Salt for Vastu: ఉప్పుతో వాస్తు దోషాలను తొలగించవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?
ఇంట్లో ఉప్పును ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయా? ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీలు బయటకు పోతాయా? దీనిపై వాస్తు పండితులు ఏం చెబుతున్నారు?
వాస్తు శాస్త్రంలో ఉప్పుకు విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా మన పెద్దలు ఉప్పును తొక్కడం గానీ, దొంగతనం కూడా చేయకూడదని చెప్పేవారు. అలాగే ఉప్పును చేతితో తీసుకోకూడదని కూడా చెబుతారు. ఎందుకంటే.. ఉప్పును శనీశ్వరుడిగా భావిస్తారు. అందుకే.. ఒకరి చేతి నుంచి మరొకరికి దాన్ని ఇవ్వకూడదని, అప్పుగా తీసుకోకూడదని అంటారు. అయితే, పూర్వకాలంలో ఉప్పు కొరత ఎక్కువగా ఉండేదట. దాని వల్ల చాలామంది ఉప్పును దొంగిలించేవారట. అది నివారించడం కోసమే ఉప్పును శనీశ్వరుడనే వదంతి పుట్టించారి చెబుతుంటారు. అయితే, కూరలను రుచిగా చేసేది ఉప్పే కాబట్టి.. దాన్ని మన పూర్వికులు శనీశ్వరుడిగా భావించేవారని తెలుపుతుంటారు. అందుకే ఉప్పును తొక్కడం, ఉప్పు మూటలపై కూర్చోవడం వంటివి దోషమని చెబుతారు. అయితే, ఉప్పు వల్ల చెడు మాత్రమే జరుగుతుందని భావిస్తే తప్పే. వాస్తు శాస్త్రం, మరికొందరు వాస్తు నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పు ఇంట్లో ఉండటం చాలా మంచిదట.
ఈ రోజుల్లో ఉప్పుకు కొరత లేదు. సముద్రపు ఉప్పుతోపాటు.. రాక్ సాల్ట్ కూడా అందుబాటులో ఉంటోంది. కాబట్టి.. సులభంగానే ఈ వాస్తు చిట్కాలను పాటించవచ్చు. అవేంటో చూసేద్దామా!
⦿ ఉప్పు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని దూరం చేసి.. పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందట.
⦿ పడక గదిలో ఉప్పును ఉంచితే అనారోగ్యం దరిచేరదట.
⦿ ఎర్ర రంగు వస్త్రంలో ఉప్పు కట్టి ఉంచి గుమ్మానికి వేలాడదీస్తే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. దిష్టి, చెడు ప్రభావాలు తొలగిపోతాయి.
⦿ ఉప్పును వస్త్రంలో కట్టి పెట్టడం వల్ల కొందరికి అదృష్టం కూడా కలిసి వస్తుందట.
⦿ ఇంటి చుట్టూ ఉప్పును చల్లితే మొత్తం నెగటివ్ ఎనర్జీని అది లాగేసుకుంటుందట. అప్పుడు కష్టలే ఉండవని అంటున్నారు.
⦿ ఇంటి ముందు బకెట్ లేదా చిన్న పాత్రలో నీరు, ఉప్పు కలిపి ఉంచితే.. అది నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందట.
⦿ ఆ ఉప్పు నీటిని ఎప్పటికప్పుడు మార్చాలి. ఎక్కడపడితే అక్కడ ఆ నీటిని పారబోయరాదు. శరీరంపై పడకుండా డ్రైనేజీ లేదా టాయిలెట్‌లో పారబోయాలి.
⦿ అరచేతిలో ఉప్పు వేసుకుని కడిగితే.. డబ్బు రావడం మొదలవుతుందని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు.
⦿ బాత్‌రూమ్‌లో ఉప్పు పెడితే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు తొలగిపోతాయట.
⦿ ఇంట్లో వివిధ ప్రాంతాల్లో ఉప్పును ఉంచితే ధనలాభం కలుగుతుందట.
⦿ ఒత్తిడి లేదా మనసు ఆందోళనకరంగా ఉన్నట్లయితే ఉప్పును చిన్న పొట్లంలా చుట్టుకుని జేబులో పెట్టుకుంటే సత్ఫలితం ఉంటుందట.
⦿ ఇంట్లోని డెకరేషన్ వస్తువులను అప్పుడప్పుడు ఉప్పు నీటితో కడిగితే పాజివ్ ఎనర్జీ ఇంట్లోనే ఉంటుంది.
⦿ నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కాళ్లను పెట్టాలి. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. నెగటివ్ ఎనర్జీ కూడా దరిచేరదు.
అదే పనిగా ఉప్పును వాడేసినా దోషమే: వాస్తుకు మంచిదని అదేపనిగా ఇల్లంతా ఉప్పుతో నింపేసినా సమస్యే. నెగటివ్ ఎనర్జీని గ్రహించే ఉప్పును ఎప్పుడు కొద్ది మేరకు మాత్రమే ఉపయోగించాలి. అతిగా వాడితే ఉప్పు నెగటివ్ ఎనర్జీకి వాహకంగా మారే ప్రమాదం ఉందని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. ఆ ఉప్పును అలాగే ఉంచేయకుండా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. శరీరం మీద లేదా ఇంట్లో గానీ ఉప్పు పడితే వెంటనే కడిగేయాలి. గదులను తుడిచేప్పుడు ఆ నీటిలో కాస్త ఉప్పు వేయడం మంచిదేనట.
Also Read: పాలు ఏ వేళలో తాగితే మంచిది? రాత్రి నిద్రపోవడానికి ముందు తాగొచ్చా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Also Read: మనుషుల కంటే ముందే అంతరిక్షానికి వెళ్లిన ఆ కుక్క, కోతులు ఏమయ్యాయి?
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. మన వాస్తు శాస్త్రలు, పండితులు చెప్పిన వివరాలను కూడా యథావిధిగా అందించాం. మూఢ విశ్వాసాలను పెంపొందించే ఉద్దేశం కాదని గమనించగలరు. దీనికి ‘ఏబీపీ దేశం’ ఎటువంటి బాధ్యత వహించదు.