నా భార్య డబ్బు మొత్తం ఖర్చుపెట్టేస్తోంది, ఆమెను మార్చడం ఎలా?
ఖర్చులు అధికంగా పెట్టే భార్యతో వేగలేని ఓ భర్త వేదన ఇది.
‘నా భార్య ఉద్యోగం చేసేది. తన ఉద్యోగాన్ని రెండేళ్ల క్రితం విడిచిపెట్టింది. జాబ్ వదిలేసే ముందు కనీసం నాకు చెప్పలేదు కూడా. అప్పట్నించి కుటుంబ ఆర్ధిక బాధ్యత మొత్తం నామీదే పడింది. ఆమె ఉద్యోగం మానేయడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి. అయినా ఆమె తన కోసం విలాస వంతమైన వస్తువులు కొనుక్కోవడం తగ్గించలేదు. ఇంటి ఆర్ధిక పరిస్థితి బాగోలేదని తెలిసి కూడా తన ఖర్చులు తగ్గించుకునేందుకు ఇష్టపడడం లేదు. ఆమె పెట్టే ఖర్చు వల్ల నేను అప్పుల పాలవుతున్నాను. మానసిక ఆరోగ్యం కూడా కుంగిపోతోంది. ఆమెను ఎలా మార్చాలో చెప్పండి’
- సురేష్, వైజాగ్
ప్రతి కుటుంబంలో ఎక్కువగా ఆర్ధిక వ్యవహారాలే గొడవలకు కారణం అవుతాయి. మీకొచ్చే ఆదాయాన్ని బట్టి ఆర్ధిక ప్రణాళికను రూపొందించుకుంటే ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. మీలో మీరు బాధపడడం మానేయండి. ఆమెతో కూర్చుని సున్నితంగా చర్చించండి. కఠినంగా లేదా స్వరం పెంచి ఇలాంటి విషయాల మాట్లాడితే అవి చివరకు గొడవలకే దారి తీస్తాయి. ఆమెతో ప్రేమగానే ఆర్ధిక అంశాలపై చర్చించండి. వచ్చే ఆదాయాన్ని, ఆమె చేసే ఖర్చును ఆమె ముందే లెక్కగట్టి చెప్పండి. అలాగే అప్పులు ఎన్నున్నాయో కూడా వివరించండి. ఆమెను అప్పుడు తీర్చే సలహాను కూడా అడగండి. మీరు ఇంటి ఆర్ధిక పరిస్థితిని మీ భార్యకు వివరించకుండా, ఖర్చులు తగ్గించుకోమని చెబితే ఆమె వినే అవకాశం తక్కువే. కాబట్టి ఈ విషయంలో మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి. మీ ఆదాయాన్ని, ఖర్చును కూడా ఆమెకు నిష్కపటంగా తెలియజేయండి. ఇంటిని నడిపే బాధ్యత ఆమెకే ఇవ్వండి. ఉన్న వనరులతోనే ఇంటిని నడపమని చెప్పండి. మీరు ఉద్యోగ బాధ్యతను తీసుకుని, ఇంటి బాధ్యతను ఆమెకు పూర్తిగా అప్పజెప్పితే ఖర్చుల విషయంలో కాస్త నిలకడ రావచ్చు. మీ వద్ద క్రెడిట్ కార్డులు ఉంటే వాటిని ముందు క్యాన్సిల్ చేసుకోండి. నెలకు మీకు వచ్చే ఆదాయంతోనే బతకడం అలవాటు అయ్యేలా చేసుకోండి.
డబ్బును జాగ్రత్తగా వాడడం అనేది ఒక పెద్ద బాధ్యత. డబ్బును సరిగా ఉపయోగించే వారి వద్ద లక్ష్మీదేవి నిలుస్తుందని పెద్దలు అంటారు. పొదుపు చేయడం ఒక కళ. ఆ కళను ఆమె నేర్చుకునేలా చేయాలి. ఖర్చు పెట్టడంలోనే కాదు, పొదుపు చేయడంలో కూడా ఆనందం ఉందని ఆమె అర్థం చేసుకునేలా చేయాలి. ముఖ్యంగా పొదుపు చేసిన డబ్బుతో భవిష్యత్తులో ఎలా నిర్మించుకోవాలో కూర్చుని ఆమె చర్చించండి. అప్పులు పెరగడం వల్ల సమస్యలు పెరుగుతాయి, అదే పొదుపు వల్ల ఆనందం, ధైర్యం పెరుగుతుంది. అది అనుభవించిన వారికే తెలుస్తుందని ఆమెకు వివరించండి. అప్పులు పెరిగి, అప్పుల వాళ్లు వేధిస్తుంటే ఆ పరిస్థితి ఎంత దీనంగా ఉంటుంది ఆమెకు వివరించండి. అవసరమైతే అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్న వారి చేత మాట్లాడించండి. ఇవన్నీ చేస్తే ఆమెలో కాస్త మార్పు రావచ్చు. ముందుగా మీరు ధైర్యంగా ఉండి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Also read: ఈ పండ్లు పేరేమిటో తెలుసా? కనిపిస్తే కచ్చితంగా తినాల్సిందే