Pineapple Recipe: పైనాపిల్ హల్వా, ఇలా చిటికెలో చేసేయచ్చు
పైనాపిల్‌తో వంటకాలు మంచి సువాసనతో పాటూ చాలా రుచిగా ఉంటాయి.
పైనాపిల్ పేస్ట్రీలు, కేకులు అంటే ఎంతో మందికి ఇష్టం. వాటి ఫ్లేవర్ మనసును లాగేస్తుంది. ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో సులువుగా పైనాపిల్ హల్వాను చేసుకోవడం ఇక్కడ చెప్పాం. ఇది రుచితో పాటూ ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. పిల్లలకు చాలా నచ్చేలా ఉంటుంది దీని టేస్ట్. ఎలా చేయాలో చదవండి మరి.
కావాల్సిన పదార్థాలు
పైనాపిల్ ముక్కలు - రెండు కప్పులు
పంచదార - 200 గ్రాములు
కోవా - అర కప్పు
నెయ్యి - రెండు స్పూనులు
యాలకుల పొడి - ఒక టీస్పూను
జీడిపప్పులు - నాలుగు
కిస్‌మిస్‌లు - ఎనిమిది
తయారీ ఇలా
1. పైనాపిల్ పండ్లను చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
2. ముక్కలు పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. నీళ్లు ఉండకూడదు.
3. స్టవ్ పై కళాయి పెళ్లి నెయ్యి వేయాలి. అందులో పైనాపిల్ ముక్కలను వేసి వేయించాలి.
4. ముక్కలు కాస్త వేగి మెత్తగా అవుతాయి. ఆ సమయంలో పంచదార, కోవా ముద్ద కూడా వేసి బాగా కలపాలి.
5. యాలకుల పొడి, జీడిపప్పులు తురుములు కూడా వేసి బాగా కలపాలి.
6. అంతా దగ్గరగా ముద్దలా అయ్యేదాకా కలియబెట్టాలి. స్టవ్ చిన్న మంట మీద ఉండేలా చూసుకోవాలి. లేకుంటే మాడిపోయే ప్రమాదం ఉంది. చివరగా కిస్‌మిస్‌లు చల్లి స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ పైనాపిల్ హల్వా రెడీ అయినట్టే. మీరు వండుతున్నప్పుడే మంచి సువాసన వస్తుంది హల్వా.
7. ఒక ప్లేటులో పైనాపిల్ హల్వాను వేసి ముక్కలుగా కోసుకోవాలి.
తింటే ఎన్ని ప్రయోజనాలో...
పైనాపిల్ పండు కొయ్యడం కష్టమని చాలా మంది కొనడానికే ఇష్టపడరు. కానీ దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు ఒక్కసారి మూడు ముక్కల దాకా తినగలరు. ఆ తరువాత కొంచెం నాలుక పూసినట్టు అవుతుంది. అదే ఇలా హల్వా చేసుకుంటే ఎంతైనా తినేయగలరు. ఈ పండులో 85 శాతం నీరే. చక్కెర 13 శాతమే ఉంటుంది. వీటిలో A, B, C విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీని తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కూడా కరుగుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పండుకు కాస్త తేనె రాసుకుని తింటే శక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి అనాస చాలా మేలు చేస్తుంది. ఈ పండు రసం గొంతు నొప్పిని తగ్గిస్తుంది. దీనిలో ఉండే పోషకాలు చర్మాన్ని మెరిపిస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఇవి ముందుంటాయి.
Also read: కార్డియాక్ అరెస్టు, హార్ట్ ఎటాక్ ఒక్కటి కాదా? రెండింటికీ ఏంటి తేడా?
Also read: గర్భంతో ఉండగానే మళ్లీ గర్భం ధరించడం సాధ్యమేనా? అదే జరిగిందిక్కడ