ఏ చిరుధాన్యాలు ఏ ఏ వ్యాధులను అరికడతాయో తెలుసా? మధుమేహం ఉన్నవారికి ఏవి బెటర్?
చిరుధాన్యాలు తినే వారి సంఖ్య పూర్వం అధికంగా ఉండేది. ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది.
కరోనా వచ్చాక జరిగిన మంచి మార్పు ఏదైనా ఉందంటే అది ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడమే. అందుకే చిరుధాన్యాల వాడకం పై మళ్లీ ప్రజలు దృష్టి సారిస్తున్నారు. రాగులు, కొర్రలు, జొన్నలు, అరికెలు, సామలు, సజ్జలు వంటి వాటిని కలిపి చిరుధాన్యాలు అంటారు. అవి ఆరోగ్యానికి చేసే మేలు ఇంతా అంతా కాదు. అందుకే వీటిని సిరి ధాన్యాలు అని కూడా అంటారు. వీటిలో ఉండే క్యాలరీలు చాలా తక్కువ. కానీ ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఎంత తిన్నా బరువు పెరగరు. పూర్వం ఈజిప్టు, గ్రీస్ వంటి దేశాల్లో చిరు ధాన్యాలతో మద్యాన్ని తయారు చేసేవారు. అలాగే చైనా, జపాన్, ఇండోనేషియాలలో వీటిని నూడుల్స్ తయారీలోనూ వాడేవారు. మనదేశంలో మాత్రం జావగా, రొట్టెగా, సంకటిగా మార్చుకొని తినేవారు. ప్రస్తుతం ఆఫ్రికాలో మాత్రం ఇవే ప్రధాన ఆహారంగా ఉన్నాయి. మిగతా అన్ని దేశాల్లో దాదాపు ఇవి తినడం మానేసారనే చెప్పాలి. ఇప్పుడు మన దేశంలో కరోనా వచ్చాక వీటి వాడకం మళ్లీ పెరగడం ప్రారంభమైంది. అయితే ఈ చిరుధాన్యాల్లో ఒక్కో రకం కొన్ని రకాల అనారోగ్యాన్ని దూరం పెడుతుంది. అవి ఏంటో తెలుసుకోండి
కొర్రలు
కొర్రలు తినడం వలన ఎంతో ఆరోగ్యం. ఇది డయాబెటిస్ రోగులకు మంచి ఆహారం. శరీరంలో కొలెస్ట్రాల్ లేకుండా చూస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా ఇస్తాయి కొర్రలు. నరాలకు శక్తినివ్వడం, మానసికంగా దృఢంగా మార్చడం, ఆర్థరైటిస్, పార్కిన్‌సన్స్, మూర్ఛ రోగాల నుండి ఇది విముక్తిని ప్రసాదిస్తుంది.
అరికెలు
రక్తహీనత ఉన్నవారికి ఇది వరమనే చెప్పాలి. అలాగే డయాబెటిస్, మలబద్ధకం వంటి వారి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు అరికెలను రోజూ తినాలి. మంచి నిద్ర పట్టడానికి ఇది మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి బయట పడేస్తుంది.
ఊదలు
జీర్ణాశయానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. చిన్న పేగు, పెద్ద పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అవి క్యాన్సర్ బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఊదలను కూడా తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
అరికెలు
క్రీడాకారులకు అరికెలు ఎంతో ఉత్తమ ఆహారం అని చెప్పుకోవచ్చు. ఇవి చాలా శక్తిని ఇస్తాయి. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువు కూడా తగ్గుతారు. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. కంటి నరాల బలానికి ఇవి మంచి ఆహారం. ఋతుక్రమం సరిగా రాని స్త్రీలు అరికెలు తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
సామలు
అతిసారం, అజీర్ణం, కొన్ని రకాల సుఖ వ్యాధులు, ఆడవారి రుతు సమస్యలకు సామలు మంచి పరిష్కారాన్ని చూపిస్తాయి. మైగ్రేన్ నుంచి కూడా త్వరగా ఉపశమనం ఇస్తాయి. గుండె సమస్యలు, ఊబకాయం, కీళ్ల నొప్పులతో బాధపడేవారు సామలను రోజూ తినడం వల్ల ఉపయోగం ఉంటుంది.
Also read: ప్రేమికులకు ఈరోజు చాకొలెట్ పండుగ - హ్యాపీ చాకొలెట్ డే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.