అన్నం ముద్దగా అవ్వకుండా పొడిపొడిగా వచ్చేలా చేసుకోవాలి. వండిన అన్నాన్ని గిన్నెలో అలా ఉంచేస్తే మెతుకులు ఒకదానికొకటి అతుక్కుని పొడిపొడిగా రావు. కాబట్టి వండిన అన్నాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో పరుచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశనగ పలుకులను వేయించాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో నూనె వేసి ఎండుమిర్చి, పోపు గింజలు వేసి వేయించాలి. అవి వేగాక ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పలుకులను, నిలువుగా కోసిన పచ్చిమిరపకాయలను, కరివేపాకును వేసి వేయించాలి. అందులోనే మామిడి తురుము, ఉప్పు కలిపి రెండు మూడు నిమిషాలు పాటూ గరిటెతో బాగా కలపాలి. ఆ మిశ్రమంలోనే అర్ టీ స్పూన్ పసుపు వేయాలి. అన్నీ బాగా కలిశాక ముందుగా వండుకున్న అన్నాన్ని కూడా వేసి కలుపుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకుంటే మంచి రుచిగా ఉంటుంది.
......................................
చంద్రకాంతలు
పూర్వకాలంలో ఎక్కువగా ఈ స్వీట్ రెసిపీని చేసుకునేవారు. ఇప్పుడు చాలామంది తగ్గించేశారు. వీటి రుచి చాలా బాగుంటుంది.
కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు - ఒక కప్పు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
పంచదార - ఒకటిన్నర కప్పు
జీడిపప్పు - 10 నుంచి 15
యాలకుల పొడి - ఒక స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
తయారీ ఇలా
1. పెసరపప్పును ముందే నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టి అందులో పంచదార వేసి కాస్త నీళ్లు పోసి కలపాలి.
2. పంచదార బాగా కరిగిపోయిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పెసరపప్పును వేసి కలపాలి. అది ఉడుకుతున్న సమయంలో తురిమిన కొబ్బరి, వేయించిన జీడిపప్పులను వేసి బాగా కలుపుకోవాలి.
3. చిన్న మంటపై ఆ మొత్తం మిశ్రమాన్ని అడుగంటకుండా కలుపుతూ ఉడికించాలి. ఆ మిశ్రమం కొద్దిగా గట్టిగా అయ్యేవరకు ఉంచి అప్పుడు యాలకుల పొడిని వేయాలి.
4. స్టవ్ ఆపేశాక, పెసరపప్పు మిశ్రమాన్ని ఒక ప్లేటులో సమానంగా పరిచి చల్లారనివ్వాలి. అయితే మరి పలుచుగా కాకుండా కోస్తే బర్ఫీ ముక్కల్లా వచ్చేలా ప్లేటులో మందంగా ఈ మిశ్రమాన్ని పరుచుకోవాలి.
5. చల్లారిన తర్వాత పెసర మిశ్రమాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
6. మరోపక్క స్టవ్ పై కళాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కాక కత్తిరించుకున్న ఈ పెసర ముక్కల్ని నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అవే చంద్రకాంతలు. తినడానికి చాలా రుచిగా ఉంటాయి.
Also read: ఉగాది రోజున షడ్రుచుల పచ్చడిని ఎందుకు తినాలి? ఆ పచ్చడి వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు ఏంటి?