Leafy Green Vegetables: ఆకుకూరల గురించి అపోహలు వీడమంటున్న ఆయుర్వేదం
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. నిజమే కానీ వాటి విషయంలో ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి.
సంపూర్ణ ఆరోగ్యానికి అన్నిరకాల ఆహారంతో పాటూ ఆకుకూరలు కూడా తీసుకోవడం చాలా అవసరం. నిజానికి చాలామందికి ఇవి నచ్చవు కానీ కరోనా వచ్చాక వీటి వినియోగం బాగా పెరిగింది. దీని ద్వారా అధిక పోషకాలు అందుతాయని, కేలరీలు కూడా శరీరంలో అధికంగా చేరవని భావిస్తారు. ఎక్కువ మొత్తంలో తీసుకున్నా ఎలాంటి సమస్యా ఉండదని అనుకుంటారు. ఆకుకూరలను పచ్చిగా సలాడ్ల రూపంలో చాలా మంది తింటారు. అయితే వీటి విషయంలో ఉన్న కొన్ని అభిప్రాయాలు, అపోహలు నిజమో కాదో, వాటి విషయంలో ఆయుర్వేదం ఏం చెబుతుందో డాక్టర్ అల్కా విజయన్ తన ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. గతంలో జరిగిన కొన్ని అధ్యయనాల ఫలితాను కూడా ఇక్కడ మేము జతచేరుస్తున్నాం.
అపోహ: ఆకుకూరలు ఇట్టే అరిగిపోతాయి
నిజం: వీటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని జీర్ణం చేసేటప్పుడు మీ పొట్టపై చాలా ఒత్తిడి పడుతుంది. సరిగ్గా నమిలినప్పటికీ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. త్వరగా అరిగిపోతాయి అన్నది నిజం కాదు.
అపోహ: ఆకకూరలలో నీటి శాతం అధికంగా ఉంటుంది
నిజం: ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరల సలాడ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో వాతాన్ని పెంచుతుంది. అధికమొత్తంలో తినడం వల్ల పొట్ట ఉబ్బరం, నొప్పి, గ్యాస్, కీళ్లనొప్పులు వంటి సమస్యలకు దారి తీస్తుంది.
అపోహ: రాత్రి పూట సలాడ్ లు ఉత్తమమైన ఆహారం
నిజం: రోజులో చాలా తేలికగా ఆహారం తీసుకోవాల్సింది రాత్రిపూటే. పచ్చిగా ఉండే సలాడ్ లను తినడం వల్ల పొట్టమీద అధిక ఒత్తిడి పడుతుంది. ఆ ఆహారాన్ని విచ్చిన్నం చేసి అరిగేలా చేయడానికి చాలా శక్తి అవసరం. అందుకే రాత్రి పూట సలాడ్ లను తీసుకోవడం మంచి ఎంపిక కాదు.
అపోహ: ఫైబర్ అధికంగా ఉండే ఆకుకూరలు చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
నిజం: అతి ఏదైనా అనర్థమే. ఇందుకోసం ఆకుకూరలు అధికంగా తింటే వాతం కలిగి జుట్టు పలుచబడే అవకాశం ఉంది. పచ్చిగా ఆకుకూరలు, కాయగూరలు తినే సలాడ్లతో ఈ నష్టం ఎక్కువవుతుంది.
అపోహ: మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
నిజం: సలాడ్లను తీసుకునే మొదట్లో అవి బరువు తగ్గడానికి సహకరిస్తాయి. కానీ వాటిని రోజూ తీసుకోవడం ప్రారంభిస్తే, వాటి వల్ల పేగులు పొడిబారిపోయే అవకాశం ఉంది. దీని వల్ల మలబద్ధకం కలుగవచ్చు.
ఆకుకూరలను అన్ని రకాల ఆహారాలతో కలిపి సమతులంగా తీసుకుంటే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Also read: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?
Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం
Also read: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు