Cholesterol: మొక్కల ఆధారిత ఆహారాలతో కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది- గుండె జబ్బుల భయమే ఉండదు
కొలెస్ట్రాల్ పెరుగుదల అన్ని విధాలా అనార్థమే. గుండె సహా ప్రధాన అవయవాలని ప్రమాదంలో పడేస్తుంది.
మొక్కల ఆధారిత ఆహారాలు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? లేదా అనేది ఎంతో మందికి ఉన్న అనుమానం. జంతు ఆధారిత పదార్థాలు పూర్తిగా నివారిస్తే కొలెస్ట్రాల్ పెరగదని నమ్ముతారు. మరి ఈ రెండింటిలో వాస్తవం ఏది? నిజంగానే జంతు ఆధారిత పదార్థాలు తీసుకోకపోతే కొలెస్ట్రాల్ చేరదా? అంటే అవన్నీ కేవలం అపోహ మాత్రమే అని కొట్టి పారేస్తున్నారు నిపుణులు. యూరోపియన్ హార్ట్ జర్నల్ ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం మొక్కల ఆధారిత ఆహారాలు మొత్తం కొలెస్ట్రాల్ ని 7 శాతం వరకు తగ్గిస్తాయని వెల్లడించింది. లిపోప్రోటీన్ ని 14 శాతం తగ్గించగలదు. అది మాత్రమే కాదు గుండె జబ్బుల ప్రమాదాన్ని 5 సంవత్సరాలు తగ్గించగలదని కనుగొన్నారు.
కొలెస్ట్రాల్ మీద మొక్కల ఆధారిత వనరులు ఏవిధమైన ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు 1980 నుంచి 2022 మధ్య ప్రచురించిన 30 విభిన్నమైన ఫలితాలని విశ్లేషించారు. మాంసం, పాల ఉత్పత్తులు గుడ్లు వంటి జంతు మూలాల నుంచి తీసుకోబడిన కొన్ని ఆహారాలలో సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. గుండె ప్రమాదాన్ని కలిగిస్తాయి. సంతృప్త కొవ్వులున్న ఆహారం కొలెస్ట్రాల్ స్థాయిలని మరింత ఎక్కువ చేస్తుంది.
మొక్కల ఆధారిత ఆహారాల్లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్, లిపోప్రోటీన్ స్థాయిల్ని తగ్గిస్తుంది. వోట్మీల్,, యాపిల్, బీన్స్ వంటి ఆహరాలు శరీరం కొలెస్ట్రాల్ ని గ్రహించకుండా నిరోధిస్తుంది. రోజుకి కనీసం 10 గ్రాముల ఫైబర్ తీసుకోవడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని తేలింది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని చాలా వరకు తొలగిస్తుంది. వోట్మీల్, బార్లీ పిండి, నువ్వులు, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడి గింజలు, చియా విత్తనాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, సోయా బీన్, టోఫు, సోయా పాలు వినియోగించినప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా తగ్గుతాయి.
ఇలా చేయండి
⦿ఉదయాన్నే నిద్రలేవగానే గోరు వెచ్చని నీటితో కొన్ని విత్తనాలు తీసుకోవడం మంచిది.
⦿కొబ్బరి నీళ్ళు తాగితే ఎలక్ట్రోలైట్ సమతుల్యతని కాపాడుకోవచ్చు. అల్పాహారంలో తృణధాన్యాలు, బార్లీ చపాతీ చేర్చుకోవచ్చు. ఇవి కొలెస్ట్రాల్ ని కరిగిస్తాయి.
⦿పండ్లు, దోసకాయ, ఉల్లిపాయ, టొమాటో వేసి సలాడ్ చేసుకోవచ్చు. రోజుకి రెండు సార్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది.
⦿వంట చేయడానికి ఆవాల నూనె ఉపయోగించడం మంచిది.
జంతువుల కొవ్వులు తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కొవ్వు చేపలు, రెడ్ మీట్, పాల ఉత్పత్తుల్లో ఉంటాయి. అయితే వాటిని మితంగా తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే మగవారు రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్టే!