Good Sleep: గాఢమైన నిద్ర కావాలా? రాత్రి ఈ పానీయాలను తాగితే సరి
నిద్ర పట్టకపోవడం అనే సమస్య చాలా మందికి ఉంది. చిన్ని చిన్న చిట్కాలతో ఆ సమస్నను అధిగమించవచ్చు.
శరీరానికి ఆహారం ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం. రెండింటిలో ఏది తగ్గినా శరీరం సరిగా పనిచేయలేదు. కుంగిపోతుంది, నీరసం ఆవహిస్తుంది. అందుకే ఆహారం సమపాళ్లలో తినడమే కాదు, నిద్ర కూడా ఎనిమిది గంటలకు తగ్గకుండా చూసుకోవాలి. ఇందుకోసం మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడంతో పాటూ, కింద చెప్పిన పానీయాలు తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ పానీయాలు నిద్ర హార్మోనును అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేసి నిద్ర పట్టేలా చేస్తాయి.
1.రాత్రి పాలు తాగే అలవాటు పిల్లలు మాత్రమే అనుకుంటారు. కానీ నిద్ర సరిగా పట్టని పెద్దలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. గోరువెచ్చని పాలలో ఒక స్పూను తేనె కలిపి తాగితే చాలా మంచిది. ఈ పానీయం ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. దీంతో నిద్ర ముంచుకొస్తుంది. ఒత్తిళ్లు,ఆందోళనల గురించి మర్చిపోయి హాయిగా నిద్రపోండి.
2. మెంతులు షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తాయన్న సంగతి తెలిసిందే. అంతేకాదు నిద్రకు కూడా సహకరిస్తాయి. ఒక టీస్పూను మెంతులు గ్లాసు నీటిలో నానబెట్టి దాదాపు ఎనిమిది గంటలు వదిలేయాలి. వాటిని రాత్రి నిద్రపోవడానికి అరగంట ముందు తాగాలి.
3. దాల్చిన చెక్కతో చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నిద్ర పట్టేలా చేయడం. ఒక కప్పు నీటిలో చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి కాసేపు మరిగించాలి. ఆ నీటిని గోరు వెచ్చగా అయ్యాక అందులో తేనె కలిపి తాగితే మంచిది. గాఢ నిద్ర పట్టే అవకాశం ఉంది.
4. ద్రాక్ష రసం మత్తు కలిగిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంట్లో ద్రాక్ష పండ్లు ఉంటే భోజనం చేశాక ఒక కప్పు నిండా నల్ల ద్రాక్షలను తింటే మంచిది. లేదా జ్యూసు చేసుకుని తాగినా మంచిదే. వీటిల్లో నిండుగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి.
ఇవి మానేయండి...
1. సాయంత్రం అయిదు దాటాక కాఫీ, టీలు తాగడం మానేయలి. ఇవి నిద్రను దూరం చేస్తాయి.
2. అలాగే ఆల్కహాల్, సిగరెట్లు తాగడం మానేయాలి. ఇవి కూడా నిద్ర దేవతను రాకుండా అడ్డుకుంటాయి.
3. పడుకునే ముందు ఫోను చూసే అలవాటును పక్కన పెట్టండి. పుస్తకాలు చదివితే నిద్ర చక్కగా పట్టేస్తుంది. కాబట్టి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి.
4. రాత్రిపూట అధికంగా మసాలా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. బిర్యానీలాంటివి లాగించడం వల్ల కూడా నిద్ర దూరమవుతుంది.
Also Read: తెలివైన వారే ఇందులో ఎన్ని ముఖాలు ఉన్నాయో చెప్పగలరు, కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు
Also Read: రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే ఎన్నో సమస్యలు, ఇలా పెంచుకోండి