Soba Noodles: జపాన్ వారి సోబా నూడిల్స్ ట్రై చేశారా... ఎంత రుచో, అంత ఆరోగ్యం కూడా
పేరు చూసి వెరైటీగా ఉందనుకుంటున్నారా? ఇవి కూడా నూడిల్సే, కాకపోతే సాధారణ నూడిల్స్ తో పోలిస్తే పోషకాలు ఎక్కువ.
జపాన్లోని ప్రజలు ఎక్కువగా తీసుకునే ఆహారం ఇది. దీంతో పోషకాలు పుష్కలంగా అందుతాయి. అందుకే ఇది జపాన్ నుంచి వివిధ దేశాలకు ప్రయాణం కట్టింది. మనదేశంలో కూడా ఇప్పుడిప్పుడే దీని గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ సోబా నూడిల్స్ ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంచుతున్నారు. నూడిల్స్ తినే అలవాటు ఉన్న వాళ్లకి ఈ సోబా నూడిల్స్ కచ్చితంగా మంచి ఎంపిక అవుతుందని అంటున్నారు జపాన్ న్యూట్రిషనిస్టులు.
సోబా నూడిల్స్ ని బుక్వీట్ అనే ఒక రకమైన గోధుమగింజల పొడితో తయారుచేస్తారు. సాధారణ గోధుమలతో పోలిస్తే ఇవి ఆకారంలోనే కాదు, పోషకాలు, గుణంలో కూడా భిన్నమైనవి. పిండి, నీళ్లు కలిపి చేసే నూడిల్స్ ఇవి. జపాన్లో ఏ మూలకు వెళ్లినా ఈ నూడిల్స్ అందుబాటులో ఉంటాయి. బుక్వీట్ మొక్కలకు పూలతో పాటూ, విత్తనాలు కాస్తాయి. ఆ విత్తనాలే బుక్వీట్ గింజలు. ఇవి గోధుమజాతికి చెందినవే అయినా వాటిని ఏ విషయంలోను పోలి ఉండవు.
తింటే లాభాలేంటి?
1. ఒక కప్పు సోబా నూడిల్స్ లో 0.4మైక్రో గ్రాముల మాంగనీసు లభిస్తుంది. రోజుకి మన శరీరానికి అవసరమయ్యే మాంగనీసు పరిమాణం అది. ఎముకల ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. మాంగనీసు లోపిస్తే ఆస్టియోపోరోసిస్, మధుమేహం, ఎపిలెప్సీ వంటి చాలా రోగాలు దాడి చేస్తాయి.
2. విటమిన్ బి1గా పిలిచే థియామిన్ జీవక్రియకు, శరీరంలోని కణాలు ఆరోగ్యంగా పెరిగేందుకు, పనిచేసేందుకు అత్యవసరం. బుక్వీట్ పిండిలో థియామిన్ పుష్కలంగా ఉంది. ఈ విటమిన్ లోపిస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 2013లో చేసిన ఓ అధ్యయనంలో థియామిన్ లోపం మతిమరుపు వ్యాధికి కారణం అవుతుందని తేలింది.
3. ఒక కప్పు సోబా నూడిల్స్ ద్వారా 6 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. శరీరం సక్రమంగా పనిచేసేందుకు ప్రోటీన్ చాలా అవసరం. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
4. బరువు తగ్గాలనుకునేవారికి సోబా నూడిల్స్ మంచి ఎంపిక. ఇందులో కరిగే లక్షణమున్న ఫైబర్ ఉంటుంది. 2009లో చేసి అధ్యయనం ప్రకారం ఈ ఫైబర్ వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది.
5. గుండె ఆరోగ్యానికి కూడా బుక్వీట్ సాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను, అధిక రక్తపోటును నిరోధిస్తుంది. కణాల నాశనాన్ని అడ్డుకుంటుంది.
6. సాధారణ గోధుమలతో చేసిన నూడిల్స్ తో పోలిస్తే బుక్వీట్ గింజలతో చేసిన నూడిల్స్ లో కార్బోహైడ్రేట్లు తక్కవగా ఉంటాయి. ఒక కప్పు నూడిల్స్ లో 24 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్, కార్బోహైడ్రేట్లను మెల్లగా కరిగేలా చేస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయులు హఠాత్తుగా పెరగవు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: లగ్జరీ ద్రాక్ష.. ఒక్క పండు తినాలంటే రూ.35,000 ఖర్చుపెట్టాలి
Also read: పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Also read: ఆకుకూరల గురించి అపోహలు వీడమంటున్న ఆయుర్వేదం