Chicken Recipe: నోరూరించే చికెన్ మసాలా ఫ్రై - చూస్తేనే తినేయాలనిపిస్తుంది
చికెన్ వంటకాలంటే ఎంతో మందికి ఇష్టం. అందులోనూ చికెన్ వేపుడంటే మరీ ప్రీతి.
చికెన్ వంటకాలంటేనే నాన్ వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది. కొంతమంది స్పైసీగా, మరికొంతమంది నార్మల్‌గా చేసుకుంటారు. ఎలా వండినా కూడా టేస్టీగా ఉండడమే చికెన్ మసాలా ఫ్రై స్పెషాలిటీ. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. సాంబారుకు జోడీగా ఈ చికెన్ మసాలా ఫ్రై తింటే అదిరిపోతుంది. లేదా మెత్తని ముక్కలతో ఇది వండుకుని రోటీకి జతగా తిన్నా అదిరిపోతుంది.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - అరకిలో
అల్లం వెల్లుల్లి - పేస్ట్ ఒక స్పూను
మసాలా పొడి - అర స్పూను
నూనె నాలుగు - స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - ఒకటి
ఎండుమిర్చి - ఒకటి
ధనియాల పొడి - ఒక స్పూను
కారం - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
కరివేపాకులు - ఒక గుప్పెడు
తయారీ విధానం ఇలా
1. చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకులు వేసి బాగా వేయించాలి.
3. అవి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
4. ఇవన్నీ కూడా బాగా వేగాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేయాలి.
5.చికెన్లోని నీరు మొత్తం దిగి ఆవిరైపోయేదాకా వేయించాలి.
6. దీనికి 20 నిమిషాల సమయం పడుతుంది. చికెన్లో నీరు పోయాక కాస్త ధనియాల పొడి, ఎర్ర కారం, గరం మసాలా ఉప్పు వేసి బాగా కలపాలి.
7. చిన్న మంట మీద వేయించాలి. అవసరమైతే నాలుగు స్పూన్ల నీరు చల్లుకోవచ్చు. ఇలా పావుగంటసేపు ఫ్రై చేయాలి. అంతే చికెన్ మసాలా ఫ్రై రెడీ అయినట్టే.
ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులకు పండగే. ఆ రోజు చికెన్ వంటకాలు ఘుమఘుమలాడుతాయి. చికెన్ తినడం వల్లా ఆరోగ్యానికీ మంచిదే. దీనిలో కండరాలకు అవసరం అయ్యే ప్రొటీన్ నిండుగా ఉంటుంది. ఎముకలు గట్టిగా మారుతాయి. గుండె ఆరోగ్యానికి చికెన్ లోని పోషకాలు అవసరమే. ఇందులో నియాసిన్ పుష్కలంగా ఉంటుంది. అది గుండెకు ఎంతో ఆరోగ్యకరం. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ చికెన్ ముందుంటుంది. ముఖ్యంగా మిరియాలు వేసి చేసే చికెన్ సూప్ తాగడం వల్ల వ్యాధినిరోధక శక్తిప పెరుగుతుంది. చికెన్ వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నప్పటికీ అధికంగా తింటే మాత్రం శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకపోయే అవకాశం ఉంది. శరీరబరువును సమతులంగా ఉంచే గుణం చికెన్లో ఉంది. దీనికి కారణంగా చికెన్లో ఉండే ప్రొటీన్. ఇది సరైన శరీర బరువు నిర్వహించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే లక్షణాలు కూడా ఇందులో ఎక్కువే. మిగతా మాంసాలతో పోలిస్తే చికెన్ తినడం వల్ల దుష్ప్రభావాలు తక్కువ. మటన్, పంది మాంసం తినేవారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కానీ చికెన్ తో అలాంటి సమస్యలు రావు. బాలింతలకు రోజూ చికెన్ పెడితే మంచిది. పాలు అధికంగా పడే అవకాశం ఉంది. పోషకాలు కూడా ఎక్కువే.
Also read: ఏ చిరుధాన్యాలు ఏ ఏ వ్యాధులను అరికడతాయో తెలుసా? మధుమేహం ఉన్నవారికి ఏవి బెటర్?